తెల్లకాగితాలపై క్రయవిక్రయాల క్రమబద్ధీకరణ
కొనుగోలుదారుడి అఫిడవిట్ ఉంటే రేషనలైజేషన్
ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా లక్షకు పైగా దరఖాస్తుల పెండింగ్
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది లక్షల దరఖాస్తుదారులు
భూధార్‌తో చట్టబద్ధత కల్పించే దిశగా చర్యలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో సాదాబైనామా (తెల్ల కాగితంపై భూమి కొనుగోలు) దరఖాస్తులను క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. జీవో నెం.76 ప్రకారం కొనుగోలుదారుడి అఫిడవిట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుని సుమారు 9 లక్షల మందికి పైగా రైతులకు భూహక్కులు కల్పిస్తారు. సాదాబైనామా కింద గతంలో మొత్తం 9,00,880 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 9,00,566 మంది దరఖాస్తుదారులకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తహసీల్దారు స్థాయి నుంచి ఆర్డీవో లాగిన్‌కు 6,65,249 దరఖాస్తులు వెళ్లాయి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసి, భూధార్‌తో చట్టబద్ధత కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశం. సాదాబైనామా క్రమబద్ధీ కరణకు సంబంధించిన నిబంధనలు సడలిం చారు. గతంలో అమ్మకందారు, కొనుగోలుదారు ఇద్దరి అఫిడవిట్లు అవసరం ఉండేవి. ఇప్పుడు కొనుగోలుదారుడి అఫిడవిట్ మాత్రమే చాలు. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన అంతా ఆర్డీఓల నేతృత్వాన జరుగుతుంది. 2014 జూన్ 2కన్నా ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి, 12ఏండ్లపాటు అనుభవంలో ఉన్నట్టు చూపాలి. సన్న, చిన్నకారు రైతులై ఉండి 2020 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది నవంబర్ 10వ తేదీ మధ్య అందిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు. వాటిని ఆర్డీఓ నేతృత్వాన పరిశీలించి అర్హత కలిగిన రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయి విచారణ తర్వాత అర్హులైన వారికి పట్టాలు జారీ చేస్తారు.
పత్రాలు తప్పుగా తేలితే కఠిన చర్యలు
దరఖాస్తుదారుడు సమర్పించే సమాచారం లేదా పత్రాలు తప్పుగా ఉన్నట్టు తేలితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుంది. అలాంటి సందర్భాల్లో సదరు సాదాబై నామా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతోపాటు చెల్లించిన ఫీజులు, స్టాంపు డ్యూటీని జప్తు చేస్తారు. తప్పుడు పత్రాలు సమర్పించిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెడతారు. మరోవైపు, దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ కోసం గడువు ఇస్తారు. ఈ 30 రోజుల్లో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, ఆ భూమికి సంబంధించిన హక్కుల నమోదు ప్రక్రియను నిలిపివేస్తారు.
కొనుగోలుదారుడి అఫిడవిట్ చాలు..!
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి ఆర్వోఆర్ చట్టాన్ని తెచ్చింది. ఇందులో సాదాబైనామా దరఖాస్తుల కోసం సెక్షన్ 6, నిబంధన 6లో పొందుపరిచింది. దీని ప్రకారం.. ఆర్డీఓలు క్షేత్ర స్థాయిలో విచారించి భూమి చుట్టుపక్కల రైతులతోనూ మాట్లాడి రాతపూర్వక ఆధారాలు పరిశీలిం చాలి. పీఓటీ, సీలింగ్, ఎన్టీఆర్ చట్టాల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించాలి. కొనుగో లుదారుడు, అమ్మకందారుడి అఫిడవిట్లు ఇవ్వాలన్న నిబంధనతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ కారణంగా భూభారతి చట్టంలోనూ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. దీనిని మార్చి ఒకరు ఇస్తే చాలు అనే నిబంధన తీసుకొ చ్చారు. భూముల క్రమబద్ధీకరణ కోసం 2014 జూన్ 2కు పూర్వం తెల్లకాగితాలపై రాసుకున్న వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వాలు మారినా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో భూమి అమ్మకం, రుణానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం మార్చి 18న జీఓ 76 విడుదల చేసింది. ఈ జీఓ ద్వారా కొనుగోలుదారుడు మాత్రమే ఆఫిడవిట్ ఇస్తే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరిస్తారు.
ఐదేండ్ల నుంచి ఎదురుచూపు
సాదా బైనమా దరఖాస్తుదారులు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఏండ్ల కిందట భూ క్రయవిక్రయాలు సందర్భంగా తెల్లకాగి తాలపైనే రాతపోతలు సాగేవి. భూములపై చట్టబద్ధత, హక్కుల్లో ఇబ్బంది ఎదురవుతుం డటంతో క్రమబద్ధీకరించాలని 2016 ఏడాదిలో నాటి ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ తర్వాత 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం 112 జీఓ ద్వారా మరోసారి మీ సేవ కేంద్రాల్లో ఫారం 10 ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఆ ఏడాది అక్టోబర్ 31తో గడువు ముగిసినా ఆ తర్వాత నవంబర్ 10 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిం చారు. అప్పుడు ఖమ్మం జిల్లాలోనే మొత్తం 1,11,443 దరఖాస్తులు వచ్చాయి. కానీ ధరణి చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు నిబంధనలు పొందుపర్చకపోవడం, హైకోర్టు స్టే విధించడంతో దరఖాస్తులన్నింటినీ పక్కన పెట్టారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 1,11,443 దరఖాస్తులకు మోక్షం లభించనుంది.



