Tuesday, August 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రపంచ స్థాయి తెలంగాణలో విద్య సాధ్యమేనా?

ప్రపంచ స్థాయి తెలంగాణలో విద్య సాధ్యమేనా?

- Advertisement -

‘‘ప్రపంచ స్థాయికి తెలంగాణ విద్యార్థులను తీసుకుపోవడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం’’, ‘‘పిల్లల కోసం మీరు పనిచేయండి.. మీకు నేనున్నా’’, ‘‘నా సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఇప్పటి నుంచి ఐదేండ్లు దీక్ష పూనండి’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విద్యారంగంపై ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ఫిన్లాండ్, జర్మనీ విద్యావిధానాలను అధ్యయనం చేసి వచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులతో సమావేశం సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాం శమయ్యాయి. ముఖ్యమంత్రికి పాఠశాల విద్యారంగంపై మంచి లక్ష్యం ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే ఆ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిలో అనువైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదే ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం.

ఈ ఏడాది చివరి నాటికి నివేదిక సిద్ధం చేయడం, ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందిం చడం, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడం వంటి హడావుడి నిర్ణయాల కంటే ఇప్పటికే ఉన్న సిఫార్సులను అమలు చేయడం ముఖ్యం. అన్ని స్థాయిల్లో పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాల్లో సమగ్ర సంస్కరణల ద్వారా ప్రీప్రైమరీ నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యా నాణ్యతను పెంచాలని ఆకునూరి మురళీ ఛైర్మన్‌గా పనిచేసిన విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. అలాంటప్పుడు మరో కొత్త నివేదిక ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యారంగానికి బడ్జెట్‌లో దాదాపు తొమ్మిది శాతం కేటాయించామని, తెలంగాణలో 27.50 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా ఒక్కో విద్యార్థిపై రూ.1.08 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. గత మూడేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో లక్షకు పైగా చేరడం సానుకూల పరిణామమే. దేశంలో 28వ స్థానంలో ఉన్న తెలంగాణ రెండేళ్లలో 18వ స్థానానికి చేరిందని ఉపాధ్యాయుల పనితీరును కూడా ముఖ్యమంత్రి అభినందించారు. ఈ అంకెలు, గణాంకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పాఠశాల విద్య ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా ఆశించిన లక్ష్యాలను చేరుకోవడం అంత సులభం కాదు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త పథకాలు తీసుకురావడం, ఉన్న పథకాల పేర్లు మార్చడం, కొన్ని పథకాలను అటకెక్కించడం పరిపాటిగా మారింది. గత ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకం ద్వారా 26 వేల పాఠశాలల్లో మూడు దశల్లో 12 రకాల పనులు చేపట్టాలని సంకల్పించింది. కానీ సుమారు 1,200 పాఠశాలల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 2 వేల పాఠశాలల్లో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం మారడంతో ఆ పథకం కూడా నీరుగారింది. ‘కేజీ టు పీజీ’ పథకం పరిస్థితి కూడా అంతే. విద్యారంగంపై పాలకులకు దీర్ఘకాలిక చిత్తశుద్ధి లేకపోవడం వల్ల స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు విస్తృతంగా అనుమతులు ఇస్తూ ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఇక క్షేత్రస్థాయిలో పాఠశాల విద్యారంగం సవాలక్ష సమస్యలతో కూనారిల్లుతోంది. నీటి సౌకర్యంతో కూడిన వాష్‌ రూమ్‌లు, రక్షిత తాగునీరు అనేక పాఠశాలల్లో ఇప్పటికీ అందుబాటులో లేవు. ప్రహరీలు లేక పశువులు, పందులు, కుక్కలు పాఠశాల ప్రాంగణాల్లో తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణం కూలుతాయో తెలియని భవనాల మధ్య విద్యా ర్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలతో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులు, ఉపాధ్యా యులకు సరిపడా ఫర్నిచర్ లేదు. అనేక చోట్ల కిచెన్ షెడ్లు కూడా సక్రమంగా లేవు. ఇలాంటి మౌలిక వసతుల కొరత మధ్య ప్రపంచ స్థాయి విద్యను అందించడం ఎలా సాధ్యమన్నది ప్రభుత్వం ఆలోచించాలి. వీటికి తోడు 7,346 పాఠశాలల్లో ఉపా ధ్యాయుల కొరత ఉంది. విద్యాశాఖను పర్యవేక్షించాల్సిన డీఈఓలు, ఎంఈఓల కొరత తీవ్రంగా ఉంది. ఉపాధ్యాయుల నైపుణ్యాలు, అర్హతలను పరీక్షించే పరీక్షల్లో 2026 నాటికి కేవలం 39 శాతం మంది మాత్రమే అర్హత సాధించడం ఆందోళన కలిగించే విషయం.

ఒకవైపు మౌలిక వసతుల కొరత, మరోవైపు నైపుణ్యాలు కొరవడిన బోధనా సిబ్బందితో ముఖ్యమంత్రి అనుకున్న లక్ష్యాలను సాధించడం సాధ్యమా అన్నదే అసలు ప్రశ్న. ఉపాధ్యాయులే తగిన స్థాయిలో లేకపోతే విద్యార్థుల్లో సివిక్ సెన్స్, విలువలు, శాస్త్రీయ దృక్పథాన్ని ఎవరు పెంపొందిస్తారు? విద్యార్థులను కేవలం గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, పరీక్షలు రాయడం వరకే పరిమితం చేస్తే సృజనాత్మకత, ఆలోచనా శక్తి ఎలా పెరుగుతాయి? ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థి తిరిగి పదో తరగతి పరీక్ష రాస్తే రాయలేకపోయే పరిస్థితి మన విద్యా వ్యవస్థ లోపాలను తెలియజేస్తోంది. 39 శాతానికి పైగా పాఠశాలలకు సొంత ఆటస్థలాలు లేవు. ఇది విద్యా హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధం. 1,804 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని కేవలం 67 శాతం మాధ్యమిక పాఠశాలల్లోనే సమీకృత సైన్స్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. లైబ్రరీలు కూడా సుమారు 100 పాఠశాలల్లోనే పిల్లలకు అందుబాటులో ఉండటం ఆందోళనకరం. ఒక్కో విద్యార్థిపై రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నప్పుడు ఇంతటి మౌలిక లోపాలు ఎందుకు కొనసాగుతున్నాయో ప్రభుత్వం సమీక్షించాలి.
ఫిన్లాండ్ విద్యావ్యవస్థను అధ్యయనం చేసిన బృందం చెప్పిన అంశాలు మనకు ఆదర్శమే. అక్కడ పేద, ధనిక తేడా లేకుండా ప్రీప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందుతోంది. పిల్లలను చిన్న వయసులోనే పాఠశాలకు పంపకుండా ఏడేళ్ల తర్వాతే పాఠశాల విద్య ప్రారంభిస్తారు. మంచి ఆటస్థలాలు, ఉపాధ్యాయులకు గౌరవం, పరిశోధన ఆధారిత మాస్టర్స్ డిగ్రీతో కూడిన ఉపాధ్యాయ శిక్షణ అక్కడి ప్రత్యేకతలు. ప్రతి తరగతి తర్వాత విద్యార్థులకు విశ్రాంతి సమయం ఇవ్వడంతో పాటు పాఠశాలల్లో గైడెన్స్ కౌన్సిలర్లు, సైకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. అయితే ఫిన్లాండ్ విధానాన్ని కేవలం మాటల్లో ఆదర్శంగా చెప్పడం కాకుండా, అక్కడి విజయానికి కారణమైన పరిస్థితులను మన రాష్ట్రంలో ముందుగా కల్పించాలి. పిల్లలకు కేవలం పాఠ్యాంశాలు నేర్పడం కాకుండా ఆలోచించడం, ప్రశ్నించడం, ఊహించడం నేర్పాలి. ఆలోచనా శక్తి, ఊహాశక్తి పెంపొందితేనే భవిష్యత్ తరంలో సి.వి.రామన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు, సృజనాత్మక వ్యక్తులు పుట్టుకొస్తారు.

విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలంటే హడావుడిగా నిపుణులతో కమిషన్లు వేయడం మాత్రమే సరిపోదు. కమిషన్లు చేసిన సిఫార్సులను నిజాయితీగా అమలు చేయాలి. కొఠారి కమిషన్, డాక్టర్ కస్తూరిరంగన్ కమిషన్, యశ్‌పాల్ కమిటీ సూచనలను గత పాలకులు పట్టించుకోకపోవడం వల్లే విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. ఇప్పుడు కూడా కొత్త నివేదికలు, కొత్త పథకాల కంటే ఇప్పటికే ఉన్న సిఫార్సుల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావ్యవస్థను తెలంగాణలో నిర్మించి ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేయాలన్న లక్ష్యం గొప్పదే. కానీ ముందుగా అందుకు అవసరమైన మౌలిక వసతులు, నాణ్యమైన ఉపాధ్యాయులు, సమర్థవంతమైన పర్యవేక్షణ, శాస్త్రీయమైన పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా నిపుణులు సమిష్టిగా కృషి చేసినప్పుడే ముఖ్యమంత్రి సంకల్పం ఆచరణలోకి వస్తుంది. మాటలతో కాకుండా పాఠశాలల రూపురేఖలు మారినప్పుడే తెలంగాణ విద్య ప్రపంచ స్థాయికి చేరిందని చెప్పగలం.

పి.వి.రావు
9010153065

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -