మాట్లాడమన్నారు కాబట్టి
ఏదో ఒకటి మాట్లాడటం
ఇష్టం ఉండదు నాకు మాట్లాడుతున్నప్పుడు
మాట్లాడిపోయాక
వేదిక మీదివాళ్లూ వేదిక కిందివాళ్లూ
ఏమైనా అనుకుంటారేమోనన్న దిగులు లేదు-
మాటల్లో పుప్పొడి, మాటల్లో కర్పూరం,
మాటల్లో అగరొత్తులు
మాటల్లో పాయసం, మాటల్లో మీగడపాలు,
మాటల్లో వేడినెయ్యి
మాటల్లో జుంటితేనె
మాటల్లో రసధుని పొందిక తెలియదని
ఆగ్రహించే మిత్రులకు నేను చెప్పగలిగింది ఒక్కటే-
నాకు తెలిసిందల్లా
నా ముడితనం సూర్యరశ్మిని
మాటల పందిరి ఎక్కించి
పాటల్ని మందకు కాపలా పెట్టటం-
నాకు తెలిసిందల్లా
నా పసితనం చందమామకు
నీటి అద్దంలో పాపిట దువ్వి
ఎడ్ల మూపురాల్లో బడి ఘంట మోగించటం-
ఎండను మోయటం తెలుసు
గాడ్పును మోయటం తెలుసు
ఎండలో గాడ్పులో కొచ్చెటి ముళ్లు
గుచ్చుకున్న నెత్తుటిఅరికాళ్లను
తల్లిగొర్ల వెనకాల
నడవలేని పిల్లల్లా భుజాన వేసుకొని
కొట్టంలోకి సాయంత్రాల్ని మోయటం తెలుసు-
అవమానాల బ్యాంకు బ్యాలెన్స్‌ను తప్ప
మరొకటేది నా గొంగట్లో ప్రకాశించదు
ఆర్తనాదాల ఛందస్సులు మినహా
వేరొకటేవి నా వన్నెరుమాలులో చుట్టి ఉండవు-
ఇదిగో ఇదే ఈ పాతరాతి యుగం క్రీస్తుకథనే
పుటలు పుటలుగా చెప్పగలను-
క్రొమాగ్నాన్ గుహల నుంచి నడుచుకుంటూ
మెగాఫౌనా కోరల బారినపడకుండా
స్పేస్ ఎక్స్ కు చేరుకున్న
బానిస యుగపు అంతేవాసిని నేను
జెన్-జడ్ మాదిరి
స్వైర విహారాల్ని మాల్స్‌లో కొనుక్కొని
క్రెడిట్ కార్డు మెదడుతో బతికేస్తున్న
కేవల మస్తిష్క మానవుణ్ని కాదు-
హృదయం నా ఏకైక వేదం
అది నాకు ఏం చెబుతుందో
అదే మీకు అక్షరం పొల్లుబోకుండా
నిర్భయంగా చెబుతాను
ఒకవేళ ఏదైనా ఒక వాక్యం పెట్రోలు మంటలా
మీ ఒంటికి అంటుకుంటే
తప్పు నాది కాదు అది నా యుగానిది.
ప్రొ.బెల్లి యాదయ్య, 98483 92690
ఏదైనా ఒక వాక్యం మీ ఒంటికి అంటుకుంటే
- Advertisement -
- Advertisement -


