Tuesday, August 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసాగునీరు విడుదల చేయాలి

సాగునీరు విడుదల చేయాలి

- Advertisement -

వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతుల ఆందోళన
రెండు గంటల పాటు డీఈని చుట్టుముట్టిన అన్నదాతలు
సీపీఐ(ఎం), బీఆర్ఎస్,
సీపీఐ(ఎంఎల్‌)మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన
దిగొచ్చిన అధికారులు..పంటలకు సాగునీరు విడుదల
నవతెలంగాణ – వైరాటౌన్

సాగు నీరు కోసం వందలాది మంది వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులు సోమవారం ఖమ్మం జిల్లా వైరా టౌన్‌ ఇరిగేషన్ డీఈ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు రైతులు కార్యాలయం వద్దబైటాయించి, ఇరిగేషన్ డీఈ నాగబ్రహ్మయ్యను చుట్టుముట్టి సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. సీపీఐ(ఎం), బీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ ఆధ్వర్యంలో ఈ పోరాటం నడిచింది. రైతుల ఆందోళనతో దిగొచ్చిన అధికారులు పంటలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, మాస్ లైన్ వైరా డివిజన్ కార్యదర్శి లాల్ మీడియాతో మాట్లాడారు. వైరా రిజర్వాయర్‌పై ఆధారపడి 18 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని, ప్రస్తుతం పంట కీలక ఎదుగుదల దశలో ఉన్న సమయంలో సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌లో 17.5 అడుగుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఆందోళనతో నీటిని విడుదల చేసిన అధికారులు
ఆందోళన సందర్భంగా నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆవేదనకు గురైన రైతు బోడేపూడి మాధవరావు.. సాగునీరు విడుదల చేయించి పంటలను కాపాడాలని ఎస్ఐ పుష్పాల రామారావు కాళ్లమీద పడి వేడుకున్నారు. రైతుల పరిస్థితిని చూసిన పోలీసులు, అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అనంతరం అధికారులు, పోలీసుల సమక్షంలో అఖిల పక్ష నాయకులు, రైతులతో చర్చలు జరిగాయి. వరి పంటకు నష్టం జరగకుండా అవసరమైన సాగునీటిని విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. వెంటనే సాగు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా పంట చేతికి వచ్చే వరకు సాగునీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి మళ్లీ ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, వైరా రూరల్ మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, నాయకులు తూము సుధాకర్,‌ తోట నాగేశ్వరరావు, గుడిమెట్ల రజిత, కొంగర సుధాకర్, మల్లెంపాటి రామారావు, మాస్ లైన్ నాయకులు యలదండి బాబు, అఖిల పక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -