అయినా
వెనక్కి
తగ్గేది లేదు
మార్చి 31 నాటికి పూర్తయిన
ఇండ్లకు చెల్లింపులు
ఇప్పటికే రూ.185 కోట్లు విడుదల
15,475 మందికి చివరి బిల్లులు జమ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పేదల ఇండ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుందని ఆశతో ఎదురుచూశామని తెలిపారు. కేంద్రం నిధులివ్వకపోయినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మార్చి 31 వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల చివరి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా పేదల కోసం రూ.185 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. 15,475 మంది లబ్ధిదారుల ఖాతాల్లో చివరి బిల్లులు జమ చేసినట్టు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి విడుదల కాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2023 వరకు పదేండ్ల పాటు ఇండ్ల నిర్మాణం ఆగిపోవడంతో వాటి కోసం భారీ ఎత్తున డిమాండ్ ఉందని, ఆ మేరకు వాటిని మంజూరు చేయాలని అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు గుర్తుచేశారు.
కేంద్రం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతోనే ఇప్పటి వరకు పూర్తయిన ఇండ్లకు సంబంధించిన చివరి బిల్లుల చెల్లింపును తాత్కాలికంగా నిలిపేసినట్టు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారని తెలిపారు.. రాష్ట్రానికి కేంద్ర మంత్రి వచ్చిన సందర్భంలోనూ, రెండు వారాల క్రితం పార్లమెంటు సభ్యులతో కలిసి తాను స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుందని స్పష్టం చేశారు. బిల్లులు కోసం పేదలు ఎదురుచూస్తుంటే ఊరుకోలేమని తెలిపారు. అందుకే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. మార్చి 31వ తేదీ నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం నాడు జమ అవుతాయని తెలిపారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పేదలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసం కల్పించే లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించారని, సెప్టెంబర్ 15లోగా వాటికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.
పేదల ఇండ్ల కోసం నిధులివ్వని కేంద్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



