Tuesday, August 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎరువుల ధరలు పైపైకి..!

ఎరువుల ధరలు పైపైకి..!

- Advertisement -

ఆన్‌లైన్‌లో ఎరువుల విక్రయ విధానం రైతులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. యూరియా, డీఏపీ, ఎన్‌పీకే వంటి రసాయన ఎరువుల బుకింగ్, పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్‌ను తీసుకొచ్చింది. ఎరువుల నిల్వను అరికట్టడం, అధిక వినియోగాన్ని నియంత్రించడం దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే ఫార్మర్ ఐడీ లేదా ఆధార్, పట్టాదారు పాసుపుస్తకానికి అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ వంటి ప్రక్రియలు తప్పనిసరి కావడంతో రైతులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. భూమి విస్తీర్ణం, పంట ఆధారంగా యాప్‌లో ఎరువుల కోటా నిర్ణయిస్తారు. అనంతరం వచ్చే క్యూఆర్‌ కోడ్ లేదా టోకెన్‌తో మూడు రోజుల్లో డీలర్ వద్ద ఎరువులు తీసుకోవాలి.
మహారాష్ట్రలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధా నంపై రైతులు, డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలుత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రారంభించి, ఆగస్టు 6 నుంచి మరికొన్ని జిల్లాలకు విస్తరించారు. సర్వర్‌ పనిచేయక పోవడం, యాప్‌ తెరుచుకోకపోవడం, ఓటీపీ రాకపోవడం, బుకింగ్‌ విఫలం కావడం వంటి సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ పరిజ్ఞానం లేని రైతుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

కౌలు రైతులకు భూ యజమానుల మొబైల్‌కు ఓటీపీ వెళ్లడం మరో సమస్యగా మారుతోంది. భూ యజమానులు హైదరా బాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉండటం, సకాలంలో ఫోన్‌కు స్పందించకపోవడం వల్ల ఎరువుల బుకింగ్ ఆలస్యం అవుతోంది. ఫార్మర్‌ ఐడీ కూడా అందరికీ జారీ కాకపోవడంతో ప్రస్తుతం ఆధార్ ఆధారంగా బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. భవిష్యత్తులో ఫార్మర్ ఐడీ కీలకంగా మారితే చిన్న, కౌలు రైతులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవ కాశం ఉంది. మరోవైపు ఈ సీజన్‌లో ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయి. డీఏపీ ధరలో పెద్ద మార్పు లేకపోయినా ఇతర ఎరువుల ధరలు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు చేరాయి. 20-0-20 రకం రూ.1,350 నుంచి రూ. 2,150కు, 28-9-28 రకం రూ.1,800 నుంచి రూ.2,300కు, 14-35-14 రకం రూ.1,800 నుంచి రూ.2,450కు, పొటాష్ రూ.1,800 నుంచి రూ.2,150కు, అమోనియా రూ.950 నుంచి రూ.1,500కు పెరిగాయి.
దేశంలో అత్యధికంగా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. తక్కువ భూమిలో అధిక దిగుబడి సాధించి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి వారిది. వాతావరణ మార్పులు, తెగుళ్లు, వైరస్‌ల ప్రభావంతో పంటల రక్షణ కోసం రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులపై ఆధారపడుతు న్నారు. వర్షాలు ఆలస్యమైనా, అనంతరం వర్షాలు కురవడంతో సాగు పనులు వేగం పుంజుకున్నాయి. ఈ సమయంలో ఎరువులు సకాలంలో అందకపోతే రైతులకు అదనపు నష్టం తప్పదు. తెలంగాణలో ఎరువుల వినియోగం 2018-19లో 29 లక్షల టన్నుల నుంచి ఇటీవల 41 లక్షల టన్నులకు పెరి గింది. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ పంపుసెట్లతో రెండు పంటలు సాగు చేయడం వల్ల ఎరువుల అవసరం పెరిగింది. దీంతో కేంద్రంపై సబ్సిడీ భారం పెరగడంతో వినియోగాన్ని నియంత్రించేందుకు యాప్‌ను ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

నానో యూరియా, నానో డీఏపీ వంటి ప్రత్యామ్నాయా లను ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ వాటిపై రైతుల్లో పెద్దగా నమ్మకం ఏర్పడలేదు. సేంద్రియ ఎరువులు, ఇతర ప్రత్యామ్నాయ సాగు విధానాల ప్రచారం కూడా ఆశించిన స్థాయిలో రైతులను ఆకర్షించలేదు. రైతులకు తక్షణ అవసరం మాత్రం పంటకు అవసరమైన ఎరువులు సరైన సమయంలో, సరైన ధరకు అందుబాటులో ఉండటమే.ఎరువులు వేసే కీలక సమయంలో బుకింగ్‌ కాకపోతే రైతులు సమయం కోల్పోయి పంట దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. యాప్‌లో నిర్ణయించే కోటా పంట అవసరానికి సరిపోకపోతే రైతులు బయట అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సి రావచ్చు. దీనివల్ల సాగు వ్యయం మరింత పెరిగి రైతుల ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా ల్లో నెట్‌వర్క్ సమస్యలు, సర్వర్‌ డౌన్‌, ఓటీపీ సమస్యలు తరచూ ఎదురైతే రైతులు డీలర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆన్‌లైన్ విధానం పేరుతో రైతులకు అదనపు భారం కాకుండా, సాంకే తిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే కఠిన నిబంధనలు అమలు చేయాలి.
రైతులకు నిజంగా మేలు చేయాలంటే ప్రభుత్వం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఎరువుల విక్రయాన్ని కొనసా గించాలి. సర్వర్, ఓటీపీ, నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించడంతో పాటు రైతుల అవసరానికి సరిపడా ఎరువులు అందు బాటులో ఉంచాలి. ఎరువుల సబ్సిడీకి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించి ధరల భారాన్ని రైతులపై మోపకుండా చూడాలి. ఎరువులు సకాలంలో అందక దిగుబడులు తగ్గి రైతుల ఆదాయం పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

బొంతు రాంబాబు, 9490098205

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -