అత్యవసర ఔషధాలకూ దిక్కులేదు…ఖాళీ పోస్టుల భర్తీలోనూ నిర్లక్ష్యం
ఇబ్బందుల్లో 20 లక్షల మంది చందాదారులు
కార్మికుల నుంచి క్రమం తప్పకుండా డబ్బు వసూలు
అయినా సౌకర్యాలు నిల్ అప్‌గ్రేడ్ కాని డిస్పెన్సరీలు
నవతెలంగాణ- బ్యూరో హైదరాబాద్
రాష్ట్రంలోని ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా) ఆస్పత్రులకు సుస్తీ చేసింది. రోగులకు సరైన వైద్యం అందని దుస్థితి ఏర్పడింది. వైద్య పరీక్షలకు అవసరమైన కిట్లు లేవని వాటినీ చేయడం లేదు. అవసరమైన మందులూ ఇవ్వట్లేదు. గతిలేక ఈఎస్ఐ చందాదారులు(ఇన్సూరెన్స్ పర్సన్స్-ఐపీలు) ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఈఎస్ఐ కింద సుమారు 20 లక్షల మంది చందాదారులున్నారు. ప్రతినెలా కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ కింద చెల్లిస్తున్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం.. ఏటా ఔషధాలు, ఇతర వైద్య సామగ్రి కొనుగోలు, కొత్త డిస్పెన్సరీలు, ఆస్పత్రుల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలతో వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలి. కానీ డైరెక్టరేట్ స్థాయిలో అది జరగట్లేదు. ఫలితంగా ఈఎస్ఐ ఆస్పత్రులు అస్తవ్యస్తంగా తయారై, వైద్య సేవల్లో చందాదారులకు చుక్కలు చూపిస్తున్నారు.
అత్యవసర మందులకూ అవస్థే…
ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో మందులు, టెస్టింగ్ కిట్లు, సర్జికల్ ఐటెమ్స్ కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో నాచారం,రామచంద్రాపురం, వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రులు, నిజామాబాద్, సిర్పూర్-కాగజ్‌నగర్, జీడిమెట్ల డయాగ్నిస్టిక్ సెంటర్లతో పాటు 71 డిస్పెన్సరీల్లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోజువారిగా వాడే సాధారణ మందులతో పాటు, అత్యవసర మందులు ఏడాది పొడువునా అందుబాటులో ఉండాలి. కానీ.. ప్రస్తుతం కనీస స్థాయి మందులు కూడా వాటిల్లో అందుబాటులో లేని పరిస్థితి ఉంది. దీంతో ఈఎస్ఐపై ఆధారపడే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మందులను ప్రయివేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆర్థికంగా వారిని మరింత కుంగదీస్తున్నది. డెంగ్యూ, మలేరియా తదితర రక్త పరీక్షలకు అవసరమైన ల్యాబ్ కిట్లు, ఎక్స్‌రే ఫిల్ములు లేక రోగులు ప్రయివేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. టెస్టింగ్ కిట్ల కొరత, సకాలంలో పరీక్షలు నిర్వహించక పోవటంతో వైద్య సేవల నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోందని స్వయంగా అక్కడి డాక్టర్లే చెబుతున్నారు.
ఖాళీ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 12వందలకు పైగా వివిధ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్ల పోస్టులు 50శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో వైద్యసేవలు సరిగా అందకపోవడంతో ఈఎస్ఐ ఆస్పత్రులకొచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతోంది. ఇటీవల 599 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్టు మంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే 247 స్టాప్ నర్సులను నియమించారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ సర్జన్లు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని త్వరలో నియమిస్తామన్నారు. కానీ 12వందల ఖాళీల్లో, 600 మందికి 107 జీవో ఇచ్చి, 247 భర్తీ చేసి, మిగిలినవి ‘త్వరలో’ అనడమే విచిత్రంగా ఉందని చందాదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
కార్మికుడి హక్కు..
ఈఎస్ఐ సేవలు పొందటం కార్మికుడి హక్కు. ఆ ఆస్పత్రుల్లో సేవలు పొందటానికి ప్రయివేటు ఉద్యోగులు, సిబ్బంది వేతనంలో నుంచి 0.25శాతం, యజమాని వాటా నుంచి 3.25శాతం ను ప్రతి నెల ఈఎస్ఐ కార్పొరేషన్‌కు చెల్లిస్తారు. ఈ నిధులతోనే దేశవ్యాప్తంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందిస్తున్నారు. అంతే కాకుండా కార్మికులు ప్రమాదాలకు గురైనా, జబ్బుపడినా పరిహారం చెల్లిస్తారు. ఈఎస్ఐసీలో దేశవ్యాప్తంగా 3.80కోట్ల మంది కార్మికులుండగా, రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నారు. వైద్య సేవలు పొందే కార్మిక కుటుంబాలు మరో 75 లక్షల మంది ఉన్నారు.
టెస్టులు, మందులు లేవంటున్నారు
మాకు ఈఎస్ఐ కార్డు ఉంది. ప్రతీనెలా చందా కట్ అవుతోంది. మా అబ్బాయికి హిమోఫిలియా వ్యాధి ఉంది. ఆయనకు నెలకు రెండు సార్లు ‘ఫ్యాక్టర్8’ ఇంజెక్షన్ అవసరం. డిస్పెన్సరీలోగానీ, రామచంద్రాపురం ఆస్పత్రిలోగానీ ఇవి దొరకటం లేదు. నాచారం పోవాలని చెబుతున్నారు. నెలకోసారి నాచారం రావడం సమస్యగా మారింది. మరో పక్క ఆరోగ్యం బాగోలేక పటాన్చెరు డిస్పెన్సరీకి పోతే.. టెస్టులు లేవు, మందులు లేవని చెప్పారు. వైద్యం కోసం ఇబ్బందిపడుతున్నాం. కనీసం ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు.
ఏ అశోక్, శాండ్విక్ కంపెనీ కార్మికుడు
సరైన వైద్యం అందడం లేదు
ఆరోగ్యం బాగోలేక డిస్పెన్సరీకి వస్తే టెస్టులు లేవని బయట చేయించుకోవాలని చెబుతున్నారు. రోగులకు సరిగా చికిత్స అందడం లేదు. వైద్య సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. మా జీతాల్లో ఈఎస్ఐ కట్ అవుతోంది. వైద్యం అందడం లేదు. ప్రయివేటుకు వెళితే ఆర్థికంగా గుల్ల అవుతాం.
వై గంగాధర్‌రావు, శాండ్విక్ కార్మికుడు
ఈఎస్ఐసీ పక్షపాత ధోరణి..
రాష్ట్రం పట్ల ఈఎస్ఐసీ పక్షపాత ధోరణిని అనుసరిస్తున్నది. కార్పొరేషన్ తన 2023-24 వార్షిక నివేదికలో రాష్ర్టానికి రూ.742.38 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా రూ.220 కోట్లకు పైగా అకౌంట్ పేమెంట్ కింద చెల్లించినట్టు తెలిపింది. అయితే..రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈఎస్ఐసీకి ఏటా సుమారు రూ. 1400 కోట్ల వరకు సొమ్ము వెళ్తున్నది. కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తున్న సొమ్ము కనీసం 60 శాతం కూడా ఉండట్లేదని ఆడిట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన నిధులను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుందా…లేక సొమ్ము ఇచ్చేందుకు కేంద్రం కొర్రీలు పెడుతున్నదో అర్థంకావట్లేదని ఈఎస్ఐలోని ఓ వైద్యాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ఆ 60 శాతం నిధుల్ని ఖర్చు చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం కూడా తీవ్ర నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తుంది.
నిధులు కేటాయించకుండా…
నిధులు కేటాయించకుండా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? నిధులు రాబట్టుకునేందుకు ఈఎస్ఐ ఏం చేస్తుంది? దీనికి సరైన సమాధానం లేదు. కార్మికుల నుంచి ప్రతి నెలా ఈఎస్ఐ చందాలు వసూలు చేస్తూ, అదే కార్మికులకు వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శి స్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈఎస్ఐ కార్పొరేషన్ వాటా 87.5శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 12.5శాతంగా ఉం టుంది. అంటే కార్పొరేషన్ వాటా సుమారు రూ.591కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం వాటా సుమారు రూ.84.5కోట్లు. ఇంత భారీ మొత్తంలో నిధులు అందుబాటులో ఉన్నా.. డిస్పెన్సరీల్లో, ఆస్పత్రుల్లో మందుల కొరత ఎందుకుంటుందని చందాదారులు ప్రశ్ని స్తున్నారు. అదే సమయంలో మందులు, మెడికల్ కిట్ల కోసం వాటి సరఫరా దారు లకు కూడా భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయి.
బి అర్జున్, ఈఎస్ఐ బోర్డు మాజీ సభ్యులు



