కొన్ని మరణాలు కన్నీళ్లను మాత్రమే మిగల్చవు… ఒక ఉద్యమాన్నే విషాదంలో ముంచుతాయి. కొన్ని వీడ్కోళ్లు ఒక వ్యక్తిని మాత్రమే మనకు దూరం చేయవు… ఒక తరం పోరాట అనుభవాన్ని, ఒక నిబద్ధతను, ఒక సైద్ధాంతిక జీవనాన్ని మన కండ్లముందు నిలబెడతాయి. సారంపల్లి మల్లారెడ్డి మరణం అలాంటి విషాదమే. సీపీఐ(ఎం) సీనియర్ నేతగా, రైతాంగ ఉద్యమ నాయకుడిగా, ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడిగా మల్లారెడ్డి పేరు తెలంగాణ రాజకీయ, సామాజిక చరిత్రలో చెరగని ముద్ర. తొమ్మిది దశాబ్దాల జీవితం ఆయనకు వయసును మాత్రమే ఇవ్వలేదు. అనుభవాన్ని ఇచ్చింది. పోరాటాన్ని నేర్పింది. ప్రజల కన్నీళ్లను తన కన్నీళ్లుగా భావించే హృదయాన్ని ఇచ్చింది. ముఖ్యంగా… ఎర్రజెండాను ఒక రాజకీయ గుర్తుగా కాకుండా, పేదల ఆశగా, రైతుల భరోసాగా, శ్రమజీవుల పోరాట ఆయుధంగా భావించిన వ్యక్తిత్వాన్ని ఇచ్చింది.
1939 ఆగస్టు 25న జన్మించిన సారంపల్లి మల్లారెడ్డి తొమ్మిది దశాబ్దాల జీవితాన్ని తనకోసం కాదు… రైతు, కూలీ, పేదల హక్కుల కోసం అంకితం చేశారు. తిమ్మంపేటలో సామాజిక అసమానతలు, దోపిడీని కళ్లారా చూసిన ఆయన కుటుంబం కమ్యూనిస్టు భావజాలం వైపు అడుగులు వేసింది. అధికార వర్గాల ప్రతిఘటన, తప్పుడు కేసులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఆ అడ్డంకులే ఆయనలో పోరాట స్ఫూర్తిని మరింత పదును పెట్టాయి. కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితమైన ఆయన జీవితం ఒక వ్యక్తి కథ కాదు… తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో ఒక చెరగని అధ్యాయం.
కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలు, నిర్బంధాలు ఎదురైనా తిమ్మంపేట ఎర్రజెండా కింద నిలిచింది. ఆ పోరాటానికి మల్లారెడ్డి వంటి నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నెముక. 1971ఆగస్టు 6న తిమ్మంపేటపై 200 మందితో కాంగ్రెస్ నాయకులు దాడికి దిగిన వేళ, రాజిరెడ్డి, చంద్రారెడ్డి తదితరుల నాయకత్వంలో కమ్యూనిస్టు కార్యకర్తలు ధైర్యంగా ప్రతిఘటించారు. అప్పట్లో పోలీస్ పటేల్‌గా ఉన్న మల్లారెడ్డి అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించి కార్యకర్తలకు అండగా నిలిచారు. దీంతో మల్లారెడ్డిని పోలీసుపటేల్ పదవి నుంచి సస్పెండ్ చేసి, 72 మందిపై కేసులు పెట్టి సెంట్రల్ జైలుకు పంపారు. ఈ నిర్బంధవార్త తెలుసుకున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఎ.కె. గోపాలన్ తిమ్మంపేటకు చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. అదే రోజు నర్సంపేటలో 20 వేల మందితో జరిగిన మహాసభ ఉద్యమానికి అఖండ ప్రజా మద్దతును చాటింది. ఆ పోరాట స్ఫూర్తే మల్లారెడ్డిని మరింత దృఢమైన ప్రజా ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దింది.
1973లో సీపీఐ(ఎం) పూర్తికాల కార్యకర్తగా మారిన మల్లారెడ్డి, తిమ్మంపేట అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. తిమ్మంపేటలో 42 ఏండ్ల ఎర్రజెండా ప్రజా పాలన ఒక చరిత్ర. పంచాయతీ, సింగిల్‌విండోలను ప్రజా ఉద్యమ స్ఫూర్తితో నడిపారు. సర్పంచ్‌గా సారంపల్లి మల్లారెడ్డి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు. పాఠశాల, పంచాయతీ భవనం, తాగునీరు, విద్యుద్దీకరణతో పాటు పేదలకు భూమి కోసం పోరాడారు. 1972లో ఆయన నేతృత్వంలో విద్యుద్దీకరణ కోసం ప్రజలే శ్రమదానం చేసి తమ గ్రామానికి వెలుగులు తెచ్చుకున్నారు. భూమిలేని పేదల కోసం 1967లో 110 ఎకరాల భూమిని సాధించి, అనంతరం పట్టాలు ఇప్పించారు. తిమ్మం పేటకు రోడ్లు, భవనాలు మాత్రమే కాదు… ప్రజలకు తమ హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని కూడా ఇచ్చింది ఈ ఉద్యమమే. సీపీఐ(ఎం) ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్‌గా, సీనియర్ నేతగా జీవితాంతం ప్రజా ఉద్యమానికే అంకితమయ్యారు.
రైతు సంఘం నిర్మాణంలో సారంపల్లి మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారు. డివిజన్ రైతు సంఘం కార్యదర్శి నుంచి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడి వరకు ఆయన ఎదిగిన ప్రస్థానం తెలంగాణ రైతాంగం ఆయనపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక. రైతు సమస్యను కేవలం పంట సమస్యగా కాకుండా భూమి, నీరు, రుణాలు, గిట్టుబాటు ధరలు, వ్యవసాయ విధానాల వంటి విస్తృత అంశాలతో ఆయన చూశారు. అందుకే ఆయన కలం కూడా రైతాంగ పోరాటానికి ఆయుధమైంది. ‘రైతు ఉద్యమ చరిత్ర’, ‘బడుగు రైతుల వెతలు’, ‘కార్పొరేట్ దిశన వ్యవసాయం’, ‘తెలంగాణ రైతాంగ భూ ఉద్యమాలు’, ‘వ్యవసాయ సంక్షోభంలో రైతులు దివాళా’, ‘భారత రైతాంగ పోరాటాలు’ వంటి రచనలు ఆయన రైతు పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. రైతు పొలంలో నిలిచిన నాయకుడు, రైతు బాధను అక్షరబద్ధం చేసిన రచయితగా మల్లారెడ్డి నిలిచారు.
పోరాటమే ఊపిరిగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం తపించిన మహోన్నత నాయకుడు ఆయన. ఎండనకా, వాననకా పొలాల బాట పట్టి రైతు కష్టాలను తన కష్టాలుగా భావించిన దార్శనికుడు. రైతు సమస్యను కేవలం ఎన్నికల అంశంగా కాకుండా జీవన్మరణ సమస్యగా చూసిన నాయకుడు ఆయన. పంటకు మద్దతు ధర కోసం, రైతు రుణమాఫీ కోసం, సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం ఆయన గళం ఎప్పుడూ సింహగర్జనలా మోగేది. పాలకులు ఎవరైనా సరే… రైతుల హక్కుల విషయానికి వస్తే నిలదీయడంలో, ప్రశ్నించడంలో ఆయన ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కాలం మారింది. వ్యవసాయం మారింది. దోపిడీ రూపాలు మారాయి. మార్కెట్ల స్వరూపం మారింది. కానీ రైతు కష్టాలు మాత్రం కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడి భారమైంది. పంటకు గిట్టుబాటు ధర అనిశ్చితమైంది. అప్పులు పెరిగాయి. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాల్లో భవిష్యత్తుపై ఆందోళన పెరిగింది. ఇలాంటి సమయంలో మల్లారెడ్డి లాంటి నాయకుల గైర్హాజరీ రైతాంగ ఉద్యమానికి తీరనిలోటు.
ఆయన స్వరం ఇక సభల్లో వినిపించదు. రైతు సమస్యలపై, సాగునీటి ఎద్దడిపై ఆయన చేసే ఆ వాదన ఇక వినిపించదు. పార్టీ సమావేశాల్లో ఆయన అనుభవం ఇక కనిపించదు. సహచరులను పలకరించే ఆ ఆత్మీయత ఇక ఉండదు. కానీ ఆయన జీవితం వదిలి వెళ్లిన ప్రశ్నలు మాత్రం మన ముందే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మల్లారెడ్డికి నిజమైన నివాళి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు… కానీ, పచ్చని చేలో పారే ప్రతీ కాల్వ నీటిలో ఆయన చెమట చుక్కల తడి ఉంటుంది. మద్దతు ధర కోసం కట్టిన ప్రతీ ఏరువాక పాటలో ఆయన గర్జన మార్మోగుతూనే ఉంటుంది. నిర్బంధాలను ఎదురించి, హక్కుల కోసం ఎర్రజెండాను గుండెలకు హత్తుకున్న ఆ ఉద్యమ శిఖరానికి ఏ ముగింపూ లేదు. ఆయన నేర్పిన పోరాట పాఠాలు, చూపిన చైతన్యబాట తరతరాల రైతులకు ఆశాదీపమై వెలుగుతూనే ఉంటాయి.
పోరాట పాఠం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



