కవిత్వంలో వస్తువు (content – కాంటెంట్), ఊహలు బాగుండటం ఒక పార్శ్వమైతే ఆ ఊహలను as it is గా, plain గా కాకుండా డిక్షన్ లో పనితనం (craftsmanship) జోడిస్తూ వ్యక్తీకరించడం మరొక పార్శ్వం. పనితనం అంటే తప్పక పెద్ద పెద్ద పదాలను వాడాలని కాదు. సరళమైనవైనా సరైన పదాలను ఎన్నుకోవడం, వాటిని సరైన స్థానాలలో అమర్చి ప్రభావవంతంగా మార్చడం కూడా పనితనమే. Alliteration, assonance, consonance, rhyme, figurative speech, paradox, personification మొదలైన కవిత్వ సాధనాలను (poetic devices ను) చేర్చడం కూడా అవసరం. ఇవి శిల్పానికి, రూపానికి (form కు) దోహదపడే అంశాలు. నిజానికి శిల్పాన్ని ఇంగ్లిష్ లో craftsmanship అని కూడా అంటారు. కానీ కొన్ని కవితలలో ప్రత్యేకమైన పనితనం లేకపోయినా అవి గొప్పగా ఉంటాయి. దానికి కారణం వాటిలోని ఆలోచనలు చాలా అసాధారణమైనవి, అరుదైనవి, ఉన్నతమైనవి, లేదా నూతనమైనవి కావటం. కవిత్వ ఊహ కైలాస పర్వతమంత ఎత్తులో ఉన్నప్పుడు పనితనం అంతగా అవసరం లేదేమో కానీ, తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మాత్రం అవసరమే. ఒకవేళ రెండూ (thoughts & workmanship) గొప్పగా ఉంటే అప్పుడది మరింత విశిష్టమైన కవిత అవుతుంది.
వర్తమాన కాలంలోని కవిత్వాన్ని పరిశీలిస్తే ఇక్బాల్ చంద్, అహ్మద్ వలీల కొన్ని కవితలలో గరిమాన్వితమైన ఊహలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానంగా తాత్త్వికత చోటుచేసుకోవడం యాదృచ్ఛికం. ఏ రకమైన ఊర్థ్వస్థాయి ఊహలైనా కవితకు గొప్పతనాన్ని ఆపాదిస్తాయి; పనితనం లేని లోటును అంతగా తెలియనివ్వవు. ఇక ఊహలు, పనితనం రెండూ అసాధారణంగా ఉన్న కవిత్వానికి ఉదాహరణగా కృష్ణశాస్త్రి గారి “నన్ను గని …” అన్న కవితను మచ్చుగా చూపించవచ్చు. అందులోని కేవలం ఈ ఆరు పంక్తులను పరిశీలించినా అద్భుతమైన విశేషాలు ఎన్నో బయటపడతాయి.
నాకు నిశ్శ్వాసతాళవృంతాలు కలవు
నాకు కన్నీటిసరులదొంతరలు కలవు
నా కమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంతదుఃఖంపునిధులు కలవు
ఎవ్వరని యెంతురో నన్ను?
ఏననంత శోకభీకరతిమిరలోకైకపతిని
పై ఆరు పంక్తులలో ఎన్ని కవిత్వ సాధనాలున్నయో చూద్దాం. మొదటి పంక్తి లోని నిశ్శ్వాసతాళవృంతాలు అంటే నిట్టూర్పుల విసనకర్రలు. నిట్టూర్పులు దుఃఖసూచికలైనా వాటిని హాయిని గూర్చే విసనకర్రలుగా సంభావించడంలో విరోధాభాస (paradox), oxymoron లు ఒదిగివున్నాయి. పైగా నిట్టూర్పులు అనే విసనకర్రలు అంటున్నందుకు ఆ పదబంధం ఒక రూపకం (metaphor) కూడా అవుతుంది. అదేవిధంగా రెండవ పంక్తిలో కన్నీటిసరులు అన్నది విరోధాభాస, రూపకం కలగలిసిన పదబంధం. మూడవ పంక్తిలో అమూల్య, అపూర్వ, ఆనంద అన్నప్పుడు అందులో alliteration ఒదిగి ఉన్నట్టు గమనించవచ్చు. అదేవిధంగా నాలుగవ పంక్తి లోని నిరుపమ నితాంత నిధులులో alliteration దాగివుంది. ఇక దుఃఖంపునిధులు రూపకం మాత్రమే కాకుండా ఒకరకంగా oxymoron కూడా. ఐదవ పంక్తిలోని ‘శోక భీకర లోకైక’లో consonance ఇమిడివుంది. అంతే కాకుండా శోక, తిమిర అనే మాటలు దుఃఖానికి సూచికలైనా, లోకైకపతి లోని రాజు అనే భావం ద్వారా అవి చూచాయగా విరోధాభాసను ఆపాదిస్తున్నాయి.
ఈ కవితలోని అద్భుతమైన భావుకత, ఊహశక్తి, శబ్దపటిమ, కవిత్వ ఉపకరణాలు పనితనానికి (అంటే శిల్పానికి) పరోక్షంగా ఉపకరించాయి. ఇంకా లోతుగా పరిశీలిస్తే, ఇందులోని ప్రతి పంక్తీ తేటగీతి పాదం. కానీ ఈ విశేషాన్ని వెంటనే గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే, కృష్ణశాస్త్రి గారు ఈ కవితలోని అన్ని (18) పంక్తులనూ మధ్య ఎడం లేకుండా వరుసగా అమర్చి, కవితను ఒక తేటగీతిమాలికగా మార్చారు. విషయంలోని ఏకసూత్రత దీనికి పూరకం (complement) గా పని చేసింది. మామూలుగా అయితే ప్రతి నాలుగు పాదాల తేటగీతి తర్వాత ఎడం ఇస్తారు పద్యకవులు. అలా ఇవ్వకపోవడం ఒక ప్రయోగం అనవచ్చు. అయితే ఈ పద్ధతిని పూర్వకవులెవరూ పాటించలేదని నిర్ద్వంద్వంగా చెప్పలేం. ఈ కవితలోని పంక్తులన్నీ తేటగీతి పాదాలు కావటం వలన, వాటిలోని ఛందస్సు కవిత్వ ఉపకరణాలకు కొంతవరకు contribute చేసింది. ఛందస్సు అంటేనే ప్రధానంగా లయ కనుక, లయతో సంబంధమున్న కవిత్వ సాధానాలు కొన్ని వాటంతట అవే వచ్చి కవితలో చేరాయి. ఇందులో ఈ పనితనం లేదనుకోండి. అప్పుడీ కవిత్వంలో ఇంత సాంద్రత ఉండదు. గ్వెండోలిన్ బ్రూక్స్ రాసిన ప్రసిద్ధ కవిత “We Real Cool” ను ఒక వ్యాసంలో విశ్లేషిస్తూ, దాన్ని ఆవగింజలో అనంత విశ్వంగా అభివర్ణించాను. కృష్ణశాస్త్రి గారి ఈ కవితలో కూడా అటువంటి గొప్పతనం దాగివుంది.
కవిత్వ ఊహ కైలాస పర్వతమంత ఎత్తులో ఉన్నప్పుడు పనితనం అంతగా అవసరం లేదేమో కానీ, తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మాత్రం అవసరమే. ఒకవేళ రెండూ (thoughts & workmanship) గొప్పగా ఉంటే అప్పుడది మరింత విశిష్టమైన కవిత అవుతుంది.
మామూలుగా అయితే ప్రతి నాలుగు పాదాల తేటగీతి తర్వాత ఎడం ఇస్తారు పద్యకవులు. అలా ఇవ్వకపోవడం ఒక ప్రయోగం అనవచ్చు. అయితే ఈ పద్ధతిని పూర్వకవులెవరూ పాటించలేదని నిర్ద్వంద్వంగా చెప్పలేం.



