Tuesday, August 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌నిషేధిత భూములపై శ్వేతపత్రం ప్రకటించాలి

‌నిషేధిత భూములపై శ్వేతపత్రం ప్రకటించాలి

- Advertisement -

22ఏ పరిధిలో చేరిన సీఎం రేవంత్‌‌రెడ్డి ఇల్లు
అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే నాపై కక్ష
మీడియాతో చిట్‌‌చాట్‌‌లో మాజీమంత్రి హరీశ్‌‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో నిషేధిత భూములపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 2023, డిసెంబర్‌ ఏడు నుంచి ఎన్ని ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారో, ఎన్ని ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి మినహాయింపు ఇచ్చారో స్పష్టం చేయాలని కోరారు. 22ఏ నిబంధన పేరుతో అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి లక్షలాది మంది ప్రజలను అయోమయానికి, గందరగోళానికి గురిచేసిందని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియా‌తో చిట్‌చాట్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి భూమి 22ఏలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1999లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కేంద్రం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారని అన్నారు. ల్యాండ్‌ సీలింగ్ పరిధి నుంచి బయటపడిన భూములను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ 22ఏలో పెట్టడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డులాంటి ప్రభుత్వ భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టిందని అన్నారు. సరూర్‌‌నగర్‌‌లో సర్వే నెంబర్ 8,9 లో 20 ఏండ్లుగా ఇండ్లు కట్టుకుని ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల ఆస్తులను కూడా 22ఏలో పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. 30 ఏండ్ల కింద కొనుక్కున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ కోసం చలాన్లు కట్టి, డబ్బులు చెల్లించిన తర్వాత చివరిలో భూమి 22ఏలో ఉందనే పేరుతో రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నారని వివరించారు. చలాన్‌ ‌డబ్బులను కూడా తిరిగి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎన్‌‌వోసీ వచ్చిన భూములకు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చాయని గుర్తు చేశారు.

ఇప్పుడు అవే భూములు 22ఏలో పెట్టడంతో ప్రజలు, బ్యాంకు అధికారులు ఆగం అవుతున్నారని అన్నారు. బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీలాంటి ప్రాంతాలను సైతం నిషేధిత జాబితాలో పెట్టారని చెప్పారు. ఇది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఆయుధంగా మారిందన్నారు. రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా, 22ఏ నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని అన్నారు. ఇది 30 శాతం కమీషన్‌ ‌ప్రభుత్వమని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఇల్లు కూడా 22ఏ పరిధిలో ఉందన్నారు. సొంత ఇంటికి సెగ తగిలే సరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైందని చెప్పారు. తక్షణమే ఆ భూములను 22ఏ నుంచి తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. కానీ సమీక్షల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనీ, కమీషన్ల కోసమేనా?అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను 22ఏలో ఎవరు పెట్టారు? ఆదేశాలు ఎవరు ఇచ్చారో విచారణ జరపాలని కోరారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

​తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి
తెలంగాణ నీటిహక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని హరీశ్‌‌రావు విమర్శించారు. జీఆర్‌ఎంబీ ఎజెండాలోని అంశాలపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రశ్నిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. జీఆర్‌ఎంబీ సమావేశం వాయిదా పడితే సరిపోదనీ, ఎజెండా నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడు ప్రాజెక్టుల అనుమతులపై చర్చించాలన్న అంశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -