Saturday, August 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రముఖ నటి షావుకారు జానకి ఇకలేరు

ప్రముఖ నటి షావుకారు జానకి ఇకలేరు

- Advertisement -

సహజ నటనకు నిలువెత్తు రూపం
400 సినిమాల్లో భిన్న పాత్రలు
నలుగురు సీఎంలతో నటించిన ఘనత
శ్రీదేవిని పరిచయం చేసిన నటి

సినీ రంగంలో సహజ నటనకు చిరునామా షావుకారు జానకి వెండితెరపై హీరోయిన్‌గా మొదలై.. ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. భావోద్వేగాలను కళ్లతోనే పలికిస్తూ.. తరాలు మారినా తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న జానకి (94)ఇక లేరు.
చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు.
ఆమె గత కొంత కాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించ టంతో ఆమె కన్నుమూశారు.
షావుకారు జానకి.. నటి కృష్ణకుమారికి సోదరి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్‌ 12న జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల్లో పలు పాత్రలు పోషిస్తూ కెరీర్ ప్రారంభించారు. 11 ఏళ్లకు రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జానకికి 15 ఏళ్ల వయసులోనే సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిల్లో ‘గుణసుందరి కథ’ ఒకటి. దర్శకుడు కె.వి.రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తావా అని అడిగితే, తండ్రి భయంతో ససేమిరా చేయనని చెప్పింది. ఆ తర్వాత రేడియో ఇంజినీరుగా పనిచేస్తున్న శంకరమంచి శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అక్కడే ఆమె జీవితంలో రెండో అధ్యాయం మొదలైంది. ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయం వల్ల వీరికి చిల్లిగవ్వ రాలేదు. దీంతో పట్టెడన్నం కోసం పాట్లు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. తనకు తెలిసిన విద్య నటన మాత్రమే. అందుకే, భర్త అనుమతితో సినిమాల్లోకి వచ్చారు.
1949లో ‘రక్షా రేఖ’ సినిమాతో చలనచిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. 1950లో ‘షావుకారు’ సినిమాలో సుబ్బులు రోల్‌లో మహా నటుడు ఎన్టీఆర్ సరసన నటించారు. తొలి చిత్రం ‘షావుకారు’ జానకీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. తర్వాత ఈ మూవీ పేరు ఆమె ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. ఎన్టీఆర్‌కు ఆమెనే తొలి హీరోయిన్.
‘షావుకారు’ సినిమా గురించి తెలుగు స్వతంత్ర పత్రికలో ఖాసా సుబ్బారావు ‘కుటుంబ స్త్రీల సినీ రంగ ప్రవేశం’ అని రాయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె తెలిపారు.
ఎన్టీఆర్‌తో పాటు కోలీవుడ్ దిగ్గజ నటులు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధితోనూ జానకి కలసి నటించారు. అలా నలుగురు సీఎంలతో నటించిన ఖ్యాతిని గడించారామె.
తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు చేశారు జానకి. తెలుగులో ‘వ‌ద్దంటే డ‌బ్బు’, ‘క‌న్యా శుల్కం’, ‘పిచ్చి పుల్లయ్య’ , ‘రేచుక్క-ప‌గ‌టిచుక్క, ‘రోజులు మారాయి’, ‘సొంత‌వూరు’, ‘జ‌యం మ‌న‌దే’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సంసారం ఒక చ‌ద‌రంగం’, ‘తోడి కోడ‌ళ్ళు’, ‘బాబు బంగారం’, ‘గీతాం జలి’ వంటి అనేక హిట్ చిత్రాలలో నటించారు. చివరి సారి ‘అన్నీ మంచి శకునములే’లో కనిపించారు.
తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో, 3 హిందీ, ఒక మలయాళ చిత్రంలో నటించి మెప్పించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

జానకి చెల్లెలు కృష్ణకుమారి కూడా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా హవా నడిపించారు.
దివంగత నటి శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానకినే. ‘అప్పటికి తను ఆరేళ్ల పిల్ల. వాహిని స్టూడియోస్‌ వాళ్లు ఒక పెద్ద సినిమా తీస్తున్నారు. అప్పుడే రాజేశ్వరి(శ్రీదేవి అమ్మ) పాపను పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘బాల మురుగన్‌ పాత్రకు చిన్న పిల్లాడు కావాలి. అందంగా ఉండాలి. బ్రిలియంట్‌గా ఉండాలి’ అని చెబుతున్నారు. నేను శ్రీదేవిని తీసుకుందామని చెప్పా. ఆడిషన్‌లో శ్రీదేవి అద్భుతంగా నటించి, మురుగన్‌ పాత్రకు ఎంపికైంది’ అని జానకి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మహానటి సావిత్రి కెరీర్ లో గొప్ప పేరు తెచ్చిపెట్టిన పాత్ర ‘దేవదాసు’లోని సావిత్రి. నిజానికి ఆ పాత్రకు తొలుత జానకిని అనుకున్నారు. అలానే ‘గుండమ్మ కథ’లో మేరీ పాత్ర కూడా జానకికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్రకూ మొదట భాను మతిని అనుకున్నారు. కానీ ఈ రెండు పాత్రలు సావిత్రి పోషించి, చిత్రసీమలో తనకంటూ ఓ గొప్ప ముద్రను వేసేలా చేశాయి.
భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న గొప్ప నటి షావుకారు జానకిను గుర్తుచేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

కొన్ని దశాబ్దాల పాటు మేం ఎన్నో సినిమాల్లో కలిసి చేశాం. నాకు తల్లిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆనాటి హీరోలందరితోనూ నటించిన ఘనత జానకిది. ఆ మాతృమూర్తి ఇకలేరు. ఆమె రూపం కనుమరుగైంది. – కమల్‌ హాసన్‌

‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన గొప్ప నటి ఆమె. – చిరంజీవి

జానకికి, మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నహీరోగా నటించిన ‘షావుకారు’తోనే ఆమెకు ‘షావుకారు జానకి’ అనే పేరు వచ్చింది. నాన్నతో ఆమె అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘పాండురంగ మహాత్మ్యం’ నుంచి యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో ఆమె ఫొటో పెట్టాం. మన దేశంలోనే సుదీర్ఘ నట ప్రస్థానం కలిగిన ఆర్టిస్టు షావుకారు జానకి ఒక్కరే. – బాలకృష్ణ

సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి జానకి. 400 సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. – పవన్‌ కల్యాణ్‌
‘షావుకారు జానకి భారతీయ సినీ రంగంలో తనదైన ముద్రవేశారు జానకి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. – ఎన్టీఆర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -