రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదు
47 మందికిపైగా మృతి..మరో 50 మందికి గాయాలు
జకార్తా : ఇండోనేషియాలో శనివారం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో, 47 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అంతకుముందు అదే ప్రాంతంలో 6.1 శాతం తీవ్రతతో ప్రకంపనాలు సంభవించాయి. దీంతో, తొలుత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర మట్టాల్లో గణనీయమైన మార్పులు వచ్చే సూచనలేవీ లేవని ఇండోనేషియా వాతావరణ సంస్థ చెప్పడంతో, అధికారులు ఆ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల (6 మైళ్ల) లోతులో ఈ భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జీఎస్) తెలిపింది. ఈ భూకంపం తర్వాత కనీసం 235 ప్రకంపనలు సంభవించాయని, వాటిలో అతిపెద్దది 6.2 తీవ్రతతో నమోదైందని వాతావరణ సంస్థ తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి సుహర్యాంటో మాట్లాడుతూ, మృతుల్లో అత్యధికులు సిక్కా, మంగరాయ్, తూర్పు మంగరాయ్‌లకు చెందిన వారని చెప్పారు.
కనీసం 157 ఇండ్లు నేలమట్టమయ్యాయి. మరో 200 ఇండ్లు దెబ్బతిన్నాయి. పాఠశాలలు, వైద్య కేంద్రాలు, చర్చిలతో సహా వందకు పైగా ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. తూర్పు నుసా తెంగారాలో అనేక ద్వీపాలు ఉండటంతో అత్యవసర సహాయక చర్యల కోసం అధికారులు మూడు హెలికాప్టర్లు, ఒక సహాయక నౌకను వినియోగించారు. మంగరాయ్, తూర్పు మంగరాయ్ రీజెన్సీలలోని తీరప్రాంత గ్రామాలకు కొన్ని చిన్న సునామీలు వచ్చినట్లు చేపల పడవలు, మౌలిక సదుపాయాలకు కొంత మేర నష్టం సంభవించింది. ఎండే రీజెన్సీలో సుమారు 700 కిలోమీటర్ల పర్వత రహదారి ట్రాన్స్-ఫ్లోరెస్ హైవే కొండచరియలు విరిగిపడటంతో మూసుకుపోయింది.



