Sunday, August 23, 2026
E-PAPER
Homeజోష్వకీల్‌ సాబ్‌

వకీల్‌ సాబ్‌

- Advertisement -

న్యాయం కోసం కోర్టు గడప తొక్కే ప్రతి ఒక్కరి వెనుక ఒక కథ ఉంటుంది. ముఖ్యంగా పేదలు, బాధితులు తమ సమస్యను చెప్పుకోవడానికి, న్యాయం పొందడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి న్యాయ సహాయం అందిస్తూ, వారి తరఫున గళం వినిపిస్తూ ముందుకు సాగుతున్న మూడుపదుల యువ న్యాయవాది సింగపోగు సుబ్రహ్మణ్యం. తన వృత్తిని కేవలం సంపాదన మార్గంగా కాకుండా సేవా మార్గంగా పేదలు, బాధితులకు అండగా నిలుస్తున్న ఓ యువ న్యాయవాది ప్రస్థానం.. ఈ వారం జోష్‌లో…

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో వ్యవసాయ కూలి కుటుంబం లక్ష్మయ్య, కుమారి దంపతుల మూడో సంతానం సుబ్రహ్మణ్యం. దగ్గరి వాళ్ళు అందరూ ప్రేమగా సుబ్బు అని పిలుచుకుంటారు. ప్రాథమిక విద్యా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి, తరువాత సదాశివపాలెంలోని ప్రభుత్వపాఠశాలలో పదోతరగతి వరకు చదివారు. ఇంటర్‌, డిగ్రీ సత్తుపల్లిలో, ‘లా’ విద్య ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసారు.

1975లో తాత డోలా ముత్తయ్యను పోలీసులు దొంగతనం ఆరోపణతో అరెస్ట్‌ చేశారు. అతడు కొన్ని నెలల తరువాత జైలులోనే హత్యకి గురయ్యాడు. ఆ రోజుల్లో వెనకపడికి తరగతుల పైన పోలీసుల వేధింపులుండేవి. వాటిని ఎలా ఎదుర్కోవాలన్నది తెలియదు. అమ్మమ్మ చెప్తుంటే ఆ సంఘటనలు వింటూ పెరిగాడు సుబ్రహ్మణ్యం. తను ఆరో తరగతి చదువుతుండగా వాళ్ళ ఇంటి స్థలాన్ని ఎవరో కబ్జా చేశారు. కంప్లైంట్‌ ఇవ్వడానికి వెళితే పోలీసులు కనీసం కంప్లైంట్‌ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ఆ రెండు చేదు అనుభవాలు సుబ్రహ్మణ్యం మనసులో అణచివేయలేని ఒక ఆవేశాన్ని, ఖచ్చితమైన లక్ష్యాన్ని రగిల్చాయి. సమాజంలో అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నా, పేదలకు, బలహీనులకు అండగా నిలబడాలన్నా చట్టంపై పూర్తి అవగాహన ఉండాలని అతనికి అర్థమైంది. అక్కడికక్కడే తన జీవిత ధ్యేయాన్ని నిర్దేశించుకున్నాడు. ఎలాగైనా సరే ‘లా’ చదివి అన్యాయానికి గురైనవారికి న్యాయం చేయాలనుకున్నాడు. స్కూలు, కాలేజీ చదువుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. పగలురాత్రి కష్టపడి చదువుకున్నాడు. తన తాతగారికి జరిగిన అన్యాయం, చిన్నతనంలో తమ సొంత ఇంటి స్థలాన్ని కబ్జా చేసినప్పుడు పోలీసులు చూపిన నిర్లక్ష్యం అతని ప్రతి క్షణం కసిని పెంచాయి.

ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ : ”డబ్బు లేదు కాబట్టి న్యాయం దూరం కాకూడదు” అనే ఆశయంతో, ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ సంస్థ ఏర్పాటైంది. కోర్టు ఖర్చులు, లాయర్‌ ఫీజులు భరించలేక ఇబ్బంది పడే బాధితులకు అండగా నిలుస్తూ, ఇప్పటివరకు 200కు పైగా కేసులను ఉచితంగా వాదించి న్యాయం అందించారు.

వృత్తికి సేవను జోడించి.. : న్యాయవాదిగా ఎదుగుతూనే సమాజానికి తనవంతు సహాయం అందించడం ఆయన లక్ష్యం. కోర్టు వాదనలకే పరిమితం కాకుండా, బాధితుల బాధను అర్థం చేసుకుంటూ, పేదలకు న్యాయంపై అవగాహన కల్పించడం, అవసరమైన పత్రాలను సమకూర్చడంలో తోడ్పడతారు. ”డబ్బున్న వారికే కాక, ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలి” అని నమ్మే సుబ్బు, తన క్లయింట్లకు కేవలం లాయర్‌గా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారు.

మొదటి కేసు : మనికేశ్వరి నగర్‌లో పిల్లలు ఇంటిని రాయించుకుని రోడ్డుపైకి గెంటేసిన వృద్ధ దంపతుల గోడును సుబ్బు ఓపికగా విన్నారు. వారి అమాయకత్వాన్ని చూసి చలించిపోయిన ఆయన, ఫీజు తీసుకోకుండా మొదటి కేసుగా కోర్టు నోటీసులు పంపించి వాదించారు. ఆ కేసులో గెలిచి, ఆ వృద్ధ దంపతులకు తిరిగి వారి ఇంటిని దక్కేలా చేశారు.

వాదించుడమే కాదు నాట్యము వచ్చు
సుబ్రహ్మణ్యం చిన్నప్పటి నుండి కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నాడు. అతను నాట్యం చేస్తుంటే అందరూ అలా చూడాల్సిందే! అంత అద్భుతంగా చేస్తాడు. ఉస్మానియాయూనివర్సిటీ శతవార్షికోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రవీంద్రభారతిలో నిర్వహించిన నృత్య ప్రదర్శనకు ఉత్తమ నత్యకారునిగా అవార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకు 100కి పైగా కూచిపూడి నత్య ప్రదర్శనలు ఇచ్చాడు.

న్యాయవాద వృత్తి అంటే కేవలం కోర్టులో కేసులు వాదించడం కాదు, సమాజంలో న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అండగా నిలవడం కూడా. బాధితుల తరఫున వాదిస్తూ.. పేదల పక్షాన నిలుస్తూ.. తన వృత్తికి మానవత్వాన్ని జోడిస్తున్న ఈ యువ న్యాయవాది ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.


ఓదెల రాజబాపు, 9493261367

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -