ప్రతిష్టాత్మక ‘కొయికా’ ఫుల్ స్కాలర్షిప్తో
ఎంఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్ :
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెద్దపల్లి జిల్లాకు చెందిన వెనగంటి నిషిత దక్షిణ కొరియాలోని ప్రఖ్యాత క్యుంగ్బుక్ జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక ‘కొయికా’ పూర్తి స్కాలర్షిప్తోఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో అడ్మిషన్ సాధించారు. హైదరాబాద్ లో బుధవారం నిషిత మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన నిషితను అభినందించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన నిషిత, ఒంటరి తల్లి పెంపకంలో పెరిగారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ చిన్న అద్దె ఇంట్లో జీవితాన్ని గడిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. 15 ఏండ్లకు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బీసీ గురుకులాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. అనంతరం 19 ఏండ్లకు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) నుంచి కొరియన్ లాంగ్వేజ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. చదువులో విశేష ప్రతిభ కనబరుస్తూ రెండుసార్లు ప్రఖ్యాత పోస్కో స్కాలర్షిప్ను సొంతం చేసుకున్నారు. నిషితకు ఆరు భాషల్లో ప్రావీణ్యం ఉండడం విశేషం.
రైతులకు అండగా నిలవడమే లక్ష్యం..
దక్షిణ కొరియాలో ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి, ఆధునిక స్మార్ట్ వ్యవసాయ పద్ధతులను దేశంలో ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలవడమే తన లక్ష్యమని నిషిత ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నో సవాళ్లు, ఆటంకాలను ఎదుర్కొని ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న నిషిత అంకితభావం, పట్టుదల నేటి యువతకు నిజమైన స్ఫూర్తిదాయకమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కొనియాడారు. నిషితను ఆమె తల్లి వేముల ప్రవళికను ప్రత్యేకంగా అభినందించారు. నిషితను శాలువాతో సత్కరించారు. నిషిత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



