పరంధామయ్య గారికి పక్క ఊరిలో బంధువుల నుంచి శుభకార్యం పిలుపువచ్చింది. భార్యతో కలిసి వెళ్లాలనుకున్నారు. గ్రహించిన శిష్యులు గురువు దగ్గరకు వచ్చి తామూ వస్తామన్నారు. అక్కడకు వస్తే ఏదో ఒకటి నా నెత్తి మీదకు తెస్తారు. నాకు అవమానం మిగులుస్తారు. అందుకే వద్దంటున్నా అన్నారు గురువు. శిష్యులు ఆయన కాళ్ల మీద పడి ఈసారి మీరు చెప్పినట్లే నడుచుకుంటాం. విందుభోజనం చేసి చాలా రోజులైంది అన్నారు. గురువు గారు వారిని చూసి జాలిపడి అయితే ఒక షరతు అన్నారు. ఏంటని .. ముక్తకంఠంతో అడిగారు. భోజనాల్లో ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా వారు వడ్డించింది ఏదీ వదలకుండా శుభ్రంగా తినాలన్నారు. శిష్యులు ఆనందంతో ఎగిరి గంతేశారు. గురువు గారు భార్య, శిష్యులతో శుభకార్యం ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. శిష్యులు భోజనాలు చూస్తూ నాలుకలు చప్పరిస్తున్నారు. పరంధామయ్య గారు శిష్యులను గమనించి వచ్చారుగా.. తిని త్రేన్చండి అంటూ లోపలికి పోయారు. వారంతా భోజనాల బంతిలో కూర్చొన్నారు. వడ్డన జరుగుతుంది. శిష్యులంతా ఒకే వరుసలో కూర్చొన్నారు. గురువు గారి మాట ప్రకారం నడచుకోవాలని నిర్ణయించుకున్నారు. వడ్డన జరుగుతుంది. అందరూ తింటున్నారు. భోజనాలు పూర్తయ్యాయి. తిన్నవారు లేచారు. శిష్యులు తినటం పూర్తయినా లేవటం లేదు. ఏ పదార్థం పారేయకుండా శుభ్రంగా తిన్నారు. అయినా లేవట్లేదు. వారందరిలో ఒక అనుమానం వచ్చింది. గురువు గారు ఏదీ వదలకుండా తినమన్నారు. మనం తిన్నాం కదా ! మరి విస్తరాకులు ఏం చేయాలి ? వదిలేస్తే గురువు గారికి కోపం వస్తుంది అన్నాడు ఒక శిష్యుడు. ఏదీ వదలొద్దు .. అన్నీ తినమన్నారు. కాబట్టి విస్తరాకులు తిని గురువు గారికి మంచి పేరు తెద్దాం అన్నాడు మరో శిష్యుడు. చివరకు అందరూ కూడబలుక్కుని విస్తరాకులు తినాలని నిర్ణయించుకున్నారు. ఎలా తినాలి? ఇంకో శిష్యుడు ప్రశ్నించాడు. విస్తరాకులో ఆకు ఉందిగా ! మేకలు ఆకులు ఎలా తింటాయో అలా తినేద్దాం అన్నాడు మరో శిష్యుడు. ఇది అందరికీ నచ్చింది. అందరూ ఒకేసారి విస్తరాకులు మడిచి నోట్లో పెట్టుకుని నమలటానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా అందరూ నోరు తెరచి అమ్మా .. అబ్బా అని అరవసాగారు. ఈ కేకలకు అందరూ గుమిగూడారు. గురువు గారు కూడా వచ్చారు. కారణం ఏంటని ప్రశ్నించారు. విస్తరాకులు కుట్టిన పుల్లలు గొంతులో గుచ్చుకుంటున్నాయని బాధ పడుతూ చెప్పారు. వీటిని ఎవరు తినమన్నార్రా? అని గురువు గారు ప్రశ్నించారు. మీరే కదండి! ఏదీ వదలకుండా తినాలన్నారు అమాయకంగా చెప్పారు శిష్యులు. శిష్యుల మందబుద్ధికి గురువు గారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.
– తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100



