•సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నవతెలంగాణ – మర్రిగూడ
రాష్ట్రంలో పనిచేస్తున్న ఆటో డ్రైవర్ తో పాటు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల మండల యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జీవనోపాధి కోసం అప్పు చేసి ఆటోలు కొనుక్కొని తమ కుటుంబాలను సాకుతున్నారని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో భాగంగా ఆటో కార్మికులకు ఇస్తామన్న 12 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా,ఆరోగ్య బీమా,పిల్లలకు స్కాలర్షిప్స్,పెన్షన్ లాంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 మోటార్ వాహన చట్టం కార్మికుల మెడమీద ఉరితాడు లా మారిందని విమర్శించారు.ఎలక్ట్రానిక్ ఆటోలను ప్రవేశపెట్టి గమ్యానికి చేర్చే పద్ధతిని మానుకోవాలని ఓలా,ఉబర్ లాంటి సంస్థలను నిషేదించాలని కోరారు.ఈనెల 24 నుండి జరిగే ఆటోల రాష్ట్ర వ్యాప్త బంద్ లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు ఎదుళ్ళ సునీత,ఆటో యూనియన్ నాయకులు ఆవుల వెంకటయ్య,బుష్పాక వెంకటేశ్వర్లు,నారపాక విజయ్,పగడాల అంజయ్య,బైరగోని అంజయ్య,జంగయ్య,రాములు,ఎదుల యాదయ్య,ఏదుళ్ళ సైదులు,కాంసెట్టి శ్రీనివాస్,రామచంద్రం,తదితరులు పాల్గొన్నారు.



