అప్రజాస్వామికంలో ఆల్‌టైం రికార్డ్‌

All time record in undemocratic– విపక్షాల మండిపాటు
– మరో 49 మంది ఎంపీల సస్పెన్షన్‌
– ఈ సెషన్‌లో మొత్తం 141 మందిపై వేటు
–  భారత పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
అప్రజాస్వామిక చర్యల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ప్రజావాణిని వినిపించే ప్రతిపక్షాల సభ్యులను పార్లమెంటు నుంచి గెంటివేసి తన మందబలంతోనే సమావేశాలను కొనసాగించింది. ప్రజాస్వామ్య మందిరాలుగా పరిగణించి చట్టసభల్లో సమాలోచనలు, సమగ్ర చర్చ జరగాలంటే ప్రతిపక్షాల ప్రాతినిధ్యం అవశ్యం. కానీ మోడీ సర్కార్‌ ప్రతిపక్ష సభ్యులు సభలో ఉన్నా.. లేకపోయినా గంపగుత్తగా సస్పెన్షన్‌ వేటు వేస్తూ నిరంకుశత్వాన్ని చాటుకుంటోంది. పార్లమెంటు భద్రతతో సహా దేశ ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చకు పట్టుబట్టినదే తడవుగా సదరు సభ్యులపై మోడీ సర్కార్‌ వేటు వేస్తూ వచ్చింది. ఇదే క్రమంలో లోక్‌సభలో మంగళవారం 49 మంది ప్రతిపక్షాల సభ్యులపై సస్పెన్షన్‌ విధించారు. సోమవారం వేటు పడ్డ 78 మంది. అంతకుముందు 14 మందితో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తంగా 141 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. భారత పార్లమెంటు చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ఒక సెషన్‌లో సభ్యులు సస్పెన్షన్‌కు గురికావడం ఇదే తొలిసారి. మంగళవారం సస్పెన్షన్‌కు గురైనవారిలో ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్‌, మనీష్‌ తివారీ, జమ్ముకాశ్మీర్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా ఉన్నారు. పార్లమెంటులో చోటుచేసుకున్న భద్రత వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని, సోమవారం సస్పెండ్‌ అయిన ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ‘ఇండియా’ ఫోరానికి చెందిన సభ్యులంతా మంగళవారం సభ ప్రారంభమవ్వగానే ముక్తంకంఠంతో పట్టుబట్టారు. దీనిపై సమాధానం చెప్పేందుకు సాహసించలేని మోడీ సర్కార్‌ నిలదీసిన ఎంపీలందరిపైనా ‘ప్రవర్తనా నియమావళి’ ఉల్లంఘన కింద సస్పెండ్‌ చేసింది. ఈ శీతాకాల సమవేశాల మొత్తానికి 49 మందినీ సస్పెండ్‌ చేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ‘ఇండియా’ ఫోరం ఎంపీలు అటు సభలోనూ, ఇటు సభ వెలుపులా ఆందోళన చేపట్టారు.
పార్టీలు వారీగా సస్పెండ్‌ అయిన ఎంపీల సంఖ్య
కాంగ్రెస్‌ 18, జేడీయూ 10, డీఎంకే 6, టీఎంసీ 4, ఎన్సీపీ 3, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 2, ఎస్పీ 2, ఐయూఎంఎల్‌ 1, ఆప్‌ 1, వీసీకే 1, బీఎస్పీ (పార్టీ సస్పెండ్‌ ఎంపీ) 1 మంగళవారం నాటి సమావేశాల్లో సస్పెండ్‌కు గురయ్యారు. స్పీకర్‌ ఆదేశాలు ధిక్కరించారనే పేరుతో సభ్యుల సస్పెన్షన్‌ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని మూజువాణీ ఓటుతో ఆమోదించారు. అనంతరం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ ‘సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దనే నిబంధన ఉంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వారు (ప్రతిపక్షాలనుద్దేశిస్తూ) నిరాశ చెందారు. అందుకే వారు ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు.
కాగా.. లోక్‌సభలో ఇప్పటికే గతవారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్‌ చేశారు. తాజా సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు లోక్‌సభలో 95 మందిపై వేటు పడినట్లైంది. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్‌ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది ప్రతిపక్ష ఎంపీలపై చర్యలు తీసుకున్నట్లైంది.
ఉభయ సభలు వాయిదా
ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో మంగళవారం కూడా ఉభయ సభలు స్తంభించాయి. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయడంతో పాటు తమ ఎంపిలపై సస్పెన్షన్‌ ను ఎత్తివేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. నిమిషాల్లో సభలను వాయిదా వేశారు. మరోవైపు, సస్పెన్షన్‌ కు గురైన ఎంపిలు అడిగిన 27 ప్రశ్నలను లోక్‌సభ ప్రశ్నల జాబితా నుంచి తొలగించారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే లోక్‌సభలో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ చట్టం (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, కేంద్ర వస్తువులు, సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు, తాత్కాలిక పన్నుల సేకరణ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు.

Spread the love