కూతురు వ్యాఖ్యలతో సురేఖ రాజీనామాకు ఎమ్మెల్యేల డిమాండ్
గుర్తింపు కోసమే సుష్మిత తాపత్రయమా?
నల్లగొండలో మంత్రి పదవి కోసం రాజగోపాల్‌రెడ్డి పట్టు..
ఉమ్మడి ఆదిలాబాద్‌లో బాహాబాహీ..
పీసీసీ పట్టించుకోవడం లేదని కార్యకర్తల ఆవేదన ..
నవతెలంగాణ- ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధులు
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఎన్నా వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, నాయకులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఒకవైపు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం నడుస్తుండగానే మరోవైపు కొండా సురేఖ్ కూతురు సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ఆజ్యం పోశాయి. మంత్రి పదవి కోసం రాజగోపాల్‌రెడ్డి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. సుష్మిత కాంగ్రెస్‌పార్టీలో సీనియర్ నేత కాకపోయినా వరంగల్ జిల్లా రాజకీయాల్లో గుర్తింపు కోసమే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చాలాచోట్ల గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు, ఎమ్మెల్యేలు, మంత్రులు, డిసిసి అధ్యక్షులు, సీనియర్ నేతలు, కొత్త, పాత నేతల మధ్య సమన్వయలోపం ఆ పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేస్తోంది. మంత్రి పదవుల విషయంలో ఎమ్మెల్యేలు, కొంతమంది నేతలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు తమకే కేటాయించాలని ఒత్తిడులు చేయడం, తమకు గుర్తింపు ఇవ్వడం లేదని మరికొందరు ఇలా అసంతృప్తులు రాజేస్తున్నారు. అయితే తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, ఇలాంటివి వచ్చి పోతుంటాయని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ఆపార్టీ నేతలు అంటున్నారు. అందుకే కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం లైట్‌గా తీసుకుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవి టీ కప్పులో తుఫాన్ లాంటివి పలువురు నేతలు అంటున్నారు. లైట్‌గా తీసుకుంటే దీని ప్రభావం భవిష్యత్తులో కాంగ్రెస్‌పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడడానికి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
వరంగల్‌లో మంట లేపిన సుష్మిత వ్యాఖ్యలు ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంతో మొదలైన వివాదం, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన సంచలన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేపింది. తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని, కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని కొండా సుష్మిత చెప్పి మరింత వేడెక్కించారు. ఈ విషయాన్ని టీపీసీసీతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. సుష్మిత వ్యాఖ్యలు తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చినప్పటికీ, ఎమ్మెల్యేలు వాటిని తిరస్కరిస్తున్నారు. సంబంధం లేనప్పుడు ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తూ, 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ వేదికగా అత్యవసరంగా సమావేశం అయ్యారు. కొండా సురేఖ కుంటుంబం మొత్తాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వరంగల్ జిల్లా నేతలు డిమాండ్ చేస్తూ టీపీసీసీకి తీర్మానం పంపినట్లు సమాచారం. చర్య తీసుకునేవరకు కాంగ్రెస్ అధిష్టానం వెళ్లే అవకాశం ఉండదని అంటున్నారు. సుష్మిత వ్యాఖ్యలు పార్టీలో టీ కప్పులో తుఫాన్ లాంటివని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. అదే సందర్భంలో కొండా సురేఖతో ఉమ్మడి వరంగల్ నేతలకు పొసగడం లేదు.
నల్లగొండలో రాజగోపాల్‌రెడ్డి
వ్యాఖ్యలు దుమారం..
నల్లగొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్.కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరంటే ఒకరికి గిట్టని స్థితి. మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎంను బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆయనపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామేల్ ఘూటు వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య విభేదాలతో మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు నలిగిపోతున్నారు.
ఖమ్మం ‘హస్తం లో సెగలు రేపుతున్న వేరు కుంపట్లు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు నానాటికీ ముదిరి పాకాన పడింది. అధికారంలోకి వచ్చామన్న సంతోషం కంటే, స్వపక్షంలోనే ఎవరికి వారే వేరు కుంపట్లు పెట్టుకోవడంతో పాత, కొత్త నాయకుల నడుమ తీవ్రస్థాయి ఖాళీ ఏర్పడింది. జిల్లాను ఏలుతున్న ముగ్గురు కీలక మంత్రుల మధ్య అస్సలు సఖ్యత లేకపోవడం, ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా రాజకీయాలు నడుస్తుండటంతో స్థానిక కాంగ్రెస్ గ్రూపులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఇటీవల భర్తీ చేసిన కీలక పదవులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సొంత వర్గీయులకే కట్టబెట్టేశారన్న ఆగ్రహం మిగతా ఇద్దరు మంత్రులతో పాటు పాతతరం సీనియర్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి రాజేసింది. భట్టి ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా రేణుకా చౌదరి గ్రూప్ నాయకులు ఏకంగా హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట ధర్నాకు దిగడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. అధిష్టానం బుజ్జగింపులను సైతం పట్టించుకోకుండా ఇరువురు నేతలు తమ సొంత వేరు కుంపట్లను కొనసాగిస్తుండటంతో ఖమ్మం కాంగ్రెస్‌లో రానున్న రోజుల్లో ఈ కుమ్ములాటలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు భవిష్యత్ ఎన్నికలలో తమ వారసులను రాజకీయాల్లోకి దించేందుకు ముగ్గురు కీలక నేతలు తెర వెనుక తీవ్రంగా పావులు కదుపుతున్నారు.
ఆదిలాబాద్‌లో ఇన్‌చార్జీ మంత్రి ఎదుటే బాహాబాహి..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. పార్టీ నాయకుల మధ్య ఉన్న విబేధాలు ఇన్‌చార్జి మంత్రి, ఏఐసిసి నాయకుల ఎదుట బహిర్గతం అవుతున్నాయి. ఇరువురిని సమన్వయ పరిచేందుకు వచ్చిన పెద్దల ఎదుటే బాహాబాహి దిగుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే, సీఁయర్ నాయకుడు ప్రేంసాగర్ రావు, మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య అంతర్గత విబేధాలు డిప్యూటీ సీఎం భట్టి ఎదుట పరోక్షంగా బహిర్గతం అయ్యాయి. ప్రేంసాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం లేదని ప్రచారం సాగటంతో ఆయన పార్టీలు మారినవారికి ఎలా మంత్రి పదవి ఇస్తారని బహిరంగంగా విమర్శించటంతో దుమారం లేపింది. ఇటీవల ప్రేంసాగర్ రావు ప్రధాన అనుచరుడు జగన్మోహన్ రావు వేరే కుంపటి పెట్టడంతో జిల్లా పార్టీలో గ్రూపు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆదిలాబాద్‌జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పార్లమెంటు వ్యవహారాల కమిటీ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసిసి కార్యదర్శి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ సచిన్ సావంత్ సమక్షంలో నేతలు పరుషపదజాలంతో దూషించుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లేముందు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అదే జిల్లాలో ఇప్పటికీ మిగతా నేతల మధ్య విభేదాలు కొనసాగుతుండటం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో అనిరుద్‌రెడ్డి ప్రభుత్వంపైనే ఎక్కుపెట్టి విమర్శలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్ బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేశారు. వారంతా సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారు. మంత్రుల మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా వాటిని ఎవరూ ఖండించలేదు. సుష్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌లోని చాలామంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. సుష్మితపైనా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి వాటివల్ల పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



