నవతెలంగాణ – హైదరాబాద్: ప్రీమియం కిటికీలు, ఫసాడ్‌లు, రైలింగ్‌లు, ఆటోమేషన్, స్మార్ట్-బిల్డింగ్ పరిష్కారాలను అందించడంతో పాటుగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న సంస్థ, యాక్టివ్.ఇన్ గా ప్రసిద్ధి చెందిన యాక్టివ్ గ్రీన్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాబోయే 12-18 నెలల్లో 15 కొత్త ఫ్రాంచైజీ అవుట్‌లెట్లతో దక్షిణ భారతదేశంతో పాటుగా భువనేశ్వర్ లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది.
ఈ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, భువనేశ్వర్‌లలో తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. దీని ద్వారా కీలకమైన నివాస, వాణిజ్య, మౌలిక సదుపాయాల మార్కెట్లలో యాక్టివ్.ఇన్ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది.
ఈ ప్రకటన కంపెనీ వృద్ధి ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుంది. కేవలం 15 మంది ఉద్యోగుల బృందంతో ప్రారంభమైన యాక్టివ్.ఇన్, ఇప్పుడు 400 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థగా ఎదిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక భాగస్వామ్యాలను, భారతదేశంలో తమ సొంత తయారీ, ఉత్పత్తి అభివృద్ధి , అమలు సామర్థ్యాలతో మిళితం చేస్తుంది.
కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అల్యూమినియం, యుపివిసి కిటికీలు, తలుపులు, ఫసాడ్‌లు, స్కైలైట్‌లు, పెర్గోలాలు, రైలింగ్‌లు, బ్యాలస్ట్రేడ్‌లు, వుడెన్ డోర్లు , మోటరైజ్డ్ స్క్రీన్‌లు, ఫ్రెష్-ఎయిర్ సిస్టమ్‌లు, హోమ్ ఆటోమేషన్, లైటింగ్ , బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌లు ఉన్నాయి.
యాక్టివ్.ఇన్ యొక్క టెక్నాలజీ ఎకోసిస్టమ్‌కు జర్మనీకి చెందిన షూకో, అల్యూప్లాస్ట్ మరియు క్యు – రెయిలింగ్ ; బెల్జియంకు చెందిన రెన్సన్; మలేషియాకు చెందిన శాండోర్ ; మరియు లూట్రాన్, లెగ్రాండ్, సిమెన్స్, బాష్ మరియు ఇండో ఎండో వంటి గ్లోబల్ కంపెనీలు భాగస్వామ్య మద్దతు ఇస్తున్నాయి.
మార్కెట్‌కు మరింత చేరువగా తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం
తమ విస్తరణలో భాగంగా, యాక్టివ్.ఇన్ బెంగళూరులో తమ సొంత షోరూమ్‌ను అభివృద్ధి చేసింది, అదే సమయంలో కర్ణాటకలోని దాని కొత్త తయారీ యూనిట్ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. కర్ణాటక, కేరళ , తమిళనాడు రాష్ట్రాలలో కంపెనీ ఉత్పతులకు పెరుగుతున్న డిమాండ్ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఈ సదుపాయం అభివృద్ధి చేయబడుతోంది. ఇది ఈ ప్రాంతం అంతటా వినియోగదారులకు సేవ చేయగల కంపెనీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
యాక్టివ్.ఇన్ యొక్క తయారీ నెట్‌వర్క్ , ఇప్పటికే తెలంగాణలో ఉన్న రెండు కేంద్రాలపై ఆధారపడి వుంది.
సుల్తాన్‌పూర్ ప్లాంట్ ప్రత్యేకంగా షుకో అల్యూమినియం కిటికీలు, ఫసాడ్‌లు, మోటరైజ్డ్ పెర్గోలాలు, స్క్రీన్‌లు మరియు కర్టెన్ ట్రాక్‌లను తయారు చేస్తుంది. ఈ ప్లాంట్ నెలకు సుమారు 2 లక్షల చదరపు అడుగుల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం నెలకు 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది.
పాశమైలారం ప్లాంట్‌లో, యాక్టివ్.ఇన్ సంస్థ తమ సొంత యాక్టివ్-బ్రాండెడ్ అల్యూమినియం కిటికీలు, ఫసాడ్‌లు మరియు రైలింగ్‌లను తయారు చేస్తుంది. వీటిని కంపెనీయే డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, భద్రత , ప్రామాణికతల కోసం పరీక్షిస్తుంది. ఈ యూనిట్ నెలకు సుమారు 1 లక్ష చదరపు అడుగుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్ ప్రస్తుతం దాదాపు 70% వినియోగంతో పనిచేస్తోంది.
గత ఆరేళ్లుగా యాక్టివ్.ఇన్ తమ సొంత బ్రాండ్ ఉత్పత్తులను ప్రైవేట్ ఇళ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు , సంస్థాగత ప్రాజెక్టులకు అందిస్తూ, నివాస, సంస్థాగత విభాగాలలో తన ప్రాజెక్టుల పరిధిని విస్తరించుకుంటోంది.
ఈ విస్తరణపై యాక్టివ్ గ్రీన్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ముదునూరి వెంకట సుబ్బరాజు మాట్లాడుతూ, “తయారీ, ఉత్పత్తి అభివృద్ధి, కార్యకలాపాల నిర్వహణలో స్థానిక సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే, ప్రపంచ స్థాయి సాంకేతికతను భారత్‌కు తీసుకురావడంపై మా వృద్ధి ఆధారపడి ఉంది. కేవలం 15 మంది సభ్యులతో ప్రారంభమైన మా బృందం, 400 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థగా ఎదిగే క్రమంలో, మా వినియోగదారులకు , భాగస్వాములకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను మేము క్రమంగా అభివృద్ధి చేసుకున్నాము. ఆ ప్రయాణంలో మా తదుపరి అడుగు, దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మా విస్తరణ. బెంగళూరులో మేము ప్రారంభించిన నూతన కార్యకలాపాలకు తోడు ఈ ప్రాంతం కోసం తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని వినియోగదారులకు మరింత వేగంగా, స్థిరంగా, పెద్ద ఎత్తున సేవలు అందించడానికి మేము సిద్ధమవుతున్నాము” అని అన్నారు.
తమ విస్తృత తయారీ, అధునాతన సిఎన్ సి యంత్రాలు, ఒక ప్రత్యేకమైన పౌడర్-కోటింగ్ సదుపాయం, ప్రత్యేక ఇన్వెంటరీ మరియు లాజిస్టిక్స్, సకాలంలో సరఫరా కోసం సొంత వాహన సముదాయం సహా లాజిస్టిక్స్ వ్యవస్థలపై కూడా యాక్టివ్.ఇన్ భారీగా పెట్టుబడులు పెట్టింది.
పౌడర్ కోటింగ్ , గ్లాస్ ప్రాసెసింగ్‌లో పెట్టుబడుల ద్వారా కంపెనీ తమ తయారీ సామర్థ్యాలను మరింత విస్తృతం చేసుకుంటోంది. అదే సమయంలో, తమ అల్యూమినియం ఉత్పత్తులు, అనుబంధ ఉత్పత్తి శ్రేణుల కోటింగ్ అవసరాలకు మద్దతు ఇవ్వడానికి దాని కొత్త యాక్టివ్ సర్ఫేస్ కోటింగ్స్ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తోంది.
యాక్టివ్ గ్రీన్ ప్రొడక్ట్స్ సీఈఓ & డైరెక్టర్ పోతురాజు శ్రీలక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ, “భారతదేశంలో భవన, మౌలిక సదుపాయాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే డిజైన్, పనితీరు, సాంకేతికత, విశ్వసనీయతలను మిళితం చేసే పరిష్కారాల కోసం వినియోగదారులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్లుగా మేము నెలకొల్పిన ప్రమాణాలను, వినియోగదారుల అనుభవాన్ని కాపాడుకుంటూనే, ఈ సామర్థ్యాలను అన్ని మార్కెట్లలో మరింత అందుబాటులోకి తీసుకురావడంపై మేము దృష్టి సారిస్తున్నాము. అందువల్ల, దక్షిణ భారతదేశ విస్తరణ అనేది కేవలం మా కార్యకలాపాలను పెంచుకోవడం కోసం మాత్రమే కాదు; తయారీ, సాంకేతికత , సేవా సామర్థ్యాల మద్దతుతో మరింత బలమైన ప్రాంతీయ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం గురించినది” అని అన్నారు.
వేలాది ప్రైవేట్ గృహాలు, విల్లా డెవలప్‌మెంట్‌లు, అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌లు, వాణిజ్య మరియు సంస్థాగత ప్రాజెక్ట్‌లను యాక్టివ్.ఇన్ పూర్తి చేసింది. దీని ఉత్పత్తులు నివాస, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆతిథ్య మరియు పారిశ్రామిక రంగాలలో ఉపయోగించబడుతున్నాయి.
విస్తరణను మరింత వేగవంతం చేస్తూ , భారతదేశంలో ఒక విస్తృత స్థాయి సాంకేతిక , తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయటంతో పాటుగా రూ. 1,000 కోట్ల వ్యాపార సంస్థగా ఎదగడానికి యాక్టివ్.ఇన్ లక్ష్యంగా పెట్టుకుంది.



