కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
కంటైనర్ లారీని ఢీకొట్టిన ప్రయివేటు ట్రావెల్ బస్సు
ఆరుగురు మృతి.. 14మందికి తీవ్రగాయాలు
నుజ్జునుజ్జయిన మృతదేహాలు
కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఘటన
నవతెలంగాణ – కోదాడ టౌన్
రోడ్డుపై డివైడర్ను ఢీకొట్టి ఆగిన ఐరన్ రాడ్ల కంటైనర్ను ఎదురుగా వస్తున్న బస్సు బలంగా గుద్దడంతో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్ బస్సు ద్వారకుంట సమీపానికి చేరుకోగానే, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. ఈ క్రమంలో అటువైపు నుంచి వేగంగా వస్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఆ లారీని బలంగా ఢీకొనడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. లారీలోని ఐరన్ రాడ్లు బస్సులోకి దూసుకుని రావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండటంతో అసలేం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేకపోయింది.
బస్సులోనే ఆరుగురు మృతిచెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురవరపు షకీనా(24)(విజయవాడ), యాసరపు చిన్ని (31)(ప్రొద్దుటూరు), బొల్లిపంగు మేరీ జోష్నా (29)(విజయవాడ), చెన్నకేశవుల నాగేంద్రబాబు (31)(విజయవాడ), భావన(25), పిడికిటి లక్ష్మీ (25)గా గుర్తించారు. మరో 14మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో విజయవాడకు తరలించారు. మరికొంత మందిని ఖమ్మం, కోదాడ ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. వీరంతా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఒంగోలుకు చెందిన వారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ సందర్శించి ప్రమాద తీవ్రతను తెలుసుకున్నారు. అనంతరం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి బాధతులను పరామర్శించి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగురు మృతదేహాలను కోదాడ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



