– నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మద్దతు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టా హక్కు పత్రాలు, పట్టా పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో గిరిజన సాగు భూముల హక్కుల కోసం రైతులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సర్వే నంబర్లు 33, 37, 38, 122లోని భూములపై పలుమార్లు జాయింట్ సర్వే నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అనాదిగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ శాఖకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశానని తెలిపారు. దాని ఫలితంగా కొంతమంది గిరిజన రైతులకు పట్టా పాస్‌పుస్తకాలు మంజూరయ్యాయని గుర్తుచేశారు. ముందస్తు ఎన్నికల కారణంగా తన పదవీకాలం ఆరు నెలల ముందే ముగిసిందని, అనంతరం వచ్చిన ఎమ్మెల్యేల హయాంలోనూ కొంతమేర పట్టా పాస్‌పుస్తకాలు అందజేశారని తెలిపారు.
వేదాంతపురం పరిధిలో సుమారు 426 ఎకరాల భూమిని సాగు చేస్తున్న 150 మంది రైతులకు తక్షణమే పట్టా హక్కు పత్రాలు మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల భూములకు హక్కు పత్రాలు అందే వరకు వారి తరఫున పోరాడుతానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి గిరిజన రైతుకు భూ హక్కులు కల్పించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కాసాని చంద్రమోహన్, మాజీ జెడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు,సత్యవరపు సంపూర్ణ, డాక్టర్ భూక్యా ప్రసాద్, జక్కుల రాంబాబు, మోటూరి మోహన్, శెట్టిపల్లి రఘురాం, తగరం జగన్నాథం, పాలవలస జీవన్‌రావు, సాధు జోస్నాబాయి, నార్లపాటి చిన్న అబ్బాయి, బాలి కిరణ్, బజరయ్య పాల్గొన్నారు.



