Sunday, August 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర

రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర

- Advertisement -

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
​నవతెలంగాణ-మలక్‌పేట్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ అన్నారు. సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని అక్బర్‌బాగ్‌లో పార్టీ మలక్‌పేట్‌–యాకుత్‌పురా జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్‌ ‌మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మత ఘర్షణలు సృష్టిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించకుండా తప్పించుకునేలా పెట్టుబడిదారులకు సహకరిస్తోందన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకురావడం వల్ల కార్మికుల హక్కులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.

ఈ విధానాలు పేద, మధ్యతరగతి కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాదీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ప్రతి ఏడాదీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా లక్ష ఉద్యోగాలు కూడా కల్పించలేదని అన్నారు. పేదలకు స్థలాలు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ఇచ్చిన హామీలు కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -