Wednesday, August 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏడాదిలోగా దేవాదుల పూర్తి

ఏడాదిలోగా దేవాదుల పూర్తి

- Advertisement -

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కు నిధుల కొరత రానివ్వం
గోదావరి జలాలను గరిష్టంగా ఎత్తిపోస్తాం : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించనున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని జలసౌధలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దనసరి అనసూయ సీతక్క తో కలిసి దేవాదుల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణకు రూ. 6,000 కోట్లు కేటాయించామనీ, ఇప్పటి వరకు రూ.2,500 కోట్లు విడుదలయ్యాయని మంత్రి వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టుకు కూడా ఇటీవల భూసేకరణ కోసం నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. అవసరమైన ప్రక్రియలు పూర్తయిన వెంటనే మిగిలిన నిధులను సైతం సమకూరుస్తామని తెలిపారు. ఇకపై విధానపరమైన, పరిపాలనా లేదా కాంట్రాక్టు సంబంధిత సమస్యల పేరుతో దేవాదుల పనులు సాగదీయడానికి అవకాశం ఉండదని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు ప్రతి కాంపోనెంట్‌ను విడివిడిగా పరిశీలించి నిలిచి పోయిన పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులు, ఇతర పరిపాలనా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయి, అవార్డులు ఖరారైన చోట నిధుల విడుదలలో జాప్యం ఉండకూడదన్న ప్రభుత్వ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఇదే అంశంపై రాష్ర్టంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, చీఫ్‌ ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంబంధిత ఇతర విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేసి పనులకు గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

6 లక్షల ఎకరాలకు సాగునీరు
దేవాదుల ప్రాజెక్టు ద్వారా 38 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి, దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు ఉత్తమ్‌ తెలిపారు. హన్మకొండ, వరంగల్‌, కరీంనగర్‌, జనగామ, యాదాద్రి–భువనగిరి, సూర్యాపేట, సిద్ధిపేట, మేడ్చల్–మల్కాజిగిరి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి తదితర జిల్లాలు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందనున్నారని వెల్లడించారు. రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన ప్రాజెక్టు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలిపోవడం దురదృష్టకరమన్నారు. ఇకపై జాప్యానికి తావులేకుండా, ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పంపింగ్‌ వ్యవస్థలన్నింటిని పూర్తి సామర్థ్యంతో వినియోగించి, గోదావరి నుంచి సాధ్యమైనంత గరిష్ఠ పరిమాణంలో నీటిని ఎత్తిపోస్తామని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు రిజర్వాయర్లను నింపాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, సీనియర్‌ శాసనసభ్యులు కడియం శ్రీహరి, దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -