ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపించి రష్యా కు వ్యతిరేకంగా అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు ప్రకటించింది. రష్యా నుండి ఏ దేశమైనా గనుక చమురును కొనుగోలు చేస్తే ఆ దేశం మీద వందశాతం వరకూ అపరాధ సుంకాన్ని విధించేందుకు అమెరికన్ ప్రభుత్వానికి అధికారం ఇస్తూ తాజాగా ఆగస్టు 7న అమెరికన్ సెనేట్ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి అనుకూలంగా 86, వ్యతిరేకంగా 11 ఓట్లు పడ్డాయి. రష్యా నుండి ప్రస్తుతం చమురును గణనీయమైన పరిమా ణంలో కొనుగోలు చేస్తున్న అయిదు దేశాలను ఈ తీర్మానం తన లక్ష్యంగా చేసుకుంది. ఆ దేశాలు ఇవి-ఇండియా, చైనా, హంగేరీ, స్లోవాకియా, అజర్‌బైజాన్. ఉక్రెయిన్ మీద సాగిస్తున్న యుద్ధానికి కావలసిన ధనాన్ని ఈ చమురు అమ్మకాల ద్వారా రష్యా సమకూర్చుకుంటోందని, అందుచేత అక్కడినుంచి చమురు కొనుగోలు చేయడం అంటే రష్యా పై తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించడమేనని అమెరికన్ ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ మధ్య కాలంలో ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మరింత ఎక్కువగా కూరుకుపోయింది. అందుకే ఉక్రెయిన్ బరితెగింపు మరింత ఎక్కువైంది. ఈ మధ్య రష్యన్ భూభాగంలోకి బాగా చొచ్చుకునిపోయి ఉక్రెయిన్ విమానాలు దాడులు చేయగలుగుతున్నా యంటే దానికి కారణం అమెరికన్ గూఢచర్యం ద్వారా అది చాలా ముఖ్యమైన సమాచారాన్ని పొంద గలగడమే. యూరప్ దేశాల శత్రుపూరిత వైఖరి కూడా ఏమాత్రమూ తగ్గలేదు. జర్మనీ ఈ మధ్య తన సైనిక వ్యయాన్ని బాగా పెంచడం కూడా తోడైంది. ఈ కారణాల రీత్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత ఎక్కువగా కొనసాగుతోంది. ఈ యుద్ధం అణుయుద్ధంగా పరిణమించే ప్రమాదం కూడా పెరిగింది.
రష్యాపట్ల పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న అర్ధం లేని శత్రుత్వ వైఖరికి ఇప్పటికే అటు ఉక్రెయిన్, ఇటు రష్యా చాలా మూల్యాన్ని చెల్లించాయి. ఇంకా చెల్లిస్తూనేవు న్నాయి. ఇన్ని ప్రాణాలను బలి తీసుకోవడం సబబేనా అన్న సవాలు ఎదురైనప్పుడు సమర్ధించుకోవడానికి ఈ దేశాలు రష్యా దుర్రాకమణ వ్యూహాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉందంటూ సాకు చూపుతున్నాయి. కానీ అటువంటి ఆరోపణకు ఎటువంటి ఆధారాలూ లేవు. ఈ యుద్ధం వెనుక పశ్చిమ దేశాల వ్యూహం ఒక్కటే. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత రష్యాలో అపారంగా ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడమే ఆ వ్యూహం. వ్లాడిమిర్ పుతిన్ అధికారం చేపట్టాక అటువంటి ఎత్తులు పని చేయడం లేదు. అందుకే ఈ విధంగా ఉక్రెయిన్ ను ఎగదోసి యుద్ధానికి పురికొల్పాయి సామ్రాజ్యవాద దేశాలు.
ఇలా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనేవుంది, పశ్చిమ దేశాలు రష్యాపై ఏకపక్షంగా ఆంక్షలను విధిస్తూనేవున్నాయి. కానీ అవే దేశాలు అదే రష్యా నుంచి సహజ వనరులను కొనుగోలు చేస్తూనేవున్నాయి. అమెరికా అనుసరిస్తున్న వైఖరిలో నిజాయితీ లేని తనం బలంగా కనిపిస్తోంది. రష్యా నుండి కొనుగోళ్లు చేయవద్దంటూ ఇండియాను, తక్కిన దేశాలను ఒత్తిడి చేస్తూనే, మరోవైపు అమెరికాయే స్వయంగా రష్యా నుండి దిగుమతులను కొనసాగిస్తోంది. 2021 నాటికి అమెరికా రష్యా నుండి 1700 కోట్ల డాలర్ల ముడిచమురును దిగుమతి చేసుకునేది. దానిని తర్వాత నిలిపివేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికీ రష్యా నుండి కొన్ని కీలక సరుకులను దిగుమతి చేసుకుంటూనేవుంది. ఆ దిగుమతులు తగ్గుతున్నది కూడా ఏమీ లేదు. వాస్తవానికి 2021 తర్వాత రష్యా నుండి ఎరువులు, పల్లాడియం, యురేనియం అనే మూడు ముఖ్యమైన సరుకుల దిగుమతి పెరిగింది. అమెరికా రష్యా నుండి దిగుమతి చేసుకునే మొత్తం సరుకుల్లో ఈ మూడూ దాదాపు తొంభై శాతం ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ ‘‘ అమెరికా రష్యాతో ఎటువంటి వ్యాపారమూ చేయడం లేదు’’ అని చేసిన ప్రకటనకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది.
ఉక్రెయిన్ యుద్ధం ఒకపక్క కొనసాగుతున్నప్పుడే అమెరికా తన చమురు వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తోంది. ఇదే అమెరికా వాస్తవ వ్యూహం. అదే సమయంలో రష్యా నుండి తనకు అవసరమైన సరుకులను దిగుమతి చేసుకుంటూనే వుంది. ఇంకా రష్యన్ భూభాగంలో ఉన్న సహజ వనరులను ఎలాగైనా కొల్లగొట్టాలన్న ప్రయత్నాలనూ కొనసాగిస్తోంది. అక్కడ ఉన్న చమురు, సహజవాయువుల నిల్వల మీద కూడా అమెరికా కన్ను వేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కన్నా అమెరికా నుంచి కొనుగోలు చేయడం ఇండియా వంటి దేశానికి పెను భారంగా ఉంటుంది. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న ఆంక్షలను తట్టుకోడానికి రష్యా చమురు మీద డిస్కౌంట్ ఇస్తోంది. అటువంటి డిస్కౌంట్ ఏదీ లేని సాధారణ పరిస్థితుల్లో కూడా రష్యా నుంచి కొనే బదులు అమెరికా నుండి చమురు కొనుగోలు చేయడం వల్ల మన దేశం మీద ఏటా 900 నుండి 1200 కోట్ల డాలర్ల మేరకు – అంటే దాదాపు 1,15,000 కోట్ల రూపాయల మేరకు అదనంగా భారం పడుతుంది. నిజానికి ఇండియా ఇటీవలిదాకా తన చమురు కొనుగోళ్లలో 35 నుండి 40 శాతం దాకా రష్యా నుండి కొనుగోలు చేసింది. అంతర్జాతీయ ధరల కన్నా తక్కువకే రష్యా అమ్మజూపడం వల్ల మన దేశం 1700 కోట్ల డాలర్ల మేరకు విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ఇప్పుడు అమెరికా బెదిరింపులకు లొంగితే మన దేశం చాలా ఎక్కువ ధరకు అమెరికన్ చమురును కొనవలసివస్తుంది. యుద్ధం కారణంగా రష్యా డిస్కౌంట్ కు అమ్మజూపుతున్నప్పుడు ఆ దేశం నుండి కొనుగోలు నిలిపివేయడం మనకు మరింత భారం కానుంది. ఈ డిస్కౌంట్ ద్వారా నిజానికి రష్యా అమెరికన్ ఆంక్షలను ఎదుర్కొంటూనే తన చమురు మార్కెట్ ను పెంచు కోగలిగింది. దానిని కట్టడి చేయడం అమెరికా లక్ష్యం. అందు కోసం ఇతర దేశాలకు నష్టం వాటిల్లినా అది పట్టించుకోదు.
రష్యన్ చమురు కొనుగోలు నిలిపివేస్తే భారతదేశంలో అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. మొదటి కారణం- చమురు దిగుమతి ఖరీదు పెరగడం, దానిని వినియోగదారులమీద మోపడం వల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణాన్ని పెంచడం జరుగుతుంది. రెండవ కారణం- చమురు కొనుగోలుకు వెచ్చించవలసిన విదేశీ మారకద్రవ్యం పెరుగు తుంది. ఎక్కువ మొత్తంలో డాలర్లు బైటకు పోతాయి. అప్పుడు రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చితే మరింత తగ్గుతుంది. అప్పుడు ఇతర దిగుమతుల ధరలు మరింత పెరుగుతాయి. ఈ ద్రవ్యోల్బణాన్ని నివారించ డానికి ప్రభుత్వం చమురు ధరల అదనపు భారాన్ని సబ్సిడీ ద్వారా తానే భరించవచ్చు. కానీ అప్పుడు ఇతర పద్దులమీద ప్రభుత్వం చేసే ఖర్చు తగ్గిపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి మీద మరో రూపంలో దాడికి అది దారి తీస్తుంది. అదే విధంగా అమెరికన్ చమురు కొనుగోలు కోసం ప్రభుత్వం తనవద్ద ఉన్న విదేశీ మారక నిల్వలనుండి ఖర్చు చేయవచ్చు. కానీ అది రూపాయి మారకపు విలువ భవిష్యత్తు లో మరింత పడిపోనుంది అన్న స్పెక్యులేషన్ కు దారి తీసి సమస్యలు సృష్టించవచ్చు. ఎలా చూసినా రష్యా నుండి కొనుగోలు మానేసి అమెరికా నుండి కొనుగోలు చేయడం మన దేశ ప్రజలకు భారంగా మారుతుంది. ఎలాగైనా సరే రష్యాలోని సహజవనరుల మీద పెత్తనం సంపాదిం చాలనే అమెరికా వ్యూహం అటు ఉక్రెయిన్, రష్యా దేశాల్లో వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇటు అదే సమయంలో కోట్లాది భారత ప్రజల బ్రతుకులనూ భారంగా మారుస్తోంది.
అమెరికా-ఇజ్రాయిల్ ద్వయం ఇరాన్ మీద యుద్ధంలో మునిగివున్నప్పుడు హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా నిలిపివేయబడింది. దాని వల్ల చమురు రవాణా ఖర్చు బాగా పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, మాంద్యం ఆవరించే ముప్పు ఏర్పడింది. అప్పుడు అమెరికా రష్యా మీద ఆంక్షలను సడలించి ఆ దేశం నుండి చమురు కొనుగోళ్లకు ఇతర దేశాలను అనుమతించింది. అంటే ఏ దేశం ఎవరినుంచి ఎప్పుడు ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించే అధికారాన్ని అమెరికా తనకు తాను ఆపాదించుకుని పెత్తనం చేయాలని చూస్తోంది. తనకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే ఇతర దేశాలన్నీ అనుసరించాలనే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది.
అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి చైనా సరైన విధానాన్ని అనుసరించింది. చైనా మీద అధిక సుంకాలను విధిస్తానని ట్రంప్ బెదిరించినప్పుడు చైనా నుండి అమెరికా కు ఎగుమతయే ‘అరుదైన ఖనిజాల’ విషయంలో చాలా నిబంధనలను విధించి వాటి ఎగుమతులను కట్టడి చేసింది. ఈ ‘అరుదైన ఖనిజాల’ మార్కెట్‌లో చైనా దాదాపు గుత్తాధిపత్యం సాధించింది. దాంతో అమెరికా దిగివచ్చి చైనాతో ఒక అవగాహన కుదుర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా చైనా అటువంటి ఎత్తుగడలనే చేపట్టే అవకాశం ఉంది. ఇండియా కూడా అదే మాదిరిగా అమెరికా ఒత్తిడి ని తిప్పికొట్టే విధానాన్ని అనుసరించడం ఇప్పుడు అవసరం. అయితే, అమెరికాకు చైనా మాదిరిగా ఎగుమతి చేసే సరుకుల విషయంలో ఇండియాకు ఎటువంటి అవకాశమూ లేదు.
కానీ ఇప్పుడు ఇండియా-అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ఏకపక్షంగా గతంలో ప్రకటించిన సుంకాలు చెల్లవంటూ అమెరికన్ కోర్టు తీర్పు ఇచ్చింది. అందుచేత గతంలో కుదిరిన ఇండో-అమెరికన్ వాణిజ్య ఒప్పందం మీద మళ్ళీ చర్చలు జరపాలి. ఈ సారి కుదిరే ఒప్పందం అసమాన ఒప్పందంగా ఉండకూడదు. ముఖ్యంగా మన వ్యవసాయ రంగానికి ముప్పుగా పరిణమించే ఎటువంటి అంశాలూ ఆ ఒప్పందంలో ఉండకూడదు. అమెరికన్ రైతులకు అక్కడి ప్రభుత్వం భారీగా ఇచ్చే సబ్సిడీల వల్ల అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడికి తెచ్చి చౌకగా అమ్మవచ్చు. ఆ పోటీకి మన రైతులు తట్టుకుని నిలవలేరు. మన ప్రభుత్వం వారికి ఇచ్చే సబ్సిడీలను ఇప్పుడు నిరాకరిస్తోంది. ఈ పరిస్థితిలో మనం వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరిపేటప్పుడు దేశీయ వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటూ, అసమాన షరతులు లేని విధంగా ఒప్పందం ఉండేట్టు చూడాలి. అదే సమయంలో ఈ చర్చలు జరుపుతూ మరోపక్క ఏకపక్షంగా మనమీద ఆంక్షలు విధించడాన్ని ఎదిరించాలి. ఎటువంటి ఆంక్షలూ లేని నేపథ్యంలో మాత్రమే వాణిజ్య చర్చలు జరగాలని పట్టుబట్టాలి. రష్యా నుంచి చమురు కొనుగోళ్ళను యథాతథంగా కొనసాగించాలి.
ఇరాన్ మీద జరుగుతున్న దాడి, దానిని ఇరాన్ ప్రతిఘటి స్తున్న తీరు చూస్తే అమెరికన్ ప్రభుత్వపు పరిమితులేమిటో మనకు స్పష్టం అవుతోంది. ఇటువంటి పరిస్థితిలో కూడా ఇండియా అమెరికాను ఎదిరించి దేశ ప్రయోజనాల కోసం నిలబడలేకపోతే, సామ్రాజ్యవాద ఒత్తిళ్ళకు తలొగ్గితే అంతకన్నా విషాదం మరొకటి ఉండదు.
ప్రభాత్ పట్నాయక్



