Saturday, August 22, 2026
E-PAPER
Homeకరీంనగర్నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలి               ...

నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలి                                                   

- Advertisement -

న్యాయం చేయకపోతే ఉద్యమం ఉధృతమే
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
నవతెలంగాణ – గంగాధర
గంగాధర మండలం నారాయణపూర్ ను ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించి భూనిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు కింద ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు గంగాధర మండలం మధురానగర్  చౌరస్తాపై శనివారం చేపట్టిన రాస్తారోకో, ధర్నాకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి  సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ..నారాయణపూర్ గ్రామస్తుల ముంపు సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి నష్టపరిహారం చెల్లింపుతోపాటు ఆర్అండ్ఆర్ కింద పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.

  • ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీకి కట్టుబడి లేక నిర్లక్ష ధోరణిని అనుసరించడం సరైన విధానం కాదన్నారు. అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో నారాయణపూర్ ప్రజలు రోడ్డెక్కే దుస్థితి వచ్చిందన్నారు. నారాయణపూర్ గ్రామ ముంపు సమస్య కేవలం గ్రామ సమస్యకాదని, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నారాయణపూర్ గ్రామస్తులకు తమ సీపీఐ(ఎం) సంపూర్ణ మద్ధతు ఉంటుందని, సమస్య పరిష్కరించే వరకు పోరాటంలో ముందుంటుందని అన్నారు. ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజలను నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు.
  • ప్రాజెక్టు వల్ల గ్రామంలోని ఇళ్లలో ప్రజలు నివసించే పరిస్థితి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికలలో తనను గెలిపిస్తే రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పి ఇప్పుడు ముఖం చాటేయడం మంచి విధానం కాదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడడం మేడిపల్లి సత్యంకే చెల్లిందన్నారు. నారాయణపూర్ గ్రామస్తులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి స్పష్టమైన హామీనిచ్చి, విరమింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ ముంపు ప్రజల సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. నారాయణపూర్ ప్రజలు తమ న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని నీరు కార్చేందుకు రాజకీయ దురుద్దేశంతో ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే వారి పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్షణమే నారాయణపూర్ గ్రామ ప్రజల న్యాయమైన డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సత్వరమే పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో రాజకీయ పార్టీలు జోక్యం జోక్యం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన, పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రజా ఉద్యమాల ముందు ఏ ప్రభుత్వాలు నిలబడలేవని, ఈ ముంపు సమస్య రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా విస్తరించక ముందే ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామస్తులు చేసే న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఇంచార్జీ అంబటి జోజిరెడ్డి, సీపీఐ (ఎం) కమిటీ సభ్యులు జి రాజేశం, నరేష్ పటేల్, నాయకులు శివ, నారాయణపూర్ గ్రామ ప్రజలు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -