నవతెలంగాణ మియాపూర్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసును రాయదుర్గం పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌చార్జి డీసీపీ శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు. కాయగూడాలో ఒక వ్యక్తి కిడ్నాప్ అయినట్టు డైలీ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వారు బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేసినట్టు అనుమానించారు. దాంతో పోలీసులు నిఖితను విచారించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆరు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కిడ్నాపర్లు సురేందర్ భార్యకు ఫోన్ చేసి రూ. రెండు కోట్లు డిమాండ్ చేశారు. పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి కిడ్నాప్ అయిన సురేందర్‌తో తానే వారితో వెళుతున్నట్టు చెప్పించారు. ఆమనగల్ వెళ్లే సమయంలో వారి కార్ బ్రేక్‌డౌన్ కావడంతో నిఖిత ఇంకో కారు ఏర్పాటు చేసింది. సురేందర్‌ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సమయంలో కర్తాల్ వద్ద ఫారెస్ట్ అధికారులు కారును ఆపారు. ఫారెస్ట్ అధికారులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. పోలీసులు సురేందర్‌ను సేవ్ చేశారు. ఈ కిడ్నాప్‌లో సురేందర్ బంధువు నిఖితతోపాటు వెంకటకృష్ణ, సురేష్ కీలకంగా వ్యవహరించినట్టు డీసీపీ తెలిపారు. నిఖితకు సురేందర్ చుట్టం కావడంతో వారి ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండటం వల్ల కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తులపై గతంలో కూడా కేసులు ఉన్నాయి. నిందితులపై చట్టం ప్రకారం పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.