ముగిసిన పార్లమెంట్‌

– ఉభయ సభల్లో 21 బిల్లులు ఆమోదం
– లోక్‌సభలో 44 శాతం, రాజ్యసభలో 63 శాతం కార్యకలాపాలు
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 20న ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 23 రోజుల పాటు 17 సిట్టింగ్‌లు నిర్వహించి శుక్రవారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఉభయ సభల్లో మొత్తం 21 బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయ సభల్లో ఒక్కో బిల్లును ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ బిల్లు అటవీ సంరక్షణ బిల్లు, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు, సినిమాటోగ్రాఫ్‌ బిల్లు, మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ బిల్లు, జీవ వైవిధ్య బిల్లు, ఆఫ్‌షోర్‌ ఏరియాస్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ బిల్లు, జనవిశ్వాస్‌ బిల్లు, జనన మరణాల నమోదు బిల్లు, మధ్యవర్తిత్వ బిల్లు మొదలైనవి ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై 20 గంటల పాటు చర్చ జరిగింది. మొత్తం ఏడుగురు మంత్రులతో సహా 58 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. మూజువాణి ఓటు ఈ తీర్మానాన్ని సభ తిరస్కరించింది. లోక్‌సభలో 44 శాతం కార్యకలాపాలు జరగగా, రాజ్యసభ 63 శాతం కార్యకలాపాలు జరిగాయి.
ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా సస్పెండ్‌
రాజ్యసభ ప్రారంభం కాగానే పదవీ విరమణ చేయనున్న గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులకు సభ వీడ్కోలు పలికింది. రాజ్యసభ నుంచి ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దాను సస్పెండ్‌ చేశారు. ఆయనను సస్పెండ్‌ చేయాలని సభా నాయకుడు, కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని సభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఆప్‌ ఎంపి సంజరు సింగ్‌పై వచ్చిన ఫిర్యాదులపై ప్రివిలేజ్‌ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు ఆయన సస్పెన్షన్‌ వ్యవధిని పొడిగించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత లోక్‌సభ సమావేశాలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరిని సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 23 పార్టీలు, 142 మంది ఎంపిలు లోక్‌సభ కార్యక్రమాలను బహిష్కరించారు. పార్లమెంట్‌ సమావేశాల ముగింపు సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆతిథ్యాన్ని కూడా తిరస్కరించారు. అధిర్‌ రంజన్‌ చౌదరి సస్పెన్షన్‌ రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఎంపిలు లేఖ రాశారు. శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణంలో బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్దకు ప్రదర్శన నిర్వహించారు. అధిర్‌ రంజన్‌ చౌదరి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నినాదాలు హౌరెత్తించారు. సస్పెన్షన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిదని ఖర్గే విమర్శించారు.

Spread the love