Thursday, August 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభావవ్యక్తీకరణ, ఆందోళనకు సిద్ధంగా ఉండాలి

భావవ్యక్తీకరణ, ఆందోళనకు సిద్ధంగా ఉండాలి

- Advertisement -

మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ నిర్వాసితులకు పిలుపు
నిర్వాసితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌
‌గజ్వేల్‌‌లో ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-గజ్వేల్

భావవ్యక్తీకరణ, ఆందోళనకు మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ జలాశయం నిర్వాసితులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌ ‌పిలుపు నిచ్చారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల కన్నీటి బాధలతో ఉపాధ్యాయులు పులి రాజు, సీనియర్ జర్నలిస్టు రాజేందర్లు రచించిన ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకావిష్కరణ సభ గజ్వేల్ పట్టణంలో బుధవారం నిర్వహించారు. బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సజయ, డీసీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్‌లతో కలిసి కోదండరాం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నిర్మాణ సమయంలో ఎన్నో ఉద్యమాలు చేసినట్టు తెలిపారు. అప్పటి ప్రభుత్వం గోరంత పనికి కొండంత చేసి 14 గ్రామాల ప్రజలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం చేయాలని ఆందోళన చేపడితే రెండుసార్లు అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కిందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందని కుటుంబాలను గుర్తించి నివేదిక తయారు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానన్నారు.

చట్టం ప్రకారం న్యాయం చేయాలి: సజయ
కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసితుల కుటుంబాలకు 2013 చట్టం ప్రకారం న్యాయం చేయాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ జర్నలిస్ట్ సజయ అన్నారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తే అక్కడి ముంపు బాధితులకు చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని కోరారు. కానీ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వాలు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 చట్టం ప్రకారం ప్రతీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు.

ముంపు గ్రామాలు గుంపు కట్టాలి..
ముంపు గ్రామాల బాధితుల గోసలు ప్రస్తుత ముఖ్యమంత్రికి తెల్సునని.. అయినప్పటికీ ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితుల పక్షాన కొట్లాడుతామని ఏపూరి సోమన్న అన్నారు. నా పాట ఎప్పుడు ప్రజల పక్షమేననంటూ ముంపు గ్రామాల బాధితులపై ఏపూరి సోమన్న పాడిన పాటకు మహిళ లంతా కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని ఏండ్లైనా ఒక్క మంత్రి కూడా వీళ్ళని ఓదార్చడానికి రాకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయితలు పులిరాజు, రాజేందర్, కౌన్సిలర్లు విష్ణువర్ధన్ రెడ్డి, వెల్దండి నరసింహారెడ్డి, ఉపేందర్ రెడ్డి, దాసరి కృష్ణ, రాజులు, గోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, రాజేశం, సత్యనారాయణ, నరేందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -