Thursday, August 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

‌మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

- Advertisement -

సాధన కోసం రాజీలేని పోరాటం
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : 
మాజీమంత్రి హరీశ్‌‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మోడల్ స్కూల్స్‌ను ‘010’ పద్దు కిందకు తెచ్చి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌‌లో టీచర్ల సంఘం నాయకులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు హరీశ్‌‌రావును కలిశారు. వారి ఆవేదనను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. గడిచిన 32 నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పాలకుల్లో కనికరం లేకపోవడం సీఎం రేవంత్ రెడ్డి అమానవీయ పాలనకు నిదర్శనమని తెలిపారు. 2004 తర్వాత సీపీఎస్ విధానంలో నియమితులై, ప్రాణాలు కోల్పోయిన సుమారు 40 మంది మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా, ఆగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వ జీవోలు 60, 58 ప్రకారం వారికి డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ పొందే పూర్తి అర్హత ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటిని మోడల్ స్కూల్స్‌కు అమలు చేయకపోవడం వల్ల ఆ కుటుంబాలు అనాథలై రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న మూడు వేల మంది టీచర్లకు ప్రభుత్వం ఐదు డీఏలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టి ఆర్థికంగా కుంగదీస్తోందని విమర్శించారు. ఈ డీఏ బకాయిల చెల్లింపు కోసం విద్యాశాఖ కోరిన రూ.93 కోట్ల అదనపు బడ్జెట్ దస్త్రానికి ప్రభుత్వం ఆమోదించలేని చెప్పారు. ఈ ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఒక్కో ప్రిన్సిపాల్‌కు రూ.3.52 లక్షలు, పీజీటీకి రూ.2.81 లక్షలు, టీజీటీకి రూ.2.36 లక్షల చొప్పున బకాయిలు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తాత్సారం చేయకుండా డీఏ బకాయిలను వెంటనే ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)‌ను వెంటనే వర్తింపజేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, పెండింగ్ డీఏల సాధన కోసం ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామనీ, అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -