Thursday, August 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసాగర్‌ వద్ద జలవివాదం..

సాగర్‌ వద్ద జలవివాదం..

- Advertisement -

కుడికాలువ ద్వారా ఏపీ అధికారుల నీటి విడుదల
కృష్ణాబోర్డు అనుమతులు లేవన్న తెలంగాణ అధికారులు
ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన తెలంగాణ అధికారులు
నీటి పంపకాల విషయంలో ఎటూ తేల్చని కృష్ణా బోర్డు

​కేంద్రం, బోర్డు యాజమాన్యం చోద్యం

​నవతెలంగాణ-నాగార్జునసాగర్
​నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టు వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. కృష్ణా నది యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులూ లేకుండా ఆంధ్రా ఇరిగేషన్‌ అధికారులు బుధవారం నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడి కాలువ ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలంగాణ అధికారులు అన్నారు. తాగునీటి అవసరాల కోసమే నీటిని తీసుకున్నామని ఏపీ అధికారులు తెలిపారు. బోర్డు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఏపీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ అధికారులు అన్నారు. కుడికాలువకు నీటి విడుదలను తక్షణమే నిలుపుదల చేయాలని తెలంగాణ అధికారులు ఏపీ అధికారులకు సూచించారు. అయినా పట్టించుకోకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు డ్యాం నుంచి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎడమ కాలువకూ నీటిని విడుదల చేశారు. ఎగువన ఉన్న శ్రీశైలంలో కనీస నీటిమట్టాలకు పైన ఉన్న నీటి నిల్వలను వినియోగించుకునే విషయంలో మూడ్రోజుల కింద కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించింది. నీటి పంపకాల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోవడంతో సమావేశాన్ని సెప్టెంబర్ 4 కి వాయిదా వేశారు. కానీ, ఆంధ్రా ఇరిగేషన్ అధికారులు బుధవారం అకస్మాత్తుగా కుడి కాలువ ద్వారా తాగు అవసరాల నిమిత్తం నీటిని స్వయంగా విడుదల చేశారు.

తాము కృష్ణా బోర్డు అనుమతితోనే నీటిని విడుదల చేసుకున్నామని చెబుతున్నారు. ఈ విషయంలో తమకు ఎటువంటి సమాచారమూ లేదని కృష్ణా బోర్డు నుంచి కూడా ఎటువంటి ఉత్తర్వులూ రాలేదని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నీటి విడుదల విషయంలో నాగార్జునసాగర్ డ్యాం సూపరింటెండెంట్‌ ఇంజినీర్ మల్లికార్జునరావును వివరణ కోరగా.. గతంలో సాగర్ జలాశయం నుంచి కుడి కాలువ, ఎడమ కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం కేటాయించిన నీటిలో కుడి కాల్వ ద్వారా ఆంధ్ర తన పూర్తి వాటాను వాడుకుందని తెలిపారు. ఎడమ కాలువ పరిధిలో మాత్రమే సుమారు 8 టీఎంసీల వరకు వినియోగించుకోవాల్సి ఉం‌దన్నారు. దానిలో భాగంగానే బుధవారం ఎడమ కాలువ ద్వారా పెద్దదేవులపల్లి చెరువు నింపడానికి తాగునీటి అవసరాల నిమిత్తం టీఎంసీ మేరకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. కుడి కాలువ ద్వారా ఆంధ్రాఇరిగేషన్ అధికారులు నీటి విడుదల విషయంలో తమకు ఎటువంటి సమాచారమూ లేదన్నారు. ఈ విషయమై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే కుడి కాలువ ద్వారా ఆంధ్రా ప్రాంతంలో తాగునీటి అవసరాల నిమిత్తం 8 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకున్నామని ఆ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

​​కేంద్రం, బోర్డు యాజమాన్యం చోద్యం
సాగర్ నీటి విడుదల వినియోగం విషయంలో తెలంగాణ ఆంధ్ర ఇరిగేషన్ అధికారుల మధ్య కృష్ణానది యాజమాన్య బోర్డు, కేంద్రం ఇరు రాష్ట్రాల మధ్యన కయ్యం పెట్టి చోద్యం చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను బుధవారం సాయంత్రానికి 536.60 అడుగులుగా ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 23,441 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. సాగర్ జలాశయం నుంచి ఎస్ ఎల్ బిసి ద్వారా రెండువేల క్యూసెక్కులు, కుడి కాలువ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 2053 క్యూసెక్కులు, ఎడుమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -