Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనటరాజ రామకృష్ణ విగ్రహ ప్ర‌తిష్టకు స్థలాన్ని పరిశీలిస్తాం

నటరాజ రామకృష్ణ విగ్రహ ప్ర‌తిష్టకు స్థలాన్ని పరిశీలిస్తాం

- Advertisement -

సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కళాకృష్ణకు రూ.5లక్షల ప్రోత్సాహం ప్రకటన
రవీంద్రభారతిలో నటరాజ రామకృష్ణ జాతీయ నృత్యోత్సవం
నవతెలంగాణ–కల్చరల్

ప్రముఖ నాట్య గురువు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ విగ్రహాన్ని సముచిత ప్రదేశంలో ప్రతిష్టించేందుకు స్థలాన్ని పరిశీలిస్తామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆంధ్రనాట్య కళారూపాన్ని కొనసాగిస్తూ విశేష సేవలందిస్తున్న కళాకృష్ణకు భాషా సాంస్కృతిక శాఖ తరఫున రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. భాషా సాంస్కృతిక శాఖ, ఎస్‌ఎంఎస్‌ గ్రూప్‌ చైర్మెన్‌ జూపల్లి మంజులారావు సహకారంతో లోక ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ‌హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన వేదికపై నటరాజ రామకృష్ణ జాతీయ నృత్యోత్సవాన్ని ‌బుధవారం నిర్వహించారు. డాక్టర్‌ కళాకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
కాకతీయ వీరుల పౌరుషాన్ని చాటిచెప్పే పేరిణి నృత్యంపై విశేష పరిశోధన చేసి నటరాజ రామకృష్ణ ఆ కళారూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. భాష, సంస్కృతికి సేవ చేసిన మహనీయులను ప్రభుత్వం ఎన్నటికీ మరువదన్నారు. అంతకుముందు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, ఫార్మాసిటికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రాజు భాను, తెలంగాణ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ శంకర్‌ పండీ, వంశీరామ్‌ బిల్డర్స్‌ సీఎండీ బద్వేలు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ జక్కుల త్రిశూల్‌రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

​సుజాత మహోపాత్రకు జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి గురు సుజాత మహోపాత్రకు నటరాజ రామకృష్ణ జీవిత సాఫల్య పురస్కారం–2026ను ప్రదానం చేశారు. అలాగే సంప్రదాయం కల్చరల్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ స్వాతి సోమనాథ్‌ (ఆంధ్రప్రదేశ్‌), డాక్టర్‌ పేరిణి కుమార్‌ (తెలంగాణ), కథక్‌ కళాకారుడు సంజయ్‌ జోషి (తెలంగాణ), కూచిపూడి కళాకారిణి జ్వాలాముఖి పిన్న (తెలంగాణ), ఆంధ్రనాట్య కళాకారిణి గీత హజారే (మలేషియా), సంజయ్‌ వడపల్లి (హాంకాంగ్‌), హరిత కనగల (తెలంగాణ), ఒడిస్సీ కళాకారిణి దేబాశ్రీ పట్నాయక్‌ (తెలంగాణ), పేరిణి సతీష్‌ (తెలంగాణ)కు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ జాతీయ అవార్డులు–2026 అందజేశారు.

​భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య కళలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతీయ మూలాలను, సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కళాకృష్ణ ఆంధ్రనాట్య ప్రదర్శన, కేరళకు చెందిన చిత్ర సుకుమారన్‌ మోహినీయాట్టం ప్రదర్శన, సిరాజుద్దీన్‌ పేరిణి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జూపల్లి మంజుల, ఫెస్టివల్‌ చైర్మెన్‌ బీఆర్‌ విక్రమ్‌ కుమార్‌, లోక ఆర్ట్స్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సీడీఎఫ్‌ఓ జాతీయ కార్యదర్శి సాయి వెంకటేష్‌, ఒడిశా సభ్యుడు జగపతి జన, డాక్టర్‌ సజిని వల్లభనేని, పలువురు నాట్యగురువులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -