Thursday, August 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసైంటిఫిక్ టెంపర్-నేటి అవసరం

సైంటిఫిక్ టెంపర్-నేటి అవసరం

- Advertisement -

స్వతంత్ర భారతం ఎనభయ్యవ పడిలో పడింది. ఇన్నేండ్ల స్వతంత్రం మన జాతి నేతల కలలను ఏ మేరకు నెరవేర్చింది? నాటి జాతీయోద్యమ దిక్సూచి సరైన దారిలోనే పయనిస్తోందా? ఇప్పటికైనా ప్రశ్నించుకోకపోతే ప్రశ్నే దేశద్రోహంగా మనల్ని వెక్కిరిస్తుంది. అప్పటివరకూ బ్రిటిష్ పీల్చి పిప్పిచేసిన దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించడానికి సైన్సును, సాంకేతికతను ఒక చోదకశక్తిగా ఎంచుకున్నారు. ఆ దిశగా చేసిన కృషి ఫలితంగానే మన దేశం పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ముందడుగు వేసింది. శాస్త్ర రంగంలో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు ఐఐటీలను, పరిశోధనా సంస్థలను నెలకొల్పి ధీటైన శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులను రూపొదించటంలో మార్గదర్శనం చేసినవారు మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఆయనే ఒక సందర్భంలో మనం వందలాది శాస్త్రజ్ఞులను తయారు చేస్తున్నాం కాని వారిలో ‘సైంటిఫిక్ టెంపర్’ లోపిస్తున్నదని వాపోయాడు. సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమిటి? శాస్త్రీయ స్పృహ, శాస్త్రీయ దృక్పథం. సమస్యలను అర్థం చేసుకోవటంలో హేతుబద్ధమైన ఆలోచన, క్రమబద్ధమైన విశ్లేషణ, శాస్త్రీయ పరిష్కారం. దీనికి మూలం ప్రశ్న, ప్రశ్నించటం. ప్రశ్ననే విజ్ఞానానికి ద్వారం, జ్ఞానానికి తోవ. ఈ మార్గాన్ని వీడిన సమాజం అంధకార బంధురం. మన రాజ్యాంగం సైతం పౌరుల మౌలిక విధుల్లో దీన్ని పేర్కొనటం గమనార్హం.

ఆర్టికల్ 51 Aలో ప్రతిపౌరుడూ మానవత్వాన్నీ, ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పింది. వీటిని ప్రోది చేసేందుకు మన మాటలు చేతలు దోహద పడాలని దీని సారాంశం. కాని గత కొన్నేండ్లలో జరిగినది? నేడు జరుగుతున్నదేమిటి? జాతీయోద్యము కాలం నుంచీ, ఆ మాటకొస్తే అంత కంటే ముందు నుంచే మన దేశంలో మూఢ విశ్వాసాలపై సమరం సాగుతున్నది. స్వాతంత్ర్యం సాధించిన ఏడు దశాబ్దాల తర్వాత దానికి గడ్డురోజులు వచ్చాయి. ప్రజల మనోభావాలు, విశ్వాసాల ముసుగులో మూఢత్వం వెర్రితలలు వేస్తోంది. అందుకు ఉదాహరణే 2013లో జరిగిన డా. నరేంద్ర ధబోల్కర్‌ హత్య. ఆయన ఒక ప్రజావైద్యుడు. అంతేకాదు, ఆయన 1989లో అంధశ్రద్ధా నిర్మూలన సమితిని స్థాపించాడు. సమా జంలో చేతబడులు లేదా బాణామతి, దొంగబాబాల బారినపడి కునారిల్లు తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు సైన్సును వివరించాడు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని మహారాష్ట్రలో పెద్ద ఉద్యమమే నడిపాడు. ప్రజల్లో ఆయన కలిగిస్తున్న చైతన్యం చూసి గంగవెర్రులెత్తిన మూక ఆయన్ను 2013, ఆగస్టు 20న హత్యచేసింది. వ్యక్తిగా ఆయన్ను హత్యగావించినా ఆయన పోరాటం వృథా కాలేదు. ధబోల్కర్‌ మరణించిన కొని మాసాల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీ మూఢవిస్వాసాల వ్యతిరేక చట్టం తెచ్చింది. ఆయన మరణించిన ఆగస్టు 20న మూఢనమ్మ కాల వ్యతిరేక దినంగా మహారాష్ట్రలో పాటిస్తారు. అఖిలభారత సైన్సు నెట్‌వర్క్‌ (AIPSN) ఈ రోజును శాస్త్రీయ దృక్పథం జనం లేదా సైంటిఫిక్ టెంపర్ డేగా దేశవ్యాపితంగా నిర్వహిస్తోంది.

ధబోల్కర్‌నే కాకుండా మూఢ నమ్మకాలను ప్రశ్నించిన, వ్యవస్థపై ప్రశ్నలు సంధించిన ఎందరినో సమాజంలో మూఢ విశ్వాసాలు పరిఢవిల్లాలని కోరుకునే వారు పొట్టన పెట్టుకున్నారు. గౌరీ లంకేష్, గోవింద పన్సారేల హత్యలు అందులో భాగమే. ప్రశ్నించే వ్యక్తుల్ని మట్టుపెట్టడం ద్వారా ప్రశ్నకు, సైంటిఫిక్ టెంపర్‌‌కు సమాధి కట్టాలనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? ముమ్మాటికీ కాదు.
సైంటిఫిక్ టెంపర్‌ను ప్రోత్సహించవలసిన ప్రభుత్వాలు, నేతలే అందుకు విరుద్ధంగా వ్యవహరించటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నెహ్రూకు వారసులం, అనుచరులమని చెప్పుకునే వారు సైతం ఇందుకు మినహాయింపు కాదు. అందుకు నాగార్జునసాగర్‌లో గతవారం జరిగిన వరుణయాగమే మంచి ఉదాహరణ. వర్షాలు వరుణుడు కరుణిస్తే వస్తున్నాయా? లేక ప్రకృతి సహజంగా రుతుపవనాల వలన పడుతున్నాయా? రుతుపవనాలను ప్రభావితం చేసి వర్షాలపై ప్రభావం చూపిన ఎల్‌నినో మాటేమిటి? వాతావరణ శాస్త్రం ఉత్తుత్తదేనా?

మరిరోజూ ముందస్తుగా వాతావరణ సూచనలు ఇవ్వటం దేనికి? సైన్సును ఉపయోగించుకుం టూనే మళ్లీ తద్విరుద్ధంగా పూజలు చేయటం! అదీ రాజ్యంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి, మంత్రులూ. గతంలో ప్రభుత్వాలు మేఘమథనం చేసి వర్షాలు కురిపించే ప్రయత్నాలు చేశాయంటే అర్థం చేసుకోవచ్చు. సైంటిఫిక్ టెంపర్ లోపిస్తుందని నెహ్రూ వెలిబుచ్చిన ఆవేదన నేటి రాజకీయ వారసులకు తెలియదను కోవాలా లేక ప్రజలను మభ్యపెట్ట టంగా భావించాలా? ఇది ఏలిన వారికి ఎంతమాత్రం విహితం కాదు. సైంటిఫిక్ టెంపర్, హేతుబద్ధమైన ఆలోచనల నుంచి ప్రజలను దూరం చేస్తున్న నేటి తరుణంలో నిత్యజీవితంలో సైంటిఫిక్ టెంపర్‌ ఆవశ్యకత ను విడమర్చి చెప్పటం అత్యవస రం. మహారాష్ట్రలాగా మన రాష్ట్రం లో కూడా మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం రావాలి. దాన్ని ఆశించటం అత్యాశే అవుతుం దేమో! కాని ఆ కోణంలో సైన్సు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ముమ్మరంగా సాగాల్సిన అవసం ఎంతైనా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -