Sunday, August 23, 2026
E-PAPER
Homeదర్వాజరంగాచార్య ‘జీవనయానం’

రంగాచార్య ‘జీవనయానం’

- Advertisement -

మనిషి పుట్టుకే ఒక మహాసమరం. అటువంటి మనిషి జన్మించిన తర్వాత తన జీవిక కోసం అనుక్షణం పడే సంఘర్షణల సంకలనమే జీవనయానం. సాధారణ మానవుని జీవితం కేవలం తన కుటుంబం వరకే పరిమితమవుతుంది. కానీ, ప్రతి ఒక్కరికీ కొన్ని సామాజిక బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతను గుర్తించి, తెలంగాణ విమోచన పోరాటంలో తనవంతు కృషి సల్పిన గొప్ప అక్షరయోగి దాశరథి రంగాచార్య. సాహిత్య ప్రక్రియకు ఒక ఉన్నతమైన సామాజిక ప్రయోజనం ఉంటుందని నిరూపించిన రచయితల్లో దాశరథి రంగాచార్య అగ్రస్థానంలో నిలుస్తారు. ప్రముఖ రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, నాటి ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ మొదలైన సంస్థలు జరిపిన విప్లవాత్మక కార్యక్రమాలను తన రచనల ద్వారా అక్షరీకరించారు. 1928 ఆగస్టు 24న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిన రంగాచార్య, కేవలం గొప్ప రచయిత మాత్రమే కాకుండా నాటి అణచివేతపై పోరాడిన ఉద్యమకారుడు కూడా.

శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించడం వల్ల ఆనాటి సంప్రదాయాల ప్రకారం వేద విద్యకే ఆయన పరిమితం కావాల్సి ఉంది. కానీ, ఆయన తండ్రి పట్టుబట్టి మదర్సాకు పంపి చదువు చెప్పించారు. రంగాచార్య తండ్రి మద్రాసులో చదువుకున్నారు. గాంధీ గురించిన అవగాహన ఉంది. ఆ సంస్కారమే ఇందుకు కారణం కావొచ్చు. అయితే నిజాం రాచరికాన్ని ఎదిరించి సమ్మె చేయడంతో, ఆయన ఆరో తరగతిలోనే ఉన్నప్పుడు నిజాం రాజ్యంలో ఎక్కడా చదవకుండా స్కూలు ప్రిన్సిపాల్ నిషేధ నోటీసు ఇచ్చారు. కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఇంట్లో స్నానం చేసే ముందు ద్రావిడం, స్నానం చేశాక సంస్కృతం మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉండేది. అటువంటి వాతావరణంలో కూడా, ఆయన తల్లి భర్తకు తెలియకుండా తెలుగు పంచకావ్యాలను నేర్పించారు. ఆ ప్రేరణతోనే దాశరథి సోదరులకు తెలుగు భాషపై అపారమైన మక్కువ ఏర్పడింది.

రంగాచార్యకు ఉర్దూపై కూడా మక్కువ. ‘తెలుగు కే అఫ్సానే’ అని తెలుగు కథలను ఉర్దూలోకి అనువదించాడు. ‘కేదారం’ పేరుతో జిలానీబానూ కథలు, ‘ఉమ్రావ్ జాన్ ఆదా’ నవలను తెలుగులోకి తర్జుమా చేశారు. అయితే ఏడవ నిజాం ఉర్దూకు మతం రంగు అంటగట్టడాన్ని, ఉర్దూను తెలుగు వారిపై రుద్దడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడాన్ని వ్యతిరేకించాడు. ‘ప్రజల ఉద్యమం నిజాం నవాబు నియంతృత్వానికి, నిరంకుశత్వానికి, రాక్షసత్వానికి వ్యతిరేకంగానే కానీ; ఏ మతానికీ, ఏ భాషకు వ్యతిరేకంగా కాదు.’ అని తెలంగాణ పోరాట ఉద్దేశ్యాన్ని స్పష్టపరచాడు.
ఉద్యమం విషయానికి వస్తే ‘తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసింది కమ్యూనిస్టు పార్టీయే’ అని నమ్మే రంగాచార్య కాంగ్రెస్ పార్టీ దళాలతో కూడా పనిచేశారు. చిన్ననాడే పానుగంటి నాగేశ్వరరావు ఆలోచనతో బాలసంఘం స్థాపించాడు. గార్ల శివాలయంలో ఆంధ్రమహాసభ కార్యాలయాన్ని ఏర్పరిచి ఎందరికో సభ్యత్వం ఇచ్చాడు. అదే శివాలయాన్ని గ్రంథాలయంగా చేసి యూనియన్ ప్రాంతం నుండి పుస్తకాలు తీసుకువచ్చి ఇక్కడి ప్రజలచేత చదివించాడు. ఆ సందర్భంలో ఎన్నో పుస్తకాలు చదివాడు. గోర్కీ అమ్మ నవల ఆయనపై అమితమైన ప్రభావం వేసింది.

ట్యూషన్ నడిపి ఎందరినో విద్యావంతులను చేశారు గాంధీజీ సిద్ధాంతాలపై అమితమైన భక్తి కలిగిన రంగాచార్య మహమ్మద్ అలీ జిన్నా, హిట్లర్, నెహ్రూ, పుచ్చలపల్లి సుందరయ్య, మాడపాటి హనుమంతరావు వంటి దిగ్గజ నాయకుల రాజకీయ దృక్పథాలపై, అలాగే కాశ్మీర్ సమస్య, హైదరాబాద్ విలీన సమస్యల వంటి నాటి చారిత్రక పరిణామాలపై ఎంతో స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. అసఫ్ జాహీల క్రూర పాలననే కాకుండా, మొదటి నిజాం ఖమ్రుద్దీన్, ఆరవ నిజాం మహబూబ్ అలీ పాదుషా వంటి పాలకులు చేసిన ప్రజాహిత కార్యక్రమాలను కూడా నిష్పాక్షికంగా తన రచనలో వివరించడం ఆయన అవగాహనా పరిణతికి అద్దం పడుతుంది. పోలీసు చర్య అనంతరం హైదరాబాదు సంస్థానం భారత్‌లో విలీనమయ్యాక, ఆయన తన చదువును కొనసాగించి మున్సిపాలిటీలో ఉద్యోగం సంపాదించాక, పూర్తిస్థాయి రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. 1935 కంటే ముందు నాటి తెలంగాణ ప్రజల దుర్భర జీవితాలను, బానిసత్వపు శృంఖలాలను ‘చిల్లర దేవుళ్లు’ నవలలో చిత్రీకరించారు.

ఈ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దీనితో పాటు ‘మోదుగుపూలు’, ‘జనపదం’, ‘రానున్నది ఏది నిజం’, ‘మానవత’, ‘పావని’ మొదలైన తొమ్మిది నవలలను, నాలుగు వేదాలను, రామాయణ, మహాభారతాలను సులభశైలిలో తెలుగులోకి అనువదించి సాహితీ జగత్తుకు అందించారు. ఆయనకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, గోర్కీ, ప్రేమ్‌చంద్ లపై అభిమానం. వారందరి ప్రభావం రంగాచార్యపై ఉంది. చండ్ర రాజేశ్వరరావు ఈయనను ఆంధ్రా గోర్కీ అని అభినందించారు. రంగాచార్య రచనలలో ముఖ్యమైనది ‘జీవనయానం’. ఇది కేవలం ఒక ఆత్మకథ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పుస్తకం. ఎన్ని ఆటంకాలు, ఆటుపోటులు ఎదురైనా వెనకడుగు వేయకుండా గట్టిగా నిలబడి పోరాడిన ఒక యోధుని కథ. నిజాం వ్యతిరేక తెలంగాణ పోరాటాన్ని, ఆనాటి భారతదేశ రాజకీయ, సామాజిక విశేషాలను లోతుగా విశ్లేషించిన గ్రంథం ‘జీవనయానం’. నిష్పక్షపాతంగా జరిగిన విషయాలను మాత్రమే చెప్పే విషయంలో ఈ ఆత్మకతను సత్యశోధనతో పోల్చవచ్చు. పోరాటమే తన జీవితంగా బతికిన రంగాచార్య జూన్ 8, 2015 న ఈ లోకాన్ని విడిచాడు. ఒక వైపు పోరాటయోధుడిగా, మరోవైపు ఉన్నతస్థాయి రచయితగా దాశరథి రంగాచార్య అందించిన సేవలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయం.
(దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా)

ఇట్టవేని రాకేశ్, పరిశోధక విద్యార్థి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -