నవతెలంగాణ – ముధోల్
ద్విచక్ర వాహనదారులకు రోడ్డు ప్రమాద సమయంలో హెల్మెట్ తలకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందనటానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళ్తే… పోలిసులు , ప్రయాణికుల కధనం ప్రకారం..ముధోల్ మండలంలోని ముద్గల్ ఎక్స్ రోడ్ సమీపాన శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైంసా నుంచి ముధోల్ కు వెళ్తున్న ద్విచక్ర వాహనం, ముధోల్ వైపు నుండి భైంసా కు వెళ్తున్న టవేరా ఎదురెదురుగా వస్తున్నాయి. అయితే ద్విచక్ర వాహనం అదుపుతప్పి టవేరా వాహనం కు ఢీకొన్నాయి. అయితే ద్విచక్ర వాహనదారుడు కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన మధుకర్ హెల్మెట్ ధరించి ఉండటంతో తలకు ఎలాంటి గాయాలు కాలేదు. కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ సంఘటన హెల్మెట్ ప్రాధాన్యతను మరోసారి తెలియజేసినట్టు అయింది. అయితే ద్విచక్ర వాహనదారుడు, టవేరా వాహనదారుడు ఒకే గ్రామానికి చెందిన వారు . హెల్మెట్ వల్లనే ద్విచక్ర వాహనదారుడికి రక్షణ కవచంగా ఉపయోగపడిందని ఆ రోడ్డు వెంబడి ప్రయాణించే ప్రయాణికులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ హుటా హుటిన సంఘటన స్థలానికి వెళ్ళారు. సంఘటన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రున్ని అంబులెన్స్ లో భైంసా ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలకు రక్షణగా ఉంటుందని ఎస్సై తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.



