కమిటీ సిఫారసుల ఆధారంగా చర్యలు
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఐఆర్లపై నిర్ణయం
ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీజేపీ తలపెట్టిన ‘ పార్లమెంట్ మార్చ్’ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ డీజీపీతో కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు బుధవారం వెలువడనున్నాయని ధర్మాసనం ప్రకటించింది. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసకు సంబంధించిన వీడియో ఫుటేజీ, సీసీ టీవీ రికార్డింగ్స్‌ను కమిటీకి అందజేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో మహిళా నిరసనకారులే లక్ష్యంగా దాడులు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు, నమోదైన ఫిర్యాదులను కూడా ఈ ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని ధర్మాసనం తెలిపింది. బాధితులందరి వాదనలను కమిటీ వింటుందని, కమిటీ సిఫారసుల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలను అందజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. నేర చరిత్ర లేని విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే అంశాన్నీ పరిశీలిస్తామని తెలిపింది. ఆర్టికల్ 19 కింద నిరసనలు తెలిపే అధికారం విద్యార్థులకు ఉందని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఐఆర్లపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పార్లమెంట్ మార్చ్ చట్టవ్యతిరేకమా?
జులై 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా అక్కడి విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు, కేంద్ర బలగాలు లాఠీచార్జీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టియర్ గ్యాస్, పెల్లెట్స్ ప్రయోగం కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి ఢిల్లీ పోలీసులు బదులిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. సీజేపీ ఆందోళనకు అనుమతి లేదని, అది చట్టవ్యతిరేకమని తెలిపారు. అలాగే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందువల్లే బలప్రయోగం చేయాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ అఫిడవిట్లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌కు జంతర్ మంతర్ వద్దకు 30,000 మంది వరకు వచ్చారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వారంతా నిలిచి ఉన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు 5,000 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. మొదట ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగింది. ఆ తరువాత కొందరు ఆందోళనకారులు బారికేడ్లు దాటుకుంటూ పార్లమెంట్ వైపు దూసుకొచ్చారు. దీంతో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ తలెత్తింది.
ఈ క్రమంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో వారిని అదుపు చేసేందుకే బలప్రయోగం చేయాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో 240 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 200 మంది ఆందోళనకారులకూ గాయాలయ్యాయి. ఆందోళనకారులు మరింత ముందుకు రాకుండా ఉండేందుకు, శాంతి భద్రతల్ని కాపాడేందుకే లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఆందోళనలో పాల్గొన్న వారిలో కొందరిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. 2,873 మందిపై హత్యాయత్నం, దోపిడీ, పోక్సో సహా పలు క్రిమినల్ కేసులున్నాయి. వీటిని సిట్ విచారిస్తోంది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు మేకులు కలిగిన లాఠీలను వాడలేదు. ఈ నిరసన సమయంలో కొందరు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. వారిపై దాడి జరిగింది అంటూ వైరల్ అయిన కంటెంట్‌లో పూర్తి వివరాలు లేవని, వాటిలో స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. ఆందోళనలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వాడినట్టు’ పోలీసులు తెలిపారు. అయితే ఈ అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు విచారించాల్సి ఉంది. అలాగే విద్యార్థుల తరపున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాదులు కూడా వాదనలు వినిపించనున్నారు.



