కులాల పేర్లతో కూడిన డ్రాప్‌డౌన్ జాబితాను అందుబాటులోకి తేవాలి
ప్రధాని మోడీకి రాహుల్, ఖర్గే సంయుక్త లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కులగణనలో వివరాల సేకరణ విధానంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్య సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోడీకి ఇద్దరూ సంయుక్తంగా లేఖ రాశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ‘ఓపెన్ ఎండెడ్’ విధానాన్ని మార్చి, కులాల పేర్లతో కూడిన డ్రాప్‌డౌన్ జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుత విధానంలో వ్యక్తులు తమ కులం పేరును ఎలా చెబితే అలా నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఒకే కులానికి ప్రాంతాలను బట్టి వేర్వేరు పేర్లు, ఉపకులాలు, భాషా రూపాలు ఉండే అవకాశం ఉందని వివరించారు. దీంతో ఒకే కులానికి చెందినవారి వివరాలు వేర్వేరు పేర్లతో నమోదైతే.. ఆ కులం వేలాది ఎంట్రీలుగా విడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలా జరిగితే కులాల జనాభాపై కచ్చితమైన సమాచారం లభించదని పేర్కొన్నారు. ఫలితంగా వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, ఇతర అణగారిన వర్గాల స్థితిగతులపై సరైన అంచనా సాధ్యం కాదని వివరించారు. విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలపై దీని ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలో ఓబీసీల వాస్తవ జనాభా ఎంత అన్నది కూడా తేలకపోవచ్చని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కులగణనలో ‘బ్యాక్‌వర్డ్ క్లాస్’ అనే పదం చేర్చలేదని లేఖలో ప్రస్తావించారు. కులాల పేర్లతో డ్రాప్‌డౌన్ జాబితా రూపొందించాలని వారు సూచించారు. ఎస్సీ, ఎస్టీల గణనలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని గుర్తు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రభుత్వ జాబితాలు, ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించవచ్చని వివరించారు. తెలంగాణ, బీహార్ కుల సర్వే ల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రశ్నావళిని రద్దుచేసి, రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో సంప్రదింపులు జరిపిన తరువాత కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని కోరారు.



