– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు, గుడ్లు,వంట బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెనూ చార్జీలను పెంచాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దమ్మపేట ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓ జగపతిరావుకు అందజేశారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, అయితే విద్యార్థుల మెనూ చార్జీలు మాత్రం పెరగలేదన్నారు. దీంతో నిర్ణీత మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం వంట కార్మికులకు భారంగా మారిందని తెలిపారు.
ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. కార్మికులు సొంత డబ్బులు పెట్టి గుడ్లు, కూరగాయలు కొనుగోలు చేసి వంట చేస్తున్నప్పటికీ రెండు నెలలుగా బిల్లులు చెల్లించలేదన్నారు.
ప్రభుత్వమే వంటగ్యాస్, గుడ్లు సరఫరా చేయాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్ అందించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, సత్యవతి, శ్రీదేవి, పార్వతి, జయలక్ష్మి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.



