గంధమల్ల రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలి
భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
నవతెలంగాణ-తుర్కపల్లి
గంధమల్ల రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం, భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం బాధాకరమ ని, వెంటనే పనులు చేపట్టాలని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ని గంధమల్ల రిజర్వాయర్ ప్రాంతాన్ని సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని విమర్శించారు. హడావుడి ప్రకటనలు చేయడం తప్ప ప్రాజెక్టు పనులను ఆచరణలోకి తీసుకురావడం లేదన్నారు. ఆలేరు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే కీలకమైన గంధమల్ల రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, నిధులు విడుదల చేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా భూ నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించి, వారి సమస్యలను పరిష్కరించిన అనంతరం రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని కోరారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర, ఆగస్టు 31న ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్వాసితులు, పేదలు, రైతాంగం రాజకీయాలకతీతంగా పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్, జిల్లా నాయకులు బుర్రు అనిల్, కొక్కొండ లింగయ్య, తలారి మాతయ్య, గడ్డమీది నరసింహ, తూటి వెంకటేశం, ఆవుల కలమ్మ పాల్గొన్నారు.



