రికార్డులు సవరించాలని కలెక్టర్‌కు చైర్మెన్ చల్మెడ వినతి
పెండింగ్ బకాయిలు రూ.4 కోట్లు
విడుదల చేయాలని డిమాండ్
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట పాడి రైతుల నిరసన
నవతెలంగాణ – కరీంనగర్
కరీంనగర్ డెయిరీకి చెందిన భూములను ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ స్టేట్ డెయిరీ ఫెడరేషన్ పేరిట బదలాయించడంపై పాడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లోని సర్వే నంబర్ 1221/A లో కరీంనగర్ డెయిరీ కోసం ప్రభుత్వం గతంలో 22.18 ఎకరాల భూమిని కేటాయించింది. ధరణి రికార్డుల్లోనూ ఇది డెయిరీ పేరుతోనే ఉంది. అయితే, ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఇందులో 11.32 ఎకరాల భూమిని ‘భూభారతి’ పోర్టల్‌లో తెలంగాణ స్టేట్ డెయిరీ ఫెడరేషన్ పేరుతో మార్చారు. సోమవారం భూముల బదలాయింపుపై కరీంనగర్ డెయిరీ చైర్మెన్ చల్మెడ రాజేశ్వర్ ఆధ్వర్యంలో పాడి రైతులు పట్టణంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రికార్డుల సవరణతోపాటు రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ ప్రోత్సాహక బకాయిలు రూ.4 కోట్లను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రాకు రాజేశ్వరరావు, పాలకవర్గ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం డెయిరీ చైర్మెన్ మాట్లాడుతూ.. రైతుల చెమటతో అభివృద్ధి చెందిన సంస్థ ఆస్తులను ఇతరుల పేరిట మార్చడాన్ని తప్పుపట్టారు. వెంటనే రికార్డులను సవరించి, తిరిగి కరీంనగర్ డెయిరీ పేరును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డెయిరీ ప్రయివేటు సంస్థ కాదని, ఇది పూర్తిగా రైతుల చేత నడుస్తున్న సంస్థ అని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి లీటరుపై రూ.2.50 ఆదా..
భూముల వ్యవహారంతోపాటు ప్రభుత్వ విద్యాసంస్థలకు నాణ్యమైన పాలను సరఫరా చేసేందుకు డెయిరీ ప్రతినిధులు కలెక్టర్ ముందు ప్రతిపాదన ఉంచారు. గిరిజన, బీసీ, మైనారిటీ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలకు అధీకృత ఏజెంట్ల ద్వారా పాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం తెలంగాణ డెయిరీ ఫెడరేషన్‌కు లీటరు పాలకు రూ.64.50 చెల్లిస్తుండగా, తాము అదే నాణ్యతతో లీటరును రూ.62 కే ఇస్తామని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు లీటరుపై రూ.2.50 ఆదా అవ్వడంతో పాటు స్థానిక పాడి రైతులకు మార్కెట్ భరోసా లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ప్రతినిధులు, పాడి రైతులు పాల్గొన్నారు.
డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



