తిరుపతికి చెందిన ఆర్.సి. కృష్ణస్వామి రాజు తెలుగు సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని రచయిత. వీరు ఇప్పటి వరకు పాతిక వరకు పుస్తకాలు రాశారు. అందులో బాల సాహిత్యం, కథలు, కథానికలు, నవలలు ఉన్నాయి. వీరు పుస్తకాలకి పెట్టే పేర్లు చాలా గమ్మత్తుగా, కొత్తగా ఉంటాయి.
‘చింతల చేను’ నవలలో ఆలోచన, ఆవేదన, విజ్ఞానం, సాంకేతిక విషయాలు, సమస్య పరిష్కారమార్గాలు, డబ్బు సంపాదన విషయాల పట్ల లోతైన అవగాహన, నేర్పరితనం, రైతుల కష్టాలు, యువత వినూత్న ఆవిష్కరణలు, వడ్డీ వ్యాపారం, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, కమిషన్ల కేటుగాళ్లు, రియల్ ఎస్టేట్ మోసాలు, చిన్న చిన్న సంతోషాలు, ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు వంటి సున్నితమైన విషయాలను కూడా అద్భుతంగా చిత్రిస్తూ నవలను అత్యంత ఉత్కంఠభరితంగా సాగించారు.
ఒక మధ్యతరగతి వ్యక్తి గుణశేఖరుడు. డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగి. కుటుంబ పోషణ కోసం తిరుపతిలో రాపిడో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. చుట్టుపక్కల వాళ్ళ సలహాతో ధర ఎక్కువ పెట్టి 5 లక్షలకు 3 రూపాయల వడ్డీకి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంటాడు. ఇక జీవితం బాగుపడుతుంది, కష్టాలు తీరుతాయి, బాగా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని ఊహించుకుంటాడు. కానీ ఊహించని మలుపులతో జీవితం తారుమారవుతుంది. ఈ నవలలో రచయిత సృష్టించిన మానసిక సంఘర్షణ కన్నీళ్లు పెట్టిస్తుంది. డబ్బు లేకుంటే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది అన్నది నేటి యువతకు మార్గదర్శకం చేశారు. అనవసరపు అప్పులు వద్దని, ఉన్నదానిలో తృప్తిగా ఉండాలని మనకు మార్గనిర్దేశం చేశారు.
రచయిత చాలా చక్కగా పాత్రలకు జీవం పోశాడు. ఎన్నో రకాల నవీన పోకడలు, అందరికీ ఉపయుక్తమయ్యే అంశాలైన గోఆధార్, ఐవీఎఫ్, ఎలక్ట్రికల్ ట్రాక్టర్, ఇన్సూరెన్సు పట్ల ప్రజలకు అవగాహన లాంటి విషయాలపై విషయ జ్ఞానం పంచారు. నేడు సమాజంలో జరుగుతున్న వడ్డీ వ్యాపారాలు, భూకబ్జాల పట్ల పాఠకులకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ, ఆర్థిక అంశాల పట్ల అందరికీ అవగాహన పెంచారు. బాలాజీ చేసే లాజికల్ అల్లరి, నారాయణమ్మ పెద్దరికం, గుణశేఖరుడు తనకి తాను ప్రశ్నించుకోవడం లాంటి ఎన్నో అంశాలు చదివింపజేస్తాయి.
ఆర్.సి. కృష్ణస్వామి రాజు జనాల నాడి తెలిసిన అక్షర వైద్యులు కాబట్టే చింతల చేను లాంటి మధ్యతరగతి జీవితాలను అక్షరీకరించారు. ఈ నవల ప్రతి ఇంట్లో ఉండాల్సిన నవల. ప్రతి ఒక్కరూ చదవాల్సిన, పాత్రలను అనుభూతి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత చక్కటి నవలను రాసిన రచయిత శుభాకాంక్షలు…
వినాయకం ప్రకాష్, 8142512219
ఆలోచన విహంగాలతో నిండిన బతుకుచిత్రం ‘చింతల చేను’
- Advertisement -
- Advertisement -



