మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్
నివాసాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
నవతెలంగాణ – గండిపేట్ /జూబ్లీహిల్స్
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదారబాద్ సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసానిని పోలీసు లు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేట్‌లోని హరీశ్‌రావు నివాసం వద్ద నార్సింగి ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దారుణమన్నారు. కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి నార్సింగ్ పోలీసులు వెళ్లి, వారిని బయటికి వెళ్లకుండా ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకుని అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా ఎలాంటి అనుమతి లేదని చెప్పడం సరికాదన్నారు. ఆస్పత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతా యనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ప్రజా సమస్యలపై నిరంతరం బీఆర్ఎస్ తరపున పోరాటం చేస్తామన్నారు.
ఎమ్మెల్యే తలసాని హౌజ్ అరెస్ట్
సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకవైపు ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు అక్రమ నిర్బంధాలు, తప్పుడు కేసులతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు ఆస్పత్రిని సందర్శించకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆస్పత్రి సందర్శనకు వెళ్తామంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని నిలదీశారు. అక్రమ నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలకు త్వరలోనే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.



