Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకరెంట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

కరెంట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

విద్యుత్‌ ‌సౌధ ముట్టడిలో టీజీపీఈజేఏసీ నేతలు
కార్మిక సంఘాలతో యాజమాన్యాలు చర్చలు జరపాలని డిమాండ్‌
స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న తమ 14 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు బుధవారం హైదరాబాద్‌‌లో కదం తొక్కారు. సోమాజిగూడలో గల విద్యుత్‌ ‌సౌధ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (టీజీపీఈజేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పీఆర్‌‌సీ-2026 అమలు చేయాలనీ, యాదాద్రి ప్లాంట్ ఔట్ సోర్సింగ్ నిలిపివేయాలనీ, ఆర్టిజన్ల విద్యార్హతకు అనుగుణంగా రెగ్యూలర్‌ చేయాలని ఫ్లకార్డులు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్‌ ‌సౌధ పరిసరాలు ఉద్యోగుల నినాదాలతో మార్మోగాయి. ప్రధాన కార్యాలయం గేట్‌ వరకు భారీ సంఖ్యలో నిరసన కారులు చేరడంతో రహదారిపైకి రాకుండా పోలీసులు బారికెడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీసీ-2026 చర్చల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలనీ, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో కోల్‌, యాష్‌ ‌ప్లాంట్ల ప్రయివేటీకరణను ఉపసంహరించాలనీ, ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ అమలు చేయాలనీ, 1999–2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్‌, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యుత్‌ ‌శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలనీ, మహారాష్ట్ర మోడల్ తరహాలో రైతు అనుకూలమైన “రైతు డిస్కం” విధానాన్ని పరిశీలించి అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా పారదర్శకమైన జనరల్‌ ‌ట్రాన్స్‌‌ఫర్‌ ‌పాలసీని రూపొందించి అమలు చేయాలనీ, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన కొత్త జనరేషన్‌ ‌కెపాసిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జెన్కో, ట్రాన్స్‌‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ ‌సంస్థల యాజమాన్యాలు టీజీపీఈజేఏసీతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యుత్‌ ‌సంస్థల యాజమాన్యాలు స్పందించకుంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్‌ ‌సాయిబాబు, నాయకులు నలువాల స్వామి, రత్నాకర్ రావు, శ్రీధర్, బీసీ.రెడ్డి, వజీర్, మహేష్, నీలం ఐలేష్, తాజుద్దీన్ బాబా, కరుణాకర్ రెడ్డి, రాంజీ, రాధాకృష్ణ, నెహ్రూ, మేడి రమేష్, కెవి.రామారావు, సత్యనారాయణ రావు, మోసెస్, జెఎల్.జనప్రియ, భూపాల్ రెడ్డి, ఈశ్వర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ కుమార్, విద్యాసాగర్, వెంకటేష్, యుగంధర్, అశోక్ కుమార్, తిరుపతి, రాజేంద్రప్రసాద్, అనిల్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -