Thursday, August 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసర్‌- పౌరసత్వం కోసం పోరాటం

సర్‌- పౌరసత్వం కోసం పోరాటం

- Advertisement -

“భారతదేశ ప్రజలమైన మేము…” – రాజ్యాంగం లోని ఈ ప్రారంభ పదాలు భారత గణతంత్రానికి పునాది అయిన ప్రజల సార్వభౌ మాధికారాన్ని ప్రతిబింబిస్తాయి. పౌరసత్వం ఎవరో ప్రసాదించే ప్రత్యేక హక్కు కాదు, అది సమాన హక్కు, సమాన గౌరవం, ప్రజాస్వా మ్యంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించే రాజ్యాంగ హోదా. ఈ నేపథ్యంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)’పై సుప్రీంకోర్టు చేసిన స్పష్టీకరణకు ప్రాధాన్యత ఉంది. ‌సర్‌ పౌరసత్వాన్ని నిర్ణయించే ప్రక్రియ కాదని, ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం రద్దుకాదని కోర్టు పేర్కొంది. అయితే ఓటర్ల జాబితా పరిశీలనను పౌరసత్వం, ఇతర హక్కులతో ముడిపెట్టే ప్రయత్నాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. 2026 జూలై 17న సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు కీలకమైన సమయంలో వచ్చాయి. ఎన్నికల పరిశీలన, పౌరసత్వం, దానికి సంబంధించిన ఇతర హక్కుల మధ్య సంబంధం ఏర్పడుతుందనే భయాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. అదే సమయంలో సర్‌ ప్రక్రియకు గతంలో కోర్టు ఇచ్చిన ఆమోదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.రెండు భిన్న జాతీయత భావనలుసర్‌ను భారతదేశ స్వరూపంపై జరుగుతున్న సిద్ధాంతపరమైన పోరాటం నుంచి వేరుచేసి చూడలేం.

రాజ్యాంగం భారతదేశాన్ని ప్రజల సార్వభౌమాధికారంపై ఆధారపడిన గణతంత్రంగా నిర్వచించింది. మతం, కులం, సామాజిక నేపథ్యం ఏదైనా ప్రతి పౌరుడికి సమాన రాజకీయ హక్కులు ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. మరోవైపు ఎం.ఎస్. గోల్వాల్కర్ రచించిన “We, or Our Nationhood Defined”లో భారతదేశాన్ని ప్రధానంగా హిందూ జాతిగా చూసే భావనను ప్రతిపాదించారు. ఈ దృక్పథంలో జాతీయ గుర్తింపు రాజ్యాంగపరమైన పౌరసత్వంకంటే సాంస్కృతిక అనుబంధంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ రెండు భావనల మధ్య తేడా, గత కొన్నేండ్లుగా పౌరసత్వానికి సంబంధించి జరుగుతున్న వివిధ చర్యలను అర్థం చేసుకోవడం కీలకం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌.. సావర్కర్, జిన్నాల జాతీయత భావనలను ప్రస్తావిస్తూ, ఇద్దరూ భారతదేశంలో హిందూ, ముస్లిం అనే రెండు జాతులున్నాయనే విషయంలో ఏకీభవించారు.సార్వత్రిక ఓటుహక్కు – ప్రజాస్వామ్యానికి పునాదిరాజ్యాంగంలోని ఆర్టికల్ 325 మతం, జాతి, కులం, లింగం ఆధారంగా ఓటర్ల జాబితాలో చేర్చకుండా నిరాకరిం చడాన్ని అడ్డుకుంటుంది. ఆర్టికల్ 326 సార్వత్రిక ఓటుహక్కును హామీ ఇస్తుంది. అందువల్ల ఓటు హక్కు ప్రజలు తమ సార్వభౌమా ధికారాన్ని వినియోగించుకునే ప్రధాన మార్గాల్లో ఒకటి. ఢిల్లీ జీబీ రోడ్‌కు చెందిన రీటా అనే సెక్స్‌వర్కర్ తన ఓటు తనను “ఏదో ఒకరకంగా సమానమైన వ్యక్తిగా భావించేలా చేస్తుంది” అని చెప్పడం దీనికి ఉదాహరణ.

సామాజిక, ఆర్థిక వివక్షను ఎదుర్కొంటున్న ఆమెకు, తన ఓటుకూ అత్యంత సంపన్నుడి ఓటుకూ ఒకే విలువ ఉండటం సమాన పౌరసత్వానికి ప్రత్యక్ష అనుభూతిని ఇస్తుంది. అందుకే ఓటర్ల జాబితా కచ్చితంగా, పారదర్శకంగా సవరించడంతో పాటు నిజమైన పౌరులు అన్యాయంగా ఓటు హక్కును కోల్పోకుండా చూడటం అత్యంత అవసరం. పరిమితులు చూస్తే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరించగలదే తప్ప పౌరసత్వాన్ని నిర్ణయించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయిన ప్పటికీ ఓటర్ల జాబితా పరిశీలనలో ప్రతికూల నిర్ణయం ఒక వ్యక్తిని దీర్ఘకాలిక అధికారిక విచారణలు, న్యాయపరమైన చర్యలు, అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టవచ్చు. డాక్టర్ ఖలేదా ఖాతూన్ తన పేరు “అడ్జుడికేషన్‌లో” ఉంచినట్లు తెలుసుకున్న తర్వాత, విద్యార్హతలు, కుటుంబ భూముల పత్రాలు, పూర్వీకులతో సంబంధాన్ని నిరూపించే పత్రాలు అందజేశారు. అయినప్పటికీ ఆమెను “చెల్లని, అక్రమ ఓటరు”గా ప్రకటించారు.ఇలాంటి అనుభవాలు ఓటర్ల జాబితా పరిశీలనకు, పౌరసత్వ విచారణకు మధ్య ఉన్న తేడా ఆచరణలో ఎంత పలుచబడు తోందో చూపిస్తున్నాయి.

ఒక వ్యక్తి ఓటర్ల జాబితాలో తన అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి, తరువాత పౌరసత్వం లేదా ఇతర ప్రభుత్వ సేవల విషయంలో కూడా అనుమానాలకు దారితీయవచ్చనే ఆందోళన ఉంది. అందువల్ల ఎన్నికల పరిశీలనలో తీసుకునే నిర్ణయాలు అత్యంత జాగ్రత్తగా, న్యాయబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.“కాగజ్ నహీ దిఖాయేంగే”దశాబ్దకాలంగా సర్‌తో పాటు ఎన్‌ఆర్‌‌సి, సిఎఎ, దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌‌సి ప్రతిపాదనలు, “అక్రమ చొరబాటు దారులు” అనే రాజకీయ ప్రచారాలు వంటి అనేక చర్యలు పౌరసత్వాన్ని పత్రాలు, ధృవీకరణ, అధికారిక పరిశీలనతో ముడిపెట్టే వాతావరణాన్ని సృష్టించాయి. దీంతో భారత గణతంత్రం క్రమంగా మెజారిటీ ఆధిపత్య దిశగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే సిఎఎ-ఎన్‌ఆర్‌‌సి వ్యతిరేక ఉద్యమాల్లో “కాగజ్ నహీ దిఖాయేంగే” అనే నినాదం శక్తివంతమైన నిరసనగా మారింది.మైనారిటీలను పరాయివారిగా చూపించే ప్రక్రియ సర్‌ మైనారిటీలను అనుమానాస్పదులుగా చూపించే పరిస్థితిని మరింత పెంచిందనే విమర్శ ఉంది.

ముఖ్యంగా ముస్లింలు ‌సర్‌‌ను ఎన్‌ఆర్‌‌సి-సిఎఎపై గత అనుభవాల నేపథ్యంలో చూస్తున్నారు. యామినీ అయ్యర్ వివరించిన ఒక సందర్భంలో, తితాగఢ్‌లో ఒక హిందూ మహిళ తన కుమార్తెల ఉనికిని నిరూపించేందుకు పత్రాల కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఆమె ఆవేదనగా “మనిషి తన ఉనికిని పత్రాలతో నిరూపించు కుంటూ చనిపోవాల్సి వస్తుంది, చనిపోయిన తర్వాత కూడా పత్రాలు సమర్పించాల్సి వస్తుంది” అని చెప్పింది. ముస్లిం కుటుం బాల్లో మాత్రం కోపం కంటే, తమ పేర్లు మళ్లీ జాబితాలో చేరి ప్రభుత్వం తమను చట్టబద్ధమైన పౌరులుగా గుర్తించాలన్న ఆందోళన ఎక్కువగా కనిపించిందని అయ్యర్ పేర్కొన్నారు.సహీదా ఫకీర్ ఉదంతం ఈ భయాన్ని మరింత స్పష్టం చేస్తుంది. ఆమె కుటుంబం జనన ధ్రువపత్రం, స్కూల్ సర్టిఫికెట్, భూమి పత్రాలు, ఇతర గుర్తింపు పత్రాలు అంద జేసినప్పటికీ, ఆమెను బంగ్లాదేశ్‌కు పంపించారు.ఈ ఉదం తం పత్రాలు ఉన్నప్పటికీ అధికారిక ప్రక్రియలో ఒక వ్యక్తి ఎదుర్కొనే అనిశ్చితిని కూడా ప్రశ్నార్థకంగా మారుస్తుంది.నిరూపణ భారమంతా ఎవరి మీద?అందరి దగ్గరా కోరిన పత్రాలు ఉండవు. పేదరికం, వలసలు, నివాస మార్పు, వివాహం, ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలు పత్రాలు సమకూర్చుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ఈ భారమంతా ముఖ్యంగా పేదలు, వలస కార్మి కులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వృద్ధులు, వికలాంగులు వంటి వర్గాలపై ఎక్కువగా పడే ప్రమాదం ఉంది.ఒకప్పుడు రేషన్ కార్డు వంటి పత్రాలు సాధారణ గుర్తింపునకు సరిపోయేవి. ఇప్పుడు పాస్‌పోర్టును కూడా కేవలం “ప్రయాణ పత్రం”గా పరిగణించే స్థాయికి చేరుకున్నాం.అస్సాం అనుభవం2026 జూలై 13న సుప్రీంకోర్టు అస్సాంలోని ఫారినర్స్ ట్రిబ్యునల్ తీసుకున్న అనేక నిర్ణయాలను విధానపరమైన లోపాల కారణంగా రద్దు చేసింది. పౌరసత్వానికి సంబంధించిన విచారణలు యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకూడదని కోర్టు స్పష్టం చేసింది. అస్సాం ఎన్‌ఆర్‌‌సి అనుభవం దీనికి ముఖ్యమైన హెచ్చరిక. పౌరులను గుర్తించే పరిపాలనా ప్రక్రియగా ప్రారంభ మైన ఎన్‌ఆర్‌‌సి, భారీ పత్రాల ధృవీకరణ ప్రక్రియగా మారి 19 లక్షలకు పైగా మందిని తుది జాబితా నుంచి వెలుపల ఉంచింది. ఈ అనుభవం పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియలో న్యాయం, పారదర్శకత, అప్పీల్ అవకాశాలు ఎంత ముఖ్యమో చూపిస్తుంది.అప్పీల్ హక్కు – ఒక భ్రమ?ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వారికి అప్పీల్ హక్కు ఉందని చెబుతున్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లో అప్పీలేట్ ట్రిబ్యునళ్ల ముందు ఇప్పటికే లక్షల కేసులు పేరుకుపోయాయి.

వాటిని పరిష్కరించడానికి దశాబ్దాలు పట్టే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. రోజువారీ కూలీ, వలస కార్మికుడు, వృద్ధ ఆదివాసీ, వికలాంగుడు లేదా పేద కుటుంబం- వీరు ఆర్థికంగా బలమైన వ్యక్తితో సమానంగా ఈ ప్రక్రియను ఎదుర్కోగలరా అన్నది కీలకమైన ప్రశ్న. అప్పీల్ హక్కు కాగితంపై ఉన్నంత మాత్రాన సరిపోదు. దాన్ని ఉపయోగించుకునే సమయం, డబ్బు, న్యాయ సహాయం ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉండాలి.రాజకీయ నేపథ్యంసర్‌ ప్రక్రియ అమలవుతున్న రాజకీయ నేపథ్యాన్ని, వాతావరణాన్ని దాని నుంచి వేరు చేసి చూడలేం. ఇప్పటికే ముస్లింలు, ఇతర అణగారిన వర్గాలను నిరంతరం అనుమానా స్పదంగా చిత్రీకరిస్తున్న రాజకీయ ప్రచారాలు నడుస్తున్న వేళ, ఇటువంటి పరిపాలనా చర్యలు తీవ్రమైన అసమాన ఫలితాలకు, వివక్షకు దారితీస్తాయి. పత్రాలు, ఆధారాల కోసం పదేపదే ఒత్తిడి తేవడం, కొన్ని నిర్దిష్ట వర్గాలకు ఈ దేశంలో ఉండే హక్కు ఉందో లేదో అని ప్రశ్నించే రాజకీయ ప్రచారాలు చేయడం, మరియు కఠినమైన పరిపాలనా ప్రక్రియల ద్వారా పౌరసత్వ నియమాలను పునర్నిర్వచించే ప్రయత్నాలు చేయడం -ఇవన్నీ కేవలం సాధారణ పరిపాలనా మార్పులు కావు.

ఇవన్నీ భారత గణతంత్ర లౌకిక స్వరూపాన్ని మార్చి, దాని మెజారిటీ ఆధిపత్య దిశగా పునర్నిర్మించే ఒక విస్తృత రాజకీయ ప్రాజెక్ట్‌లో భాగమే. అంబేద్కర్ హెచ్చరిక1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో అంబేద్కర్‌ ఒక కీలక హెచ్చరిక చేశారు. రాజ్యాంగం రూపాన్ని మార్చకుండానే పరిపాలనా విధానాన్ని మార్చడం ద్వారా రాజ్యాంగాన్ని వక్రీకరించి, దాని స్ఫూర్తికి విరుద్ధంగా మార్చవచ్చని ఆయన చెప్పారు. రాజ్యాంగం పుస్తకంలో అలాగే ఉన్నప్పటికీ, పరిపాలనా విధానాల ద్వారా దాని స్ఫూర్తిని బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఇదంతా న్యూరెంబర్గ్ తరహా ప్రత్యేక చట్టం తీసుకురాకుండానే జరుగుతోంది. ప్రజల సార్వభౌమాధికారం, సమాన పౌరసత్వం, ఓటు హక్కు, రాజ్యాంగ సమానత్వం – ఇవే భారత గణతంత్రానికి పునాదులు. సర్‌ వంటి ఎన్నికల జాబితా సవరణలు నిజమైన పౌరులను ప్రజాస్వామ్య హక్కుల నుంచి దూరం చేయకుండా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా అమలు కావా‌లి.(స్వేచ్ఛానుసరణ)

మురళీధరన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -