న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యారు యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. జనవరి 14న తూర్పు ఇంఫాల్‌లోని హట్టా కాంగ్జెబుంగ్‌లో బహిరంగ ర్యాలీతో యాత్రను ప్రారంభించనున్నట్టు పార్టీ ముందుగా ప్రకటించింది. అయితే బహిరంగ ర్యాలీ చేపట్టేందుకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అనుమతి నిరాకరణపై సీనియర్ కాంగ్రెస్ నేత కెసి. వేణుగోపాల్ స్పందించారు. ఎన్నికల సన్నాహాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా యాత్ర చేపడతామని అన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని, ఈ దేశ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ తగిన సమయంలోనే పోలీస్ క్లియరెన్స్‌ను అభ్యర్థించిందని చెప్పారు. ఎదురు దెబ్బలు యాత్రను అడ్డుకోలేవన్నారు. ఈ సమస్యను రాజకీయం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పేరుతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరించారని మణిపూర్‌పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం దురదష్టకరమని, ఈ చర్య ప్రజల, రాజకీయ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో యాత్రకు అనుమతి లేకపోవడంతో.. థౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్థలానికి మార్చినట్టు మేఘచంద్ర వెల్లడించారు. రాహుల్ చేపట్టనున్న ‘భారత్ జోడో న్యారు యాత్ర’ జనవరి 14న ప్రారంభమై మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది.