Sunday, August 16, 2026
E-PAPER
Homeజాతీయందేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది

దేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది

- Advertisement -

దేశంలో పేద‌రికం, ఆక‌లి, నిరుద్యోగం…
ప్రధాని మోడీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్య ప్రజాస్వామ్య హక్కులకు, పౌర స్వేచ్ఛకు ముప్పు :
సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ
కేంద్ర కార్యాల‌యంలో మువ్వెన్న‌ల జెండా ఆవిష్క‌ర‌ణ‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ఒక‌ప‌క్క పేద‌రికం, ఆక‌లి, నిరుద్యోగం ఉంద‌నీ, మ‌రోవైపు అంబానీ, అదానీ వంటి బిలియ‌నీర్లు పుట్టుకొస్తున్నార‌ని సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ అన్నారు. 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో భాగంగా శ‌నివారం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ కార్యాలయంలో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ మువ్వెన్న‌ల జెండాను ఎగురువేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ సంద‌ర్భంగా ఎంఎ బేబీ మాట్లాడుతూ… దేశ ప్ర‌జ‌లందరికీ స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏండ్లు గడిచాక, ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంగా మనం చెప్పుకోదగ్గ పురోగతిని సాధించామ‌ని అన్నారు. అదే సమయంలో, దేశంలో లక్షలాది మంది విద్యావంతులైన యువత నిరుద్యోగులుగానే మిగిలిపోయార‌ని తెలిపారు. కోట్లాది మంది భారతీయులకు కనీస అర్థవంతమైన అవకాశాలు కూడా లభించడం లేద‌ని అన్నారు. ఒకవైపు అంబానీ, అదానీ వంటి బిలియనీర్లు ఆవిర్భవిస్తున్నార‌నీ, మరోవైపు పేదరికం, ఆకలి, నిరుద్యోగం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత వంటి అన్ని రకాల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అందువల్ల, ప్రతీ వ్య‌క్తికీ గౌరవప్రదమైన, సంతోషకరమైన జీవితాన్ని అందించే సమానత్వ, సుందరమైన సమాజంగా భారతదేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎర్ర జెండా ఉద్యమం, సీపీఐ(ఎం), ఇతర వామపక్ష, లౌకిక పార్టీలు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ చేసిన ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యపై ఎంఎ బేబీ స్పందించారు. ఆయ‌న వ్యాఖ్య‌లు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు, అలాగే ప్రశ్నలు లేవనెత్తే వారందరిపై మోడీ ప్రభుత్వం దాడికి ప్రణాళిక రచిస్తోందని స్పష్టం చేస్తోన్నాయ‌ని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులకు, పౌర స్వేచ్ఛలకు పెద్ద ముప్పు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరోసభ్యులు బివి రాఘవులు, తపన్ సేన్, కేంద్ర కమిటీ సభ్యు డు మురళీధరన్, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య పాల్గొన్నారు.

​దేశ‌వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు
దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో సీపీఐ(ఎం) ఆధ్వ‌ర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. కేర‌ళ‌లోని రాష్ట్ర రాజ‌ధాని నుంచి గ్రామ స్థాయి వ‌ర‌కు సీపీఐ(ఎం) ఆధ్వ‌ర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి. తిరువ‌నంత‌పురంలోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాల‌యం వ‌ద్ద పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎంవి గోవింద‌న్ జెండాను ఆవిష్క‌రించారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఎమ్మెల్యే కార్యాల‌యం వ‌ద్ద కేర‌ళ మాజీ ముఖ్య‌మంత్రి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స‌భ్యులు, ప్ర‌తిప‌క్ష నేత‌ పిన‌ర‌యి విజ‌య‌న్ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా, మన స్వాతంత్య్ర‌ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఆదర్శాలను గౌరవిద్దామ‌నీ, మన గణతంత్ర రాజ్యపు ప్రజాస్వామ్య, లౌకిక పునాదుల పట్ల మన నిబద్ధతను చాటి చెబుదామ‌ని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -