ఎలా ముందుకెళ్దాం?

How do we proceed?– ఢిల్లీలో సీఎం సమాలోచనలు
– కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ
–  మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ, లోక్‌సభ, నామినేటెడ్‌ పదవులపై చర్చ
–  ఢిల్లీలో ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ భవన్‌ నిర్మాణంపై ఆర్సీతో సమీక్షా సమావేశం
–  మంత్రి పదవుల కోసం అధిష్టానం చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక, లోక్‌సభ స్థానాలు, నామినేటెడ్‌ పదవులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ అధిష్టానంతో సమాలోచనలు చేశారు. మంత్రివర్గ విస్తరణ, సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలందిస్తోన్న వారిని ఎంపిక చేయడంలో ఎలా ముందుకెళ్దామనే అంశంపై ముఖ్య నేతల సూచనలు తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బిజీ బిజీగా గడిపారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఢిల్లీ చేరుకున్న రేవంత్‌ రెడ్డి నేరుగా లోథి రోడ్‌లోని ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ నివాసానికి వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు కేసీ వేణుగోపాల్‌తో సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)లో తీసుకున్న నిర్ణయాలను కేసీ వేణుగోపాల్‌కు రేవంత్‌ రెడ్డి వివరించారు. అలాగే ఈ నెల 28 నుంచి అమలు చేయాలని యోచిస్తోన్న మరో రెండు గ్యారెంటీల వివరాలను తెలిపారు. కొత్త ఏడాది కానుకగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. అలాగే మిగిలిన క్యాబినేట్‌ బెర్త్‌లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్‌ పదవులపై చర్చించినట్టు సమాచారం. అయితే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలా మంత్రివర్గంలో కొత్త వారికి చోటు, ఎమ్మెల్సీల ఎంపిక నిర్ణయాన్ని రేవంత్‌ రెడ్డికే అప్పగిస్తూ అధిష్టానం ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయాన్ని రేవంత్‌ రెడ్డికి కేసీ వేణుగోపాల్‌ తెలిపినట్టు సమాచారం.
అనంతరం ఢిల్లీలో తెలంగాణ సీఎంకు అధికారికంగా కేటాయించిన తుగ్లక్‌ రోడ్‌ 23 నివాసానికి వెళ్లారు. తొలిసారి ఈ ఇంటిని సందర్శించిన సీఎం, పలు మరమ్మతులకు సూచనలు చేసినట్టు తెలిసింది. అలాగే తుగ్లక్‌ రోడ్‌లో ఎంపీలకు ఇచ్చే విందు ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి యమునా బిల్డింగ్‌లోని తొమ్మిదో ఫ్లోర్‌ లోని ప్రస్తుత నివాసానికి చేరుకొని, కాసేపు రెస్ట్‌ తీసుకున్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నూతన తెలంగాణ భవన్‌ నిర్మాణం
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతన తెలంగాణ భవన్‌ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భవన్‌, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, భవన్‌ ఓఎస్డీ సంజరు జాజుతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భవన్‌ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న నిర్మాణాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్‌ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్‌, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్‌, 3.359 ఎకరాల్లో ఓల్డ్‌ నర్సింగ్‌ హాస్టల్‌, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్‌ ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తిలో) వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత భవన్‌ మ్యాప్‌ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలుసూచనలు ఇచ్చారు.
మంత్రి పదవి కోసం ఆశావాహుల చక్కర్లు
మంత్రివర్గం విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఆశావాహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఇదే విషయాన్ని వివరించారు. అయితే, ఇప్పటికే క్యాబినెట్‌లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉందంటూ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేమని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఏఐసీసీ హెడ్‌ ఆఫీస్‌లో ఆయన లాబీయింగ్‌ మొదలు పెట్టారు. సీఎం రేవంత్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. మరోవైపు తనకు మంత్రి పదవి ఇవ్వాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ సైతం అగ్రనేతలను కలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, ఫిరోజ్‌ ఖాన్‌లు మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో రేవంత్‌ను కలిసేందుకు యమునా క్వార్టర్స్‌కు వచ్చారు. అయితే వరుస సమావేశాలతో బిజీ కారణంగా సీఎం వారిని హైదరాబాద్‌లో కలుస్తానని చెప్పినట్టు తెలిసింది.

Spread the love