What makes a child gifted and talented may not always be good grades in school, but a different way of looking at the world and learning.
-Chuck Grassley
పిల్లల్ని పెంచడం అంత సులువైన విషయం కాదు. ఆందునా తెలివైన పిల్లలతో ఏగడం మరీ కష్టం. శారీరక ఎదుగుదలకు కావాల్సిన ఆహారం ఇవ్వడంలో చూపినంత చొరవ పిల్లల మనోవికాసానికి అవసరమైన ఆలోచనలు ఇవ్వడంలో తల్లిదండ్రులు ఎప్పుడూ వెనకబడే ఉంటారు. దీనికి కారణం జనరేషన్ గ్యాప్.
పిల్లలకు చిన్న వయసులో ఆలోచించే శక్తి ఉండదు, వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు అవే వస్తాయనేది పాతకాలపు ఆలోచన. మేధస్సు కేవలం ఐక్యూ ద్వారానే నిర్ణయించే సాంప్రదాయ భావనకు భిన్నంగా, ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త హొవార్డ్ గార్డినర్ బహుళ మేధస్సుల సిద్ధాంతాన్ని జ్ఞానరంగం ముందుంచాడు. ఈయన తెలివి తేటలు, మేధస్సు ప్రకారం పిల్లలను ఎనమిది రకాలుగా అభివర్ణించాడు.
‘ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్: ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ (1983)’ అనే ప్రసిద్ధ గ్రంథంలో పిల్లల బహుముఖీన ప్రతిభను వివరంగా ఉదాహరించాడు. సాధారణంగా పిల్లల తెలివిని చదువు, మార్కులనుబట్టి అంచనా వేస్తుంటాం. కానీ గార్డనర్ తన ‘సహజ పరిశీలన(Naturalistic Observation) ‘సిద్ధాంతం ద్వారా ప్రతి బిడ్డలోనూ విభిన్నమైన తెలివితేటలు ఉంటాయని నిరూపించారు. చేపను చెట్టు ఎక్కమంటే అది జీవితాంతం తనను తాను చేతగాని దానిగానే భావిస్తుంది. అలాగే, విద్యార్థిని కేవలం మార్కుల కొలమానంలోనే చూస్తే వాళ్లలోని అసలైన మేధస్సు మరుగున పడిపోతుంది. హోవార్డ్ గార్డినర్ సిద్ధాంతం మనకు నేర్పే పాఠం ఒక్కటే… పిల్లలు ఎంత తెలివైనవారనేది ముఖ్యం కాదు, ఏ రంగంలో’ తెలివైనవారనేదే ముఖ్యం.పిల్లల్లో దాగున్న ఆ ఎనిమిది రకాల ప్రత్యేక శక్తులను గుర్తించి మార్కుల రేసులో కొట్టుకుపోకుండా చూడటం, సహజ ప్రజ్ఞకు రెక్కలు తొడిగి చేరుకోగల శిఖరాలకు ప్రోత్సహించే దిశగా పేరెంట్స్ ఆలోచించాలి.
పిల్లలు తెలివైనవారైనంత మాత్రాన, చదువులో రాణించినంత మాత్రాన తల్లిదండ్రులకు ఏ దిగులు ఉండదు అనుకోవడం పొరపాటు.తమ పిల్లలు ప్రతిభావంతులు అత్యంత తెలివైనవాళ్లు కావాలని తల్లిదండ్రులు కలగనడం సహజం. ప్రతిభావంతులైన పిల్లలు ఉన్న కుటుంబాల్లో పెద్దలు అనేక సవాళ్లను ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది గమనార్హం.
ప్రతిభావంతులైన పిల్లలను పెంచడంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి, పరిష్కారాలను సూచిస్తూ ఆ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం విద్యావేత్తల కర్తవ్యం. అట్లాగే ప్రతిభావంతులైన పిల్లలతో సమాజం కూడా ఎట్లా నడచుకోవాలో చెప్పడం, గిఫ్టెడ్ చిల్డ్రన్‌గా జన్మించిన పిల్లలను మరింత ప్రోత్సహించడమే జాతీయ ప్రతిభావంతులైన పిల్లల పెంపకం వారోత్సవాల ముఖ్యోద్దేశం. ఈ కార్యక్రమంలో మొదటిది ప్రతిభావంతులైన పిల్లలు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవడం. ప్రతిభావంతులైన పిల్లలను పెంచడం ఆనందదాయకమే అయినప్పటికీ, ఈ పిల్లల కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులు అనేకం ఉంటాయి. చాలా సందర్భాల్లో ప్రతిభావంతులైన పిల్లల విద్యా అవసరాలు వాళ్ల భావోద్వేగ సామర్థ్యాలను మించి ఉంటాయి. దీనివల్ల వాళ్ల వయస్సుకు తగిన అభ్యసన సామగ్రి, పుస్తకాలు,బోధకులు వగైరా అందుబాటులో ఉండాలి. ప్రతిభావంతులైన పిల్లలు తమ తోటివారితో సరిగ్గా కలిసిపోలేని పరిస్థితులు ఉంటాయి. వీళ్లు ఇతరుల కంటే ముందున్నప్పటికీ, ప్రత్యేకంగా ఉన్నారనే కారణంతో మిగతా విద్యార్థులచే ఎగతాళికి హేళనకు గురవుతుంటారు. ప్రతిభావంతులైన పిల్లలు తమకు ఎదరయ్యే సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో తరచుగా విసుగు, ఉత్తేజరాహిత్యం, నిరాసక్తతకు లోనవుతారు. ఇది చివరకు చదువు పట్ల అయిష్టతకు, ప్రతికూల భావోద్వేగ ప్రతిస్పందనలకు దారితీస్తుంది.
ªGifted children are like sports cars. They have high-performance engines, but they require a skilled driver and a safe track to reach their full potential అంటాడు రాబర్ట్ ఎల్. కాప్లాన్. అనేక విషయాల్లో పరిజ్ఞానం ఉండటాన ప్రతిభావంతులైన పిల్లలు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. కాప్లాన్ చెప్పినట్టు వాళ్లను నడిపించే సామర్థ్యంగల గురువులుండాలి. సరైన మెంటార్ లేకపోతే సహించలేరు. పట్టుదలతో, పరిపూర్ణతను కోరుకునేవారుగా, అధికారాన్ని తీవ్రంగా సవాలు చేసేవారిగా కూడా వీళ్లు మారిపోతారు – అంటే, వారు తరచుగా వాదనలో ముందుండి, లొంగిపోయే వాళ్లలో చివరివాళ్లుగా ఉంటారు. స్పోర్ట్స్ కార్ లాంటి మీ పిల్లల అపారమైన మేధోశక్తిని అణచివేయకుండా, సరైన దిశలో మళ్లించడం చాలా ముఖ్యం. వాళ్లు ప్రతిదానినీ ప్రశ్నిస్తున్నప్పుడు లేదా వాదిస్తున్నప్పుడు కోపం చేయకుండా, వాళ్లలోని జిజ్ఞాసను అర్థం చేసుకోవాలి. వాళ్ల ఆలోచనలకు తగిన మేధోపరమైన వాతావరణాన్ని ఇంట్లోనే కల్పించాలి. పర్ఫెక్షనిజం వల్ల వారు ఒత్తిడికి లోనవ్వకుండా, ఓటమిని కూడా సహజంగా తీసుకునేలా మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా, వాళ్ల ప్రతిభ తప్పుదారి పట్టకుండా నడిపించగలిగే సరైన మెంటార్‌ను పరిచయం చేయాలి. ఇందుకు అవసరమైన పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వేణు భగవాన్ రచించిన ‘అమ్మ నాన్న ఓ జీనియస్!’, ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సాండ్రా రాసిన ‘బాల్యం అమూల్యం’, రష్యన్ విద్యావేత్త ఎ.ఎస్. మకారెంకో రాసిన ‘అమ్మా నాన్నలకు’, ప్రముఖ విద్యావేత్త జాన్ హాల్ట్ రాసిన ªHow Children Learn’, జేమ్స్ టి. వెబ్ రాసిన ªA Parentμs Guide to Gifted Childrenμ, జుడీ గాల్‌బ్రెయిత్ రాసిన ªThe Survival Guide for Gifted Kids’ లాంటి అవగాహనా గ్రంథాలు అద్భుత సమాచారాన్ని అందిస్తాయి.
హొవార్డ్ గార్డనర్ పిల్లల్లోని మేధాశక్తిని 1. భాషా సంబంధ మేధస్సు(Linguistic Intelligence), , 2. తార్కిక-గణిత మేధస్సు (Logical-Mathematical
Intelligence), 3. దృశ్య-స్థాన సంబంధ మేధస్సు (Spatial Intelligence),, 4. శారీరక-కదలికల మేధస్సు(Bodily- Kinesthetic Intelligence), , 5. సంగీత సంబంధ మేధస్సు (Musical Intelligence), 6. వ్యక్త్యంతర మేధస్సు (Interpersonal Intelligence), 7. వ్యక్తి అంతర్గత మేధస్సు(Interpersonal Intelligence), 8. ప్రకృతి సంబంధ మేధస్సు (Naturalistic Intelligence) గా పేర్కొంటూనే, తొమ్మిదవదిగా అస్తిత్వ మేధస్సును గురించి ఊహలు చేశాడు. భాషా సంబంధ మేధస్సుగల విద్యార్థులకు పదాలను, భాషను సమర్థవంతంగా ఉపయోగించే సామర్థ్యం ఉంటుంది. వీరు మాట్లాడటం, రాయడం, కథలు చెప్పడం వంటి వాటిలో భాషను వైవిధ్యంగా ఉపయోగిస్తుంటారు. వీరు కవులు, రచయితలు, జర్నలిస్టులు, వక్తలుగా రూపొందే అవకాశం ఉంటుంది. తార్కిక-గణిత మేధస్సుగల పిల్లలకు సమస్యలను తార్కికంగా ఆలోచించడం, సంఖ్యలను, శాస్త్రీయ అంశాలను విశ్లేషించే సామర్థ్యం ఉంటుంది. లెక్కలు చేయడం, నమూనాలను ((patterns) గుర్తించడం, శాస్త్రీయ పరిశోధనలపై ఆసక్తి కలిగి ఉంటారు. వీరు శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, టెక్నోక్రాట్స్‌గా రూపొందే అవకాశం ఉంటుంది.
దృశ్య-స్థాన సంబంధ మేధస్సుగల విద్యార్థులకు వస్తువులు, స్థలాలను దృశ్య రూపంలో ఊహించుకుని అవగాహన చేసుకునే సామర్థ్యం ఉంటుంది. దిశలను గుర్తించడం, చార్టులు/ మ్యాప్‌లను అర్థం చేసుకోవడం, డిజైన్ చేయడంలో వీళ్లు నిపుణులు. శిల్పులు, చిత్రకారులు, ఆర్కిటెక్ట్‌లు, పైలట్లుగా ఈ తరహా విద్యార్థులు మారగలరు.శారీరక-కదలికల మేధస్సుగల విద్యార్థుల్లో శారీరక కదలికలను నియంత్రిస్తూ, వస్తువులను నైపుణ్యంతో ఉపయోగించే సామర్థ్యం ఉంటుంది. శారీరక సమతుల్యత, చురుకుదనం, చేతి పనులు చేయడంలో వీళ్లు ముందుంటారు. క్రీడాకారులు, నృత్యకారులు, సర్జన్లు (వైద్యులు), నటులు వీళ్లలోంచే వస్తారు. సంగీత సంబంధ మేధస్సుగల విద్యార్థులు సంగీత స్వరాలు, లయలు, రాగాలను ఆలాపించగలరు. వీళ్లు పాటలు పాడగలరు, సంగీత వాయిద్యాలు వాయించగలరు, స్వరకల్పన చేయగలరు. ప్రోత్సహిస్తే వీరు సంగీత దర్శకులు, గాయకులు, వాద్యకారులుగా రూపొందుతారు.
వ్యక్త్యంతర మేధస్సున్న పిల్లలకు ఇతర వ్యక్తుల భావాలను, ఉద్దేశాలను, ప్రవర్తనను అర్థం చేసుకుని వారితో సత్సంబంధాలను కొనసాగించగల సామర్థ్యం ఉంటుంది. వీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు మరియు వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీరు ఇతరులకు కౌన్సెలింగ్ ఇవ్వగలరు. భవిష్యత్తులో వీరు నాయకులు, ఉపాధ్యాయులు, సైకాలజిస్టులు, సేల్స్ మెన్ గా రాణించగలరు. వ్యక్తి అంతర్గత మేధస్సుగల పిల్లలు తమ గురించి తాము పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు. తమ బలాలు, బలహీనతలు, భావోద్వేగాలు, లక్ష్యాల పట్ల వీరికి స్పష్టత ఉంటుంది. తత్వవేత్తలు, రచయితలు, ఆధ్యాత్మిక గురువులుగా వీళ్లు గుర్తింపు పొందగలరు.ప్రకృతి సంబంధ మేధస్సున్న చిన్నారులు ప్రకృతిని, పరిసరాలను, చెట్లు, జంతువులను, పక్షులను అర్థం చేసుకుని వాటితో మమేకం కాగలరు. వాతావరణ మార్పులను గుర్తించడం, మొక్కల పెంపకం, జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో వీళ్లు నిష్ణాతులు. వీరు మంచి రైతులుగా, జీవశాస్త్రవేత్తలుగా, పర్యావరణ వేత్తలుగా, అటవీ అధికారులుగా నిర్ణాయక పాత్రపోషించగలరు.గిఫ్టెడ్ పిల్లల అసాధారణ సామర్థ్యాలను గుర్తించి, వాటిని సరైన దిశలో ప్రోత్సహించడం అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఉమ్మడి బాధ్యత. ఈ పిల్లలకు కేవలం విద్యాపరమైన సవాళ్లు మాత్రమే కాకుండా, వారి భావోద్వేగాలను అర్థం చేసుకునే సున్నితమైన వాతావరణం కూడా అవసరం. వీరిని ఇతరులతో పోల్చకుండా, వారి ప్రత్యేకతను గౌరవిస్తూ, ఒత్తిడి లేని అభ్యాస అనుభవాలను అందించాలి. పాఠశాల, ఇల్లు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే, ఈ పిల్లలు తమ పూర్తి స్థాయి మేధో సామర్థ్యాలు ప్రతిబింబించే స్థానాలకు ఎదగగలరు. ప్రతిభాసంపత్తిని విస్తరిస్తూ ప్రజలకు దేశానికి తమ తమ రంగాల్లో అద్భుతమైన సేవలు అందిస్తూ భవిష్యత్తరాలకు మార్గదర్శకులుగా నిలబడగలరు.
– డా.బెల్లి యాదయ్య, 9848392690



