Monday, August 17, 2026
E-PAPER
Homeఖమ్మంకళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించాలి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించాలి

- Advertisement -

– తులం బంగారం హామీని అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట 

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని బీఆర్‌ఎస్‌ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ సోమవారం అశ్వారావుపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ నాయకులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం ఆర్థిక భారంగా మారుతున్న పరిస్థితిని గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్‌ 2014 అక్టోబర్‌ 2న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రారంభించారని తెలిపారు. ప్రారంభంలో రూ.51 వేలుగా ఉన్న ఆర్థిక సాయాన్ని అనంతరం రూ.1,00,116కు పెంచారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్‌ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోగా ఇప్పటికే అమలులో ఉన్న పథకాన్ని సైతం ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు. తులం బంగారం హామీపై ఆడబిడ్డలు స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో 30 రోజుల్లో ఆర్థిక సాయం అందేదని, ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో పెళ్లయి పిల్లలు పుట్టినా సాయం అందని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హైకోర్టులో ప్రభుత్వం గడువు తీసుకున్నప్పటికీ కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ కీలక కేసుల్లో ప్రైవేట్‌ న్యాయవాదుల సేవలు తీసుకుంటున్న ప్రభుత్వం పేద ఆడబిడ్డలకు సంబంధించిన పథకం విషయంలో ఎందుకు సమర్థవంతంగా స్పందించలేదని ప్రశ్నించారు. పథకాన్ని కావాలనే ఆలస్యం చేసి నిలిపివేయాలనే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన ప్రతి లబ్ధిదారునికి తక్షణమే ఆర్థిక సాయం విడుదల చేయడంతో పాటు హైకోర్టు కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన తులం బంగారం హామీని ఎప్పుడు, ఎలా అమలు చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో మండల సమన్వయకర్త, జడ్పీటీసీ మాజీ సభ్యులు జూపల్లి రమణారావు,మండల పరిషత్ మాజీ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, యూఎస్‌ ప్రకాశ్‌రావు, సంక ప్రసాద్‌, సర్పంచ్‌ నాగమణి, మాజీ సర్పంచ్‌ లు నారం రాజశేఖర్‌, దుర్గయ్య, ఆరేపల్లి రాంబాబు,ఏలేటి పార్వతి, శెట్టిపల్లి రఘురాం, చందా లక్ష్మీనర్సయ్య, నరసింహం, కుమారస్వామి, ఆసీఫ్‌, చిప్పనపల్లి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -