Thursday, August 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎథిక్స్ కమిటీ పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపులు

ఎథిక్స్ కమిటీ పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపులు

- Advertisement -

సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వర్తించదా?
విచారణ రేవంత్ రెడ్డితోనే ప్రారంభించాలి : మాజీమంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎథిక్స్‌ కమిటీ పేరుతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌రెడ్డి విమర్శించారు. ఎథిక్స్‌ ‌కమిటీ నిబంధనలు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వర్తించవా?అని ప్రశ్నించారు. ఎథిక్స్‌ ‌కమిటీ విచారణ సీఎం రేవంత్‌‌రెడ్డితోనే ప్రారంభం కావాలని డిమాండ్‌ ‌చేశారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై చర్చించి చర్యలు సిఫారసు చేసేందుకు ఈనెల 29న ఎథిక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్టు తనకు అసెంబ్లీ సచివాలయం నుంచి నోటీసు వచ్చిందని చెప్పారు. సభలో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు ప్రకటించిన సమయానికి అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీయే మనుగడలో లేదని గుర్తు చేశారు. కమిటీయే లేనప్పుడు సబ్జెక్టును ఎలా సిఫారలు చేస్తారని ప్రశ్నించారు. దీన్నిబట్టే కౌశిక్ రెడ్డిపై ముందస్తు వ్యూహంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు దానం నాగేందర్, మందుల సామేలు, వీర్లపల్లి శంకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రవర్తించిన తీరుపై వీడియో రికార్డులు ఉన్నాయనీ, ముందుగా వారిపై ఎథిక్స్ కమిటీ చర్చించి చర్యలు సిఫారసు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంశాన్ని పరిశీలించాలని కోరారు. కానీ పార్టీ ఫిరాయింపులను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష సభ్యులపై కుట్రలు, అక్రమ వేధింపులకు ప్రభుత్వం పాల్పడుతున్నదని విమర్శించారు. రుణమాఫీ, పథకాలు ఎగ్గొట్టిన సీఎం రేవంత్ రెడ్డికి ఎథిక్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ రక్షణ గల్లీలో రాజ్యాంగ భక్షణ అన్నట్టుగా కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నదని అన్నారు. ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నదని చెప్పారు. 22-ఏ నిషేధిత జాబితా, హైడ్రా పేరిట పేద, మధ్యతరగతి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.
హామీల వైఫల్యం, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌‌కు పాల్పడుతున్నదని అన్నారు. సీఎం, మంత్రులపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎత్తిచూపుతున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే దమ్ముందా?అని రేవంత్‌‌రెడ్డికి ప్రశాంత్‌‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి, కె సంజయ్, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -