Thursday, August 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎల్‌ఐసి వాటాల విక్రయం.. ఎవరి ప్రయోజనాల కోసం?

ఎల్‌ఐసి వాటాల విక్రయం.. ఎవరి ప్రయోజనాల కోసం?

- Advertisement -

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసి)లో 6.5 శాతం వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 2022లో ఐపిఓ పేరుతో 3.5 శాతం వాటాలను విక్రయించి రూ.21 వేల కోట్లు సమీకరించిన కేంద్రం, ఇప్పుడు మరో 6.5 శాతం వాటాలను విక్రయించి దాదాపు రూ.31 వేల కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. బీమా ఉద్యోగులు, పాలసీదారులు, ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందుకు సాగడం అభ్యంతరకరం. ఎల్‌ఐసి వాటాల విక్రయానికి, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచడానికి వ్యతిరేకంగా బీమా ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా పెట్టుబడుల ఉపసం హరణకు పూనుకోవడం ఆందోళనకరం. ఎల్‌ఐసి కేవలం ప్రభుత్వ రంగ సంస్థ కాదు. కోట్లాది ప్రజలకు బీమా రక్షణ కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా నిధులు సమకూరుస్తున్న వ్యూహాత్మక సంస్థ.

ఐపిఓ తర్వాత.. మరోసారి వాటాల విక్రయం
ఎల్‌ఐసిని స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేసేందుకు 1956 నాటి ఎల్‌ఐసి చట్టానికి 2022లో సవరణలు చేశారు. అదే ఏడాది మేలో ఎల్‌ఐసి తొలిసారిగా ప్రజలకు షేర్లు విక్రయించే ఐపిఓ (ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా 3.5 శాతం వాటాలను విక్రయించి రూ.21 వేల కోట్లు సమీకరించింది. సాధారణంగా స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థలు మూడేండ్లలో 25 శాతం వాటాలను ప్రజలకు విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌ఐసికి పదేండ్ల గడువు ఇచ్చారు. అంటే 2032 మేలోపు ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. అయితే 2027 మార్చిలోపు 10 శాతం వాటాలను విక్రయించాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు తన వద్ద ఉన్న ఎల్‌ఐసి షేర్లలో సుమారు 82 కోట్ల షేర్లను ఓఎఫ్‌ఎస్‌ (ఆఫర్‌ ఫర్‌ సేల్‌) ద్వారా విక్రయించేందుకు సిద్ధమవుతోంది. అంటే ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన ఎల్‌ఐసిలో ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని నేరుగా మార్కెట్‌లో విక్రయించడమే ఓఎఫ్‌ఎస్‌. ఈ విక్రయం ద్వారా దాదాపు రూ.31 వేల కోట్లు సమీకరించాలని కేంద్రం చూస్తోంది. సంస్థ అవసరాల కోసం కాకుండా ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకోవడం కోసం ఎల్‌ఐసి వాటాలను విక్రయించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం చెప్పాలి.

ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ఎల్‌ఐసికే పరిమితం కాలేదు. జిఐసి రీ (జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా–రీ) దేశానికి చెందిన ప్రభుత్వ రంగ పునఃబీమా సంస్థ. బీమా కంపెనీలకు పెద్ద ప్రమాదాల సమయంలో ఆర్థిక రక్షణ కల్పించే ఈ సంస్థలోనూ ప్రభుత్వం తన వాటాలను విక్రయిస్తోంది. జూన్‌ 16–17, 2026న జిఐసి రీలో ఐదు శాతం వాటాలను ప్రభుత్వం ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించింది. దీనికి ముందు 2017లో 14.22 శాతం, 2024లో 3.4 శాతం వాటాలను ఉపసంహరించుకుంది. తాజా విక్రయంతో జిఐసి రీలో ప్రభుత్వ వాటా 77.4 శాతానికి తగ్గింది. బీమా రంగానికి, దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన ఇలాంటి వ్యూహాత్మక సంస్థల్లో ప్రభుత్వ యాజమాన్యాన్ని క్రమంగా తగ్గించడం ఆందోళన కలిగించే అంశం.

రిటైల్‌ మదుపుదారులకు నిజంగా లాభమా?
ఎల్‌ఐసి వాటాల విక్రయంతో రిటైల్‌ మదుపుదారులు లాభపడతారన్న వాదన కూడా వాస్తవాలను పరిశీలిస్తే నిలబడదు. 2025 మార్చి 31 నాటికి ఎల్‌ఐసిలో 24,05,533 మంది వాటాదారులు ఉన్నారు. వారిలో 23,84,559 మంది వద్ద కలిపి 8,25,80,224 షేర్లు ఉన్నాయి. అంటే ఒక్కో చిన్న మదుపుదారుడి వద్ద సగటున 35 షేర్లు మాత్రమే ఉన్నాయి.అదే సమయంలో కేవలం 675 మంది వ్యక్తిగత, సంస్థాగత పెట్టుబడిదారుల వద్ద 10,95,77,799 షేర్లు ఉన్నాయి. అంటే ఒక్కో పెద్ద పెట్టుబడిదారుడి వద్ద సగటున 1.62 లక్షల షేర్లు ఉన్నాయి. ఈ గణాంకాల నేపథ్యంలో చిన్న మదుపుదారుల ప్రయోజనం పేరుతో ఓఎఫ్‌ఎస్‌ను సమర్థించడం సరికాదు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచితే దేశీయ రంగానికి ప్రయోజనం కలుగుతుందని చెబుతోంది. ఎఫ్‌డిఐల ద్వారా రూ.83,843 కోట్లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. కానీ ఏఐజీ, ఐఎన్‌జీ, ఆక్సా, న్యూయార్క్‌ లైఫ్‌, స్టాండర్డ్‌ లైఫ్‌, ఓల్డ్‌ మ్యూచువల్‌, రాయల్‌ సన్‌ అలయన్స్‌ వంటి పలు విదేశీ సంస్థలు భారత మార్కెట్‌ నుంచి నిష్క్ర మించాయి. ఇటీవల జర్మనీకి చెందిన అలియాంజ్‌ కూడా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో జాయింట్‌ వెంచర్‌ను ముగించింది. కాబట్టి విదేశీ పెట్టుబడులు వస్తే దేశీయ బీమా రంగానికి తప్పనిసరిగా మేలు జరుగుతుందను కోవడం సరికాదు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్‌ఐసి వెన్నెముక
1956 సెప్టెంబర్‌ ఒకటిన రూ.5 కోట్ల ప్రభుత్వ మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసి నేడు రూ.59 లక్షల కోట్ల మేర ఆస్తులను సమకూర్చుకుంది. దాదాపు 40 కోట్ల వ్యక్తిగత, గ్రూప్‌ పాలసీదారులతో ప్రపంచంలోని అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.51 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలతో పాటు గృహ నిర్మాణం, నీటిపారుదల, మౌలిక వసతులకు భారీగా నిధులు సమకూర్చింది. ఏటా రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు దేశాభివృద్ధికి పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఎల్‌ఐసికి ఉంది. పనితీరులోనూ అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఏ బీమా సంస్థ పనితీరును అంచనా వేయడానికి క్లెయిమ్‌ల పరిష్కారం ముఖ్యమైన కొలమానం. ఎల్‌ఐసి 99.44 శాతం క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియోతో అత్యుత్తమ స్థాయిలో ఉంది. 2023–24లో సుమారు రెండు కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌–2026 నివేదికలో బలమైన బీమా బ్రాండ్లలో ప్రపంచంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రభుత్వానికి కూడా ఎల్‌ఐసి భారీ ఆదాయాన్ని అందిస్తోంది. 1956 నుంచి ఇప్పటివరకు డివిడెండ్‌ రూపంలో దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా చెల్లించింది. 2025– 26లోనే రూ.12,707 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందించింది. ఇంతటి ఆదాయాన్ని అందిస్తున్న సంస్థలో ప్రభుత్వం వరుసగా వాటాలు విక్రయించడం ఎంతవరకు సమర్థనీయం?

లాభం కంటే సామాజిక బాధ్యత ముఖ్యం
ఎల్‌ఐసి స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన తర్వాత షేర్‌హోల్డర్ల ప్రయోజనాల ఒత్తిడి పెరిగింది. మరిన్ని వాటాలు ప్రయివేటు, విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తే వారి లాభాల కోసం సంస్థ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి పెరిగే ప్రమాదం ఉంది. కానీ ఎల్‌ఐసి ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం కేవలం లాభాల ఆర్జన కాదు. ప్రజల పొదుపులను సమీకరించడం, వారికి బీమా రక్షణ కల్పించడం, ఆ నిధులను దేశ అభివృద్ధికి వినియోగించడం కూడా దాని సామాజిక బాధ్యత.ప్రభుత్వానికి తాత్కాలికంగా ఆదాయం రావచ్చు. కానీ ప్రభుత్వ యాజమాన్యం తగ్గితే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉంది. లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా వాటాల విక్రయం ద్వారా బలహీనపరచడం దీర్ఘకాలంలో ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు విఘాతం కలిగించవచ్చు.

ఉపసంహరణ కాదు.. బలోపేతమే మార్గం
ప్రజల విశ్వాసంతో ఎల్‌ఐసి నేటికీ మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది. క్లెయిమ్‌ల పరిష్కారం, భారీ పెట్టుబడులు, ప్రభుత్వానికి అందిస్తున్న డివిడెండ్లు, కోట్లాది పాలసీదారులకు అందిస్తున్న బీమా రక్షణ సంస్థ ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. అలాంటి సంస్థలో మరోసారి 6.5 శాతం వాటాలను విక్రయించడానికి సహేతుకమైన కారణం ఏమిటో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. కేవలం ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకోవడం కోసం ప్రజల నమ్మకంతో నిర్మితమైన సంస్థ వాటాలను విక్రయించడం సరైన విధానం కాదు. పెట్టుబడుల ఉపసంహరణను పునరాలోచించి, ఎల్‌ఐసికి మరింత స్వతంత్రత కల్పించి, సంస్థను బలోపేతం చేయాలి. ఎల్‌ఐసి బలపడితే కోట్లాది పాలసీదారులకు బీమా భద్రత పటిష్ట మవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక పెట్టుబడులు పెరుగుతాయి. ప్రభుత్వానికీ పన్నులు, డివిడెండ్ల రూపంలో ఆదాయం కొనసాగుతుంది. అందువల్ల ఎల్‌ఐసి వాటాల విక్రయం ద్వారా తాత్కాలిక ఆదాయం పొందడం కంటే, సంస్థను ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా బలోపేతం చేయడమే దేశ ఆర్థిక స్వావలంబనకు, పాలసీదారుల ప్రయోజనాలకు శాశ్వతమైన మార్గం.

పి.సతీష్, 9441797900

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -